
సెంచూరియన్:టీమిండియా ప్రధాన పేసర్ మొహ్మద్ షమీపై దక్షిణాఫ్రికా మాజీ బౌలర్ ఫానీ డివిలియర్స్ ప్రశంసలు కురిపించాడు. ప్రస్తుతం భారత క్రికెట్ జట్టులో ఉన్న బౌలర్లలో షమీని అత్యుత్తమని ఫానీ కొనియాడాడు. దక్షిణాఫ్రికా పేస్ దళంలో ఇమిడిపోయే అన్ని లక్షణాలు షమీలో ఉన్నాయన్నాడు. దక్షిణాఫ్రికా పేస్ విభాగంలో సులువుగా షమీని చేర్చుకోవడానికి తమ జట్టుకు ఎటువంటి అభ్యంతరం ఉండదంటూ ఒక అడుగు ముందుకేసి మరీ పొగిడాడు.
'టీమిండియా జట్టులో షమీనే ప్రస్తుతం బెస్ట్ పేసర్. అతడు మా పేస్ విభాగంలో సులువుగా ఇమిడిపోగలడు. చక్కని స్వింగర్లు సంధిస్తాడు. వేగంగా పరుగెత్తి 140 కిలోమీటర్ల వేగంతో బంతులు విసురుతాడు. దిగ్గజ బౌలర్లు మెక్‌గ్రాత్, షాన్ పొలాక్, ఇయాన్ బోథమ్, డేల్ స్టెయిన్ మాదిరిగా బౌలింగ్ చేస్తాడు. కచ్చితంగా చెప్పాలంటే అతడు నికార్సైన పేస్ బౌలర్. సఫారీ గడ్డపై బౌలింగ్ చేయాలంటే ఔట్ స్వింగ్ చేయడం చాలా కీలకం. షమి అది చేయగలడు. భువనేశ్వర్‌కు సైతం ఆ సత్తా ఉంది. కానీ రెండో టెస్టులో భువీని ఆడించకపోవడ నన్ను విస్మయానికి గురి చేసింది' అని ఫానీ డివిలియర్స్ తెలిపాడు. తమ గడ్డపై భారత ఆటగాళ్లు సాంప్రదాయ బద్ధంగా ఆడటంలో విఫలమై ఘోర ఓటమి చవిచూశారన్నాడు.