జరీన్‌ ఎవరు.. అభినవ్‌ నీకు రూల్స్‌ తెలుసా?

Mary Slams Zareen On Olympics Selection Controversy - Sakshi

న్యూఢిల్లీ:   దిగ్గజ మహిళా బాక్సర్‌ మేరీకోమ్‌తో ట్రయల్స్‌ నిర్వహించిన తర్వాత ఒలింపిక్స్‌ క్వాలిఫయింగ్‌కు ఎంపిక చేయాలని  తెలంగాణ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ కొన్ని రోజులుగా డిమాండ్‌ చేస్తున్నారు. ఎటువంటి పోటీ లేకుండా మేరీకోమ్‌ను నేరుగా క్వాలిఫయింగ్‌ టోర్నీకి పంపడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే క్రీడాశాఖా మంత్రి కిరణ్‌ రిజ్జుకు సైతం నిఖత్‌ లేఖ కూడా రాశారు. దీనిపై తానేమీ చేయలేనని, ఇది బాక్సింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా(బీఎఫ్‌ఐ) తీసుకున్న నిర్ణయం కావడంతో దానికి కట్టుబడి ఉండాల్సిందేనన్నారు. బీఎఫ్‌ఐ స్వయం ప్రతిపత్తిగల సంస్థ కావడంతో దానికే సొంత నిర్ణయాలు తీసుకునే అధికారం ఉంటుందన్నారు. దీనికి జరీన్‌ కృతజ్ఞతలు కూడా తెలియజేశారు. వెంటనే స్పందించినందకు ధన్యవాదాలు అంటూ తెలిపారు. దేశానికి పేరు తెచ్చేందుకు తీవ్రంగా శ్రమించే క్రీడాకారులు ఆశ్రిత పక్షపాతం, బంధుప్రీతితో నష్టపోవద్దని కోరుకుంటున్నానని జరీన్‌ తన సమాధానంలో పేర్కొన్నారు.

కాకపోతే ఇలా కిరణ్‌ రిజ్జు వరకూ ఈ వివాదాన్ని తీసుకు రావడంతో మేరీకోమ్‌ మండిపడ్డారు. ‘ అసలు ఆమె ఎవరు.. ఆమె గురించి నాకు అస్సలు తెలియదు’ అంటూనే కాస్త ఘాటుగా స్పందించారు. ‘ ఈ వివాదాన్ని తెరపైకి తెవడంతో నేను షాక్‌ అయ్యా. నేను ఎనిమిది వరల్డ్‌ చాంపియన్స్‌ పతకాలు గెలిచా. అందులో ఆరు స్వర్ణ పతకాలు ఉన్నాయి. ఎవర్నీ పంపాలో బాక్సింగ్‌ ఫెడరేషన్‌ నిర్ణయిస్తుంది. అటువంటప్పుడు నీ ఏడుపు ఏమిటి. భారత బాక్సింగ్‌ జట్టులో చోటు కోసం లాబీయింగ్‌ చేయకు’ అంటూ మేరీకోమ్‌ ఎదురుదాడికి దిగారు.

అదే సమయంలో జరీన్‌కు మద్దతుగా నిలిచిన భారత విఖ్యాత షూటర్‌ అభినవ్‌ బింద్రాపై మేరీకోమ్‌ నోరు పారేసుకున్నారు ‘నీ పని నువ్వు చూసుకో. బాక్సింగ్‌లో దూరకు. నీకు బాక్సింగ్‌ గురించి కానీ రూల్స్‌ కానీ తెలియదు. నేను ఏమైనా షూటింగ్‌ గురించి మాట్లాడానా. నీకు బాక్సింగ్‌ పాయింట్ల విధానం తెలుసా’ అంటూ మండిపడ్డారు. దీనిపై విమర్శలు వస్తున్నాయి. మేరీకోమ్‌ ఎంతటి చాంపియన్‌ అయినా కానీ ఇలా మాట్లాడటం తగదంటున్నారు అభిమానులు. దేనికైనా హుందాగా సమాధానం చెబితే బాగుంటుందని హితవు పలుకుతున్నారు. కొందరు మేరీకోమ్‌ అతి చేస్తుందంటూ విమర్శిస్తున్నారు. మేరీకోమ్‌-జరీన్‌లు 51 కేజీల వెయిట్‌ కేటగిరీలో ఉండటంతోనే ఆసియా ఒలింపిక్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీ సెలక్షన్‌ ట్రయల్స్‌ బౌట్‌ వివాదం పెద్దదిగా మారింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top