పసిడి నీరాజనం | India at 2018 Asian Games: All Day 9 Results | Sakshi
Sakshi News home page

పసిడి నీరాజనం

Aug 28 2018 12:29 AM | Updated on Aug 28 2018 12:33 AM

India at 2018 Asian Games: All Day 9 Results - Sakshi

నీరజ్‌ చోప్రా,సుధా ,నీనా

వరల్డ్‌ జూనియర్‌ చాంపియన్, కామన్వెల్త్‌ క్రీడల్లో స్వర్ణ పతక విజేత నీరజ్‌ చోప్రా తనపై ఉన్న అంచనాలను నిలబెట్టుకున్నాడు. తొలిసారి పాల్గొంటున్న ఆసియా క్రీడల్లో ఈ జావెలిన్‌ త్రోయర్‌ పసిడి పతకంతో మెరిశాడు. ఈ ఘనత సాధించిన తొలి భారత అథ్లెట్‌గా రికార్డు సృష్టించాడు. జావెలిన్‌ను 88.06 మీటర్లు విసిరిన నీరజ్‌ ఈ క్రమంలో తన పేరిటే ఉన్న జాతీయ రికార్డును కూడా సవరించడం విశేషం. మరోవైపు మరో ముగ్గురు అథ్లెట్లు సుధా సింగ్, నీనా వరకిల్, ధరుణ్‌ అయ్యసామి తమ సత్తాను ప్రదర్శించి మూడు రజతాలు అందించారు. బ్యాడ్మింటన్‌ సెమీఫైనల్లో ఓటమితో సైనా నెహ్వాల్‌ కాంస్యాన్ని తన ఖాతాలో వేసుకోగా, సింధు ఫైనల్‌ చేరడం ఆసియా క్రీడల తొమ్మిదో రోజు విశేషాలు. ప్రస్తుత పతకాల పట్టికలో భారత్‌ తొమ్మిదో స్థానంలో ఉంది.  

జకార్తా: ఆసియా క్రీడల్లో భారత్‌ ఖాతాలో ఎనిమిదో స్వర్ణ పతకం చేరింది. జావెలిన్‌ త్రోలో నీరజ్‌ చోప్రా ఈ పతకాన్ని అందించాడు. మొత్తం ఆరు ప్రయత్నాల్లో మూడోసారి అత్యుత్తమంగా 88.06 మీటర్లు త్రో చేసిన అతను అగ్రస్థానంలో నిలిచాడు. రెండు సార్లు ఫౌల్‌ చేసినా... ఇతర మూడు ప్రయత్నాల్లో నీరజ్‌ స్కోరు చేసిన 86.36 మీటర్లు, 83.46 మీటర్లు, 83.25 మీటర్లతో పోలిస్తే రజతం సాధించిన ఆటగాడికి మధ్య ఎంతో అంతరం ఉండటం భారత త్రోయర్‌ సత్తాకు నిదర్శనం. ఈ ఈవెంట్‌లో ల్యూ ఖిజెన్‌ (చైనా–82.22 మీటర్లు) రజతం గెలుచుకోగా, పాకిస్తాన్‌ అథ్లెట్‌ నదీమ్‌ అర్షద్‌ (80.75 మీటర్లు)కు కాంస్యం దక్కింది. 1982 ఢిల్లీ ఆసియా క్రీడల్లో గుర్‌తేజ్‌ సింగ్‌ కాంస్యం సాధించిన తర్వాత ఈ మెగా ఈవెంట్‌లో భారత్‌కు జావెలిన్‌లో ఇది రెండో పతకం మాత్రమే కావడం విశేషం. గత మే నెలలో దోహాలో జరిగిన డైమండ్‌ లీగ్‌ సిరీస్‌ తొలి అంచెలో 87.43 మీటర్ల దూరం జావెలిన్‌ విసిరి భారత రికార్డు నెలకొల్పిన 20 ఏళ్ల నీరజ్, ఇప్పుడు దానిని తానే సవరించాడు.  

స్టీపుల్‌ఛేజ్‌... హర్డిల్స్‌...  లాంగ్‌జంప్‌... 
అథ్లెటిక్స్‌లో సోమవారం మూడు భిన్న క్రీడాంశాల్లో భారత్‌కు రజత పతకాలు లభించాయి. మహిళల 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌లో భారత సీనియర్‌ లాంగ్‌ డిస్టెన్స్‌ రన్నర్‌ సుధా సింగ్‌ రజతం సాధించింది. 9 నిమిషాల 40.03 సెకన్లలో ఆమె పరుగు పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచింది. 2010 ఆసియా క్రీడల్లో ఇదే ఈవెంట్‌లో స్వర్ణం సాధించిన సుధ, గత ఏషియాడ్‌లో నాలుగో స్థానంలో నిలిచింది. ఇప్పుడు రెండో పతకం ఆమె ఖాతాలో చేరింది. యవి విన్‌ఫ్రెడ్‌ (బహ్రెయిన్‌–9 ని.36.52 సెకన్లు), గ్యూయెన్‌ థి ఓన్‌ (వియత్నాం–9 ని. 43.83 సెకన్లు) స్వర్ణ, కాంస్యాలు గెలుచుకున్నారు. పురుషుల 400 మీటర్ల హర్డిల్స్‌లో ధరుణ్‌ అయ్యసామి రెండో స్థానంలో నిలిచి వెండి పతకం అందుకున్నాడు. తన అత్యుత్తమ టైమింగ్‌ను నమోదు చేస్తూ ధరుణ్‌ 48.96 సెకన్లలో గమ్యాన్ని చేరాడు. 300 మీటర్లు ముగిసేసరికి నాలుగో స్థానంలో కొనసాగిన ఈ తమిళనాడు అథ్లెట్‌ చివరి 100 మీటర్లలో దూసుకుపోయి రజతం గెలుచుకున్నాడు. అబ్దర్‌ రహమాన్‌ (ఖతర్‌–47.66 సెకన్లు)కు స్వర్ణం లభించగా... అబె టకటోషి (జపాన్‌ – 49.12 సెకన్లు) కాంస్యం గెలుచుకున్నాడు. మహిళల లాంగ్‌జంప్‌లో నీనా వరకిల్‌కు కూడా రజతం లభించింది. తన నాలుగో ప్రయత్నంలో అత్యుత్తమంగా 6.51 మీటర్ల దూకిన నీనా రెండో స్థానంలో నిలిచింది. బుయి థీ థూ థావో (వియత్నాం–6.55 మీ), గ్జియోలింగ్‌ (చైనా–6.50 మీ.) స్వర్ణం, కాంస్యం సాధించారు. ఈ ఈవెంట్‌లో మరో భారత అథ్లెట్‌ జేమ్స్‌ నయన పదో స్థానానికే పరిమితమైంది.  

విజయం అంత సులువుగా దక్కలేదని భావిస్తున్నా. పోటీలో కొందరు అత్యుత్తమ త్రోయర్లు ఉన్నా వారు రాణించలేకపోయారు. నేను బాగా సన్నద్ధమై వచ్చాను. ఆసియా క్రీడల రికార్డు నెలకొల్పాలని వచ్చాను. అయితే జావెలిన్‌ ఎత్తు సమస్యగా మారడంతో అది సాధ్యం కాలేదు. అయితే జాతీయ రికార్డు కావడం సంతోషంగా ఉంది. వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లో సాధించిన స్వర్ణం జూనియర్‌ స్థాయిలో కాబట్టి నా కెరీర్‌లో ఇదే పెద్ద గెలుపు. భారీ లక్ష్యాలు నిర్దేశించుకొని అనవసరంగా నాపై ఒత్తిడి పెంచుకోను.  
– నీరజ్‌ చోప్రా

నాకు ఎనిమిదేళ్ల వయసు ఉన్నప్పుడు మా నాన్న చనిపోతే అమ్మ ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి నన్ను పెంచింది. ఈ పతక విజయం ఆమెదే. ప్రస్తుతం టీచర్‌గా అమ్మ నెలకు రూ. 14 వేలు మాత్రమే సంపాదిస్తోంది. నా ఈ ప్రదర్శనతో ఒక ఉద్యోగం లభిస్తే ఆమెకు అండగా నిలుస్తాను.    
– ధరుణ్‌ అయ్యసామి 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement