చలో దుబాయ్@ ఐపీఎల్‌-2020

IPL 2020 Will Be Held In United Arab Emirates - Sakshi

యూఏఈలో ఐపీఎల్‌–2020

గవర్నింగ్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ బ్రిజేశ్‌ పటేల్‌ ప్రకటన

త్వరలో తేదీలు ఖరారు

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) మరోసారి అరబ్‌ దేశం చేరింది. దేశంలో కరోనా విజృంభిస్తున్నా సరే... ఎలాగైనా ఐపీఎల్‌ ఆదాయాన్ని కోల్పోకూడదని పట్టుదలగా ఉన్న భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) సరైన వేదికగా కనిపించింది. దాంతో అక్కడే టోర్నీ నిర్వహణకు పచ్చ జెండా ఊపింది. తమ వద్ద లీగ్‌ నిర్వహించుకోవచ్చంటూ గతంలోనే యూఏఈ ఇచ్చిన ప్రతిపాదనకు భారత బోర్డు సరే అని చెప్పింది. ఇప్పుడు దీనిని గవర్నింగ్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ బ్రిజేశ్‌ పటేల్‌ కూడా ఖరారు చేశారు. ఇక లీగ్‌ తేదీలు ప్రకటించడమే తరువాయి. ప్రత్యక్షంగా మ్యాచ్‌లు చూడలేకపోతున్నా... టీవీ ద్వారా అయినా ఐపీఎల్‌ వినోదం దక్కనుండటం సగటు క్రికెట్‌ అభిమానికి సంతోషం.

ముంబై: ఐపీఎల్‌–2020ని యూఏఈలో నిర్వహించడం ఖాయమైంది. టోర్నీ మొత్తం అక్కడే జరపనున్నట్లు లీగ్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ చైర్మన్, భారత మాజీ క్రికెటర్‌ బ్రిజేశ్‌ పటేల్‌ ప్రకటించారు. వచ్చే వారం జరిగే మరో సమావేశంలో తుది షెడ్యూల్‌తోపాటు ఇతర వివరాలను ప్రకటిస్తామని ఆయన చెప్పారు. టి20 ప్రపంచకప్‌ వాయిదా కోసం ఎదురుచూస్తూ వచ్చిన బీసీసీఐ ఇప్పుడు ఆ ప్రకటన రాగానే లీగ్‌ కార్యాచరణకు సిద్ధమైంది. కోవిడ్‌–19 కారణంగా పలు ఆంక్షలు కొనసాగుతున్న నేపథ్యంలో వివిధ అంశాలపై కేంద్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి ఉందని పటేల్‌ చెప్పారు.

షెడ్యూల్‌ ఎప్పుడంటే...
ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే సెప్టెంబర్‌ 26 నుంచి నవంబర్‌ 7 వరకు టోర్నీ జరిగే అవకాశం కనిపిస్తోంది. లీగ్‌ తర్వాత కొద్ది రోజులకే భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లాల్సిన ఉన్న కారణంగా ఆటగాళ్లకు తగినంత విరామం ఇవ్వాలని బోర్డు భావిస్తోంది.

ప్రత్యేక విమానాల్లో...
కోవిడ్‌–19కు సంబంధించి మన దేశంలో పలు ఆంక్షలు కొనసాగుతున్నాయి. లీగ్‌ విదేశంలో జరిపినా భారత ప్రభుత్వం నుంచి అనుమతి కావాలి. పైగా విదేశీ ప్రయాణాలపై కూడా నిషేధం ఉంది. దీనిపై ఇప్పటికే బీసీసీఐ అనుమతి కోరింది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా తనయుడు జై షా బీసీసీఐ కార్యదర్శిగా ఉండటంతో ఇది లాంఛనమే కావచ్చు. భారత క్రికెటర్లు ప్రత్యేక విమానాల్లో వెళితే... విదేశీ ఆటగాళ్లు నేరుగా యూఏఈ చేరుకుంటారు.

యూఏఈ ప్రభుత్వ అనుమతి?
అక్కడి ప్రభుత్వం ఇంకా స్పందించలేదు. బీసీసీఐ ఇప్పుడు తమ తరఫు నుంచి స్పష్టతనిచ్చిన తర్వాత నిర్ణయం రావచ్చు. అయితే గతంలో యూఏఈ బోర్డు ఐపీఎల్‌ను తమ వద్ద నిర్వహించమని స్వయంగా విజ్ఞప్తి చేసింది కాబట్టి ఈ విషయంలో సమస్య ఉండకపోవచ్చని భారత బోర్డు భావిస్తోంది. ఇప్పటికే యూఏఈ అనుమతి కోసం బోర్డు దరఖాస్తు చేసింది. 

ప్రేక్షకులకు ప్రవేశముందా?
ఇది కూడా యూఏఈ ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. మంగళవారం నాటికి యూఏఈలో సుమారు 57 వేల కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే కోలుకున్నవారి సంఖ్య కూడా 49 వేలు ఉండటం విశేషం. కాబట్టి అక్కడ కరోనా మహమ్మారి తీవ్రత తక్కువే. అయితే బీసీసీఐ మాత్రం ప్రేక్షకుల విషయాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో టీవీ, వెబ్‌ ప్రసారాల ఆదాయమే లక్ష్యంగా ఖాళీ మైదానాల్లోనైనా నిర్వహించేందుకు సిద్ధంగా ఉంది. ఇందుకోసం టికెట్ల ద్వారా వచ్చే ‘గేట్‌ రెవెన్యూ’ కోల్పోయినా నష్టం లేదని బీసీసీఐ, ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్, ఫ్రాంచైజీలు భావిస్తున్నాయి.

మ్యాచ్‌ల వేదికలు, ఏర్పాట్లు...
దుబాయ్, అబుదాబి, షార్జా వేదికలుగా టోర్నీ జరుగుతుంది. మన దేశంలో 2014లో సార్వత్రిక ఎన్నికలు జరిగిన సమయంలో ఐపీఎల్‌ తొలి భాగం (20 మ్యాచ్‌లు) ఇక్కడే జరిగాయి. అన్ని వసతులున్న  అత్యాధునిక స్టేడియాలు ఉండటంతో పాటు గతానుభవంతో బీసీసీఐకి ఇక్కడ నిర్వహణ కష్టం కాకపోవచ్చు. లీగ్‌కు కుదించకుండా పూర్తి స్థాయిలో 60 మ్యాచ్‌లు జరుపుతామని బ్రిజేశ్‌ పటేల్‌ స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌ (ఎస్‌ఓపీ)ను పాటించాల్సి ఉంటుంది.

ఐసీసీ మార్గనిర్దేశకాలు పరిగణలోకి తీసుకొని టోర్నీ జరపాలి. బయో–బబుల్‌ సెక్యూరిటీలో నిర్వహణ దాదాపు అసాధ్యం. క్వారంటైన్‌ విషయంలో యూఏఈ ప్రభుత్వ నిబంధనలు కచ్చితంగా అమలు చేయాల్సిందే. ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే ఐపీఎల్‌ జట్లు కనీసం నెల రోజుల ముందుగా ఆ దేశంలో మకాం వేయాల్సి ఉంటుంది. 60 ఏళ్లు దాటినవారు (సునీల్‌ గావస్కర్‌ తదితరులు) తమ ఇంటినుంచే కామెంటరీ చేసే అవకాశం ఉందో పరిశీలిస్తున్నారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top