‘ఐదు’లో అదుర్స్‌

The Indian team ended the one day series with another win - Sakshi

చివరి వన్డేలో 35 పరుగులతో భారత్‌ విజయం

 న్యూజిలాండ్‌పై 4–1తో సిరీస్‌ సొంతం

అంబటి రాయుడు 90

రాణించిన పాండ్యా, శంకర్, జాదవ్‌

బుధవారం తొలి టి20   

కివీస్‌ గడ్డపై భారత ఆట అద్భుతంగా ‘స్వింగ్‌’ అయింది. గత పోరు పరాభవాన్ని ఒక్క మ్యాచ్‌కే పరిమితం చేస్తూ టీమిండియా మళ్లీ సత్తా చాటింది. చివరి మ్యాచ్‌లో ఆరంభ తడబాటును అధిగమించి తక్కువ స్కోరుతోనే ప్రత్యర్థికి సవాల్‌ విసిరిన రోహిత్‌ సేన మరో చక్కటి బౌలింగ్‌ ప్రదర్శనతో వన్డే పోరును విజయవంతంగా ముగించింది. 4–1తో సిరీస్‌ గెలుచుకొని గత పర్యటనలో ఓడిన నాలుగు వన్డేలకు సరైన ప్రతీకారం తీర్చుకుంది. 

 పది ఓవర్లు కూడా పూర్తి కాకముందే భారత్‌ స్కోరు 18/4. ప్రత్యర్థి పేస్‌కు మళ్లీ కుప్పకూలడం ఖాయమన్నట్లుగా కనిపించింది. కానీ కివీస్‌కు ఈసారి మన జట్టు ఆ అవకాశం ఇవ్వలేదు. ముందుగా రాయుడు, విజయ్‌ శంకర్‌ తమ బ్యాటింగ్‌తో పరిస్థితిని చక్కదిద్దితే, హార్దిక్‌ పాండ్యా సిక్సర్ల మోత జట్టును మెరుగైన స్థితిలో నిలిపింది. బౌలింగ్‌లో ఎప్పటిలాగే షమీ శుభారంభానికి తోడు చహల్, కేదార్‌ జాదవ్‌ స్పిన్‌ సత్తాతో మ్యాచ్‌ మన ఖాతాలో చేరింది.   

వెల్లింగ్టన్‌: న్యూజిలాండ్‌ గడ్డపై భారత జట్టు మరో చక్కటి విజయంతో వన్డే సిరీస్‌ను ముగించింది. ఆదివారం ఇక్కడ జరిగిన ఐదో వన్డేలో భారత్‌ 35 పరుగుల తేడాతో కివీస్‌ను ఓడించింది. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 49.5 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌటైంది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అంబటి రాయుడు (113 బంతుల్లో 90; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. విజయ్‌ శంకర్‌ (64 బంతుల్లో 45; 4 ఫోర్లు), కేదార్‌ జాదవ్‌ (45 బంతుల్లో 34; 3 ఫోర్లు) రాణించారు. రాయుడు, శంకర్‌ ఐదో వికెట్‌కు 98 పరుగులు జత చేశారు. చివర్లో హార్దిక్‌ పాండ్యా (22 బంతుల్లో 45; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు ప్రదర్శన మరో విశేషం.

టాడ్‌ ఆస్టల్‌ వేసిన ఇన్నింగ్స్‌ 47వ ఓవర్లో పాండ్యా వరుసగా మూడు సిక్సర్లు కొట్టాడు. అనంతరం న్యూజిలాండ్‌ 44.1 ఓవర్లలో 217 పరుగులకే ఆలౌటైంది. జిమ్మీ నీషమ్‌ (32 బంతుల్లో 44; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), విలియమ్సన్‌ (39), లాథమ్‌ (37) ఫర్వాలేదనిపించారు. చహల్‌ 3, షమీ 2 వికెట్లు పడగొట్టారు. నాలుగో వన్డే మినహా మిగతా నాలుగు మ్యాచ్‌లు గెలుచుకున్న భారత్‌ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 4–1తో సొంతం చేసుకుంది. నిలకడైన బౌలింగ్‌తో 4 ఇన్నింగ్స్‌లలో కలిపి 9 వికెట్లు తీసిన షమీ ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌’గా నిలిచాడు. టి20 సిరీస్‌లో తొలి మ్యాచ్‌ బుధవారం జరుగుతుంది.  

కీలక భాగస్వామ్యాలు... 
భారత జట్టుకు లభించిన ఆరంభం చూస్తే నాలుగో వన్డే ఫలితమే పునరావృతమయ్యేలా కనిపించింది. స్వింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై కివీస్‌ పేసర్లు హెన్రీ, బౌల్ట్‌ చెలరేగిపోయారు. ఇబ్బంది పడుతూ ఆడిన రోహిత్‌ శర్మ (2)ను హెన్రీ ఔట్‌ చేయగా, తర్వాతి ఓవర్లోనే ధావన్‌ (6)ను బౌల్ట్‌ పెవిలియన్‌ పంపించాడు. మరుసటి ఓవర్లోనే సునాయాస క్యాచ్‌ ఇచ్చిన గిల్‌ (7) తన రెండో అవకాశాన్ని కూడా వృథా చేసుకున్నాడు. బౌల్ట్‌ అద్భుత బంతికి ధోని (1) కూడా క్లీన్‌ బౌల్డయ్యాడు. ఈ స్థితిలో స్కోరు మరోసారి 100 పరుగులైనా దాటుతుందా అనిపించింది. అయితే రాయుడు, శంకర్‌ కీలక భాగస్వామ్యంతో జట్టును ఆదుకున్నారు.

నిలదొక్కుకున్నాక చక్కటి షాట్లు ఆడారు. కెరీర్‌ తొలి మూడు మ్యాచ్‌లలో బ్యాటింగ్‌ చేయని శంకర్‌... ఇప్పుడు లభించిన తొలి అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకున్నాడు. కఠిన పరిస్థితుల్లో, తీవ్ర ఒత్తిడి సమయంలో బరిలోకి దిగి తన సామర్థ్యాన్ని ప్రదర్శించాడు. అయితే సమన్వయ లోపంతో రనౌటై శంకర్‌ నిరాశగా వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన జాదవ్‌ కూడా రాయుడుకు అండగా నిలిచి చకచకా పరుగులు చేశాడు. వీరిద్దరు తక్కువ వ్యవధిలో వెనుదిరగ్గా... చివర్లో పాండ్యా మెరుపు బ్యాటింగ్‌ భారత్‌ స్కోరును 250 పరుగులు దాటించింది.
 
అదే తడబాటు... 
కివీస్‌కు మరోసారి శుభా రంభం లభించలేదు. షమీ దెబ్బకు నికోల్స్‌ (8) తొందరగానే ఔట్‌ కాగా... మున్రో (24; 2 ఫోర్లు, 1 సిక్స్‌) కూడా షమీ బౌలింగ్‌లోనే బౌల్డయ్యాడు. ఆ వెంటనే టేలర్‌ (1)ను పాండ్యా వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. అయితే రీప్లేలో బంతి వికెట్ల మీద నుంచి వెళుతున్నట్లుగా కనిపించింది. టేలర్‌ రివ్యూ కోరకపోవడంతో కివీస్‌ స్కోరు 38/3 వద్ద నిలిచింది. ఈ దశలో విలియమ్సన్, లాథమ్‌ కలిసి ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే భారత బౌలింగ్‌ కట్టుదిట్టంగా సాగడంతో పరుగుల వేగం మందగించింది. విలియమ్సన్‌ ఔటయ్యాక... కొద్ది సేపటికే చహల్‌ తన వరుస ఓవర్లలో లాథమ్, గ్రాండ్‌హోమ్‌ (11)లను ఎల్బీడబ్ల్యూగా వెనక్కి పంపించాడు. నీషమ్‌ క్రీజ్‌లో ఉన్నంత సేపు కివీస్‌కు విజయంపై ఆశలు ఉన్నా... అతని రనౌట్‌తో పరిస్థితి మారిపోయింది. 

రాయుడు మార్క్‌... 
మ్యాచ్‌లో చక్కటి ఇన్నింగ్స్‌తో తెలుగు తేజం అంబటి రాయుడు జట్టులో తన విలువేమిటో మరోసారి చూపించాడు. అతను క్రీజ్‌లోకి వచ్చే సమయానికి స్కోరు 12/2... వెల్లింగ్టన్‌ మరో హామిల్టన్‌లా మారలేదంటే రాయుడే కారణం. ఐదో వన్డేలో అతని ఆట జట్టుకు ప్రాణం పోసింది. పరిస్థితులను బట్టి మొదట్లో నిలదొక్కుకునేందుకు ప్రయత్నించిన రాయుడు, ఆ తర్వాత ధాటిని ప్రదర్శించాడు. తొలి 36 బంతుల్లో 7 పరుగులే చేసిన అతను తర్వాతి బంతికి మొదటి ఫోర్‌ కొట్టాడంటే ఎంత సంయమనంతో బ్యాటింగ్‌ చేశాడో అర్థం చేసుకోవచ్చు. కొద్దిసేపటికి గ్రాండ్‌హోమ్‌ ఓవర్లో వరుసగా 4, 6 కొట్టి రాయుడు గేర్‌ మార్చాడు. మున్రో బౌలింగ్‌లో భారీ సిక్స్‌ బాదిన అనంతరం గ్రాండ్‌హోమ్‌ ఓవర్లోనే వరుసగా రెండు ఫోర్లతో 86 బంతుల్లో రాయుడు అర్ధ సెంచరీ పూర్తయింది. మళ్లీ మున్రో ఓవర్లోనే కొట్టిన రెండు భారీ సిక్సర్లు అతని ఇన్నింగ్స్‌లో హైలైట్‌గా నిలిచాయి.

అంతకుముందు 60 పరుగుల వద్ద లాంగాన్‌లో బౌల్ట్‌ క్యాచ్‌ వదిలేయడంతో రాయుడు బతికిపోయాడు. హెన్రీ బౌలింగ్‌లో మూడు ఫోర్లు కొట్టి 90కి చేరుకున్న రాయుడుకు సెంచరీ చేజారిపోయింది. మరో భారీ షాట్‌కు ప్రయత్నించి ఎక్స్‌ట్రా కవర్‌లో మున్రోకు క్యాచ్‌ ఇవ్వడంతో అతని ఆట ముగిసింది. తను ఎదుర్కొన్న చివరి 31 బంతుల్లో 46 పరుగులు చేసిన అతను లెక్క సరి చేసే ప్రయత్నం చేశాడు. జట్టును ఆదుకునే ప్రయత్నంలో ఆటను ప్రారంభించిన తీరును బట్టి చూస్తే 79.64 స్ట్రయిక్‌రేట్‌తో ఇన్నింగ్స్‌ను ముగించడం అంటే అది ప్రశంసాపూర్వక ప్రదర్శనే.  2018లో రాయుడు 10 ఇన్నింగ్స్‌లలో 56 సగటుతో 393 పరుగులు చేశాడు.

ఇందులో ఒక సెంచరీ, 3 అర్ధ సెంచరీలు ఉన్నాయి. కానీ ఆస్ట్రేలియాతో రెండు ఇన్నింగ్స్‌లు విఫలం కాగానే అతని ఆటపై కొందరు సందేహాలు లేవనెత్తారు. మిడిలార్డర్‌లో రాయుడు స్థానాన్ని ప్రశ్నిస్తూ వరల్డ్‌ కప్‌కు కష్టమే అన్నట్లుగా మాట్లాడారు. కానీ తాజా ఇన్నింగ్స్‌ అసలు సిసలు మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ ఎలా ఉంటాడో చూపించింది. ప్రపంచ కప్‌కు ముందు విదేశీ గడ్డపై ఆడిన ఆఖరి మ్యాచ్‌లో రాయుడు చూపిన పట్టుదల ఇక అందరి అనుమానాలను పటాపంచలు చేసిందనేది వాస్తవం. ఇది మరో మాటకు తావు లేకుండా అతడి వరల్డ్‌ కప్‌ స్థానాన్ని కూడా ఖాయం చేసింది.   

►2 న్యూజిలాండ్‌ గడ్డపై భారత్‌ గెలిచిన వన్డే సిరీస్‌ల సంఖ్య. ఇప్పటివరకు న్యూజిలాండ్‌లో భారత్‌ ఎనిమిది ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లు ఆడింది.  

►2 తొలుత బ్యాటింగ్‌ చేస్తూ 20 పరుగులలోపే నాలుగు వికెట్లు కోల్పోయాక కూడా భారత్‌ వన్డే మ్యాచ్‌లో నెగ్గడం ఇది రెండోసారి మాత్రమే. చివరిసారి 1983 ప్రపంచకప్‌లో జింబాబ్వేపై లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ (9/4; 268/8; కపిల్‌ దేవ్‌ 175 నాటౌట్‌) ఈ ఘనత సాధించింది.  

►3 భువనేశ్వర్, జస్‌ప్రీత్‌ బుమ్రా తర్వాత వన్డే సిరీస్‌లో ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ పురస్కారం సాధించిన మూడో   భారతీయ పేసర్‌గా షమీ నిలిచాడు.  

►4 వన్డేల్లో ‘హ్యాట్రిక్‌’ సిక్స్‌లు కొట్టడం హార్దిక్‌ పాండ్యాకిది నాలుగోసారి. ఓవరాల్‌గా ఐదోసారి.

►3 అజహరుద్దీన్‌ (334)ను వెనక్కి నెట్టి భారత్‌ తరఫున అత్యధిక వన్డేలు ఆడిన మూడో క్రికెటర్‌గా ధోని (335) నిలిచాడు. తొలి రెండు స్థానాల్లో సచిన్‌ టెండూల్కర్‌ (463), రాహుల్‌ ద్రవిడ్‌ (340) ఉన్నారు.  

►6 జూన్‌ 2016 నుంచి విదేశీ గడ్డపై భారత జట్టు సాధించిన వన్డే సిరీస్‌ విజయాలు (జింబాబ్వేపై 3–0; వెస్టిండీస్‌పై 3–1; శ్రీలంకపై 5–0; దక్షిణాఫ్రికాపై 5–1; ఆస్ట్రేలియాపై 2–1; న్యూజిలాండ్‌పై 4–1).   

►3 ఇప్పటివరకు కెరీర్‌లో 52 వన్డేలు ఆడిన అంబటి రాయుడు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు సాధించడం ఇది మూడోసారి. ఈ మ్యాచ్‌కంటే ముందు రాయుడు (శ్రీలంకపై అహ్మదాబాద్‌లో 2014; జింబాబ్వేపై హరారేలో 2015) రెండుసార్లు ఈ ఘనత సాధించాడు.    

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top