ఆంధ్ర అదిరే ఆట | it’s curtains for Tamil Nadu | Sakshi
Sakshi News home page

ఆంధ్ర అదిరే ఆట

Feb 12 2018 4:31 AM | Updated on Jun 2 2018 2:19 PM

it’s curtains for Tamil Nadu - Sakshi

శ్రీకర్‌ భరత్‌, బోడపాటి సుమంత్‌

చెన్నై: రంజీ ట్రోఫీలో నాకౌట్‌ దశకు చేరే అవకాశాన్ని త్రుటిలో కోల్పోయిన ఆంధ్ర క్రికెట్‌ జట్టు దేశవాళీ వన్డే టోర్నమెంట్‌ విజయ్‌ హజారే ట్రోఫీలో మాత్రం జోరు మీదుంది. పటిష్టమైన తమిళనాడుతో ఆదివారం జరిగిన గ్రూప్‌ ‘సి’ మ్యాచ్‌లో ఆంధ్ర 29 పరుగుల తేడాతో గెలిచింది. ఈ టోర్నీలో ఆంధ్రకిది వరుసగా నాలుగో విజయం కావడం విశేషం. తాజా గెలుపుతో ఆంధ్ర 16 పాయింట్లతో గ్రూప్‌ ‘సి’లో అగ్రస్థానంలో నిలిచి  క్వార్టర్‌ ఫైనల్‌ చేరే అవకాశాలను మరింత మెరుగుపర్చుకుంది.

తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆంధ్ర నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్లకు 276 పరుగులు చేసింది. ఓపెనర్‌ శ్రీకర్‌ భరత్‌ (85 బంతుల్లో 82; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు), రికీ భుయ్‌ (51 బంతుల్లో 52; ఒక ఫోర్, 3 సిక్స్‌లు), బోడపాటి సుమంత్‌ (67 బంతుల్లో 62 నాటౌట్‌; 6 ఫోర్లు) అర్ధ సెంచరీలు సాధించారు. అశ్విన్‌ హెబర్‌ (38; 4 ఫోర్లు, ఒక సిక్స్‌)తో కలిసి తొలి వికెట్‌కు భరత్‌ 87 పరుగులు జోడించాడు. అనంతరం 277 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన తమిళనాడు 48.5 ఓవర్లలో 247 పరుగులకు ఆలౌటై ఓటమి పాలైంది. ఆంధ్ర బౌలర్లలో శివ కుమార్‌ (2/53), అయ్యప్ప (2/37), భార్గవ్‌ భట్‌ (2/46), విహారి (2/41) రెండేసి వికెట్లు తీశారు. సోమవారం జరిగే తదుపరి మ్యాచ్‌లో గుజరాత్‌తో ఆంధ్ర తలపడుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement