
చెన్నై: ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఇబ్బందులు తప్పవని ఆసీస్ దిగ్గజ బౌలర్ గ్లెన్ మెక్‌గ‍్రాత్ అభిప్రాయపడ్డాడు. పరుగుల యంత్రం కోహ్లి విశేష అనుభవం ఉన్న ఆటగాడైనప్పటికీ ఇంగ్లండ్ గడ్డపై అండర్సన్ నుంచి ముప్పు పొంచి వుందన్నాడు. ప్రస్తుతం సొంత గడ్డపై సత్తాచాటుతున్న అండర్సన్.. కోహ్లిపై పైచేయి సాధించడం ఖాయమని జోస్యం చెప్పాడు.
‘విరాట్ కోహ్లి అనుభవం ఉన్న ఆటగాడు. నాణ్యమైన ఆటగాడు కూడా. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. కానీ అక్కడ పరిస్థితులు మనకు అనుగుణంగా ఉండవు. ఆ జట్టు బౌలర్ అండర్సన్ ప్రస్తుతం అద్భుతంగా రాణిస్తున్నాడు. అండర్సన్ బౌలింగ్‌ను ఎదుర్కొనే క్రమంలో కోహ్లి తడబడతాడనే అనుకుంటున్నా. చూద్దాం. ఏం జరుగుతుందో. ఇంగ్లిష్ పర్యటనలో జట్టంతా ఏ ఒక్క ఆటగాడిపైనో ఆధారపడటం సరికాదు. ఒకవేళ ఏదైనా మ్యాచ్‌లో అతడు ఫెయిలైనా మిగిలిన వారు తమ వంతు బాధ్యత నిర్వర్తించాలి. భారత జట్టులో చతేశ్వర పుజారా కీలక ఆటగాడు. మరి ఈ పర్యటనలో ఏ మేరకు రాణిస్తాడో చూడాలి. భారత బౌలర్లు భువనేశ్వర్, బుమ్రా చాలా బాగా బౌలింగ్ వేస్తున్నారు. వీరిద్దరూ ఇంగ్లండ్ పర్యటనలో విజయవంతం అవుతారనే అనుకుంటున్నా’ అని మెక్‌గ్రాత్ పేర్కొన్నాడు.