35 ఏళ్ల తరువాత జో రూట్..
ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు జో రూట్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.
చెన్నై:ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు జో రూట్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. భారత్ తో జరుగుతున్నసిరీస్లో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్న జో రూట్.. యాభై, అంతకంటే ఎక్కువ పరుగులను ఐదుసార్లు సాధించాడు. తద్వారా 35 ఏళ్ల రికార్డును జో రూట్ సవరించాడు. భారత్లో ఒక సిరీస్ లో ఓ విదేశీ ఆటగాడు యాభై , అంతకుమించి పరుగులు చేయడం 1981 తరువాత ఇదే తొలిసారి.
తొలి టెస్టులో సెంచరీ చేసిన జోరూట్.. రెండో టెస్టులో హాఫ్ సెంచరీ సాధించాడు. ఆపై మూడు, నాలుగు టెస్టుల్లో హాఫ్ సెంచరీలు సాధించాడు.చెన్నైలో జరుగుతున్న ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్లో జోరూట్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. అంతకుముందు భారత్ లో చివరిసారి ఇదే తరహాలో ఒక సిరీస్ లో సెంచరీతో పాటు, నాలుగు హాఫ్ సెంచరీలు చేసిన విదేశీ ఆటగాళ్లు ఇయాన్ బోథమ్, గ్రాహమ్ గూచ్లు మాత్రమే. ఆ తరువాత ఇంతకాలానికి జో రూట్ ఆ రికార్డును సవరించాడు.