ఐదేళ్లు క్రికెట్‌కు గ్యాప్‌ ఇచ్చాడు.. కానీ

Ind vs Ban: Shivam Dube Picked At 26 - Sakshi

ముంబై:  వచ్చే నెల 3వ తేదీ నుంచి బంగ్లాదేశ్‌తో ప్రారంభంకానున్న టీ20 సిరీస్‌ కోసం జట్టుని ప్రకటించిన టీమిండి సెలక్టర్లు.. అందులో పవర్ హిట్టర్‌ శివం దూబేకి అనూహ్యంగా చాన్సిచ్చారు. దేశవాళీ క్రికెట్‌లో ఇటీవల భారీ సిక్సర్లు కొడుతూ వెలుగులోకి వచ్చిన ఈ 26 ఏళ్ల ముంబై ఆల్‌రౌండర్‌ని హార్దిక్‌ పాండ్యా స్థానంలో ఎంపిక చేసినట్లు సెలక్టర్లు వెల్లడించారు. హార్దిక్‌ పాండ్యా వెన్నుముక గాయం కారణంగా సర్జరీ చేయించుకోవడంతో దూబెను సెలక్టర్లు ఎంపిక చేశారు.  గతేడాది బరోడాతో జరిగిన రంజీ మ్యాచ్‌లో దూబే వరుసగా ఆరు సిక్సర్లు కొట్టి ఒక‍్కసారిగా అందర్నీ ఆకర్షించాడు.

2018 రంజీ ట్రోఫీలో మొత్తంగా ఐదు ఇన్నింగ్స్‌లు ఆడిన దూబే.. 91 యావరేజ్‌తో 364 పరుగులు సాధించాడు. మరొకవైపు 12 వికెట్లను కూడా ఖాతాలో వేసుకున్నాడు. కుడిచేతి వాటం మీడియం పాస్ట్‌ బౌలర్‌ అయిన దూబే లిస్ట్‌ ఏ క్రికెట్‌లో మెరుపులు మెరిపిస్తూనే ఉన్నాడు. ఈ ఏడాది విజయ్‌ హజారే ట్రోఫీలో సైతం దూబే ఆకట్టుకున్నాడు. లిస్ట్‌-ఏ  73.2 సగటుతో 137కు పైగా స్ట్రైక్‌రేట్‌తో మొత్తం 366  పరుగులు సాధించాడు. అయితే దూబే  క్రికెట్‌ ప్రయాణం పడుతూ లేస్తూ సాగుతోంది. తొలిసారి జాతీయ జట్టులో అవకాశం దక్కించుకున్న దూబే తాను క్రికెట్‌ ఆడటం దగ్గర్నుంచి నేటి వరకూ కష్టాలను ఎదుర్కొంటూనే  ఉన్నాడు.

ఐదేళ్ల క్రికెట్‌కు గ్యాప్‌ ఇచ్చాడు..
తన 14వ ఏటే క్రికెట్‌కు ముగింపు పలకాలనుకున్నాడు దూబే. కుటుంబాన్ని చుట్టిముట్టిన కష్టాలతో టీనేజ్‌లోనే క్రికెట్‌ను వద్దనుకున్నాడు. కానీ తండ్రి ప్రోత్సాహంతో 19 ఏళ్లకు మళ్లీ క్రికెట్‌ బ్యాట్‌ పట్టాడు. తనలో సత్తా ఉందని తండ్రి పదే పదే చెప్పడంతో దూబే తన నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నాడు. ‘ నువ్వు ఐదేళ్లు క్రికెట్‌ను కోల్పోయినా.. నువ్వొక మంచి క్రికెటర్‌వి అనే విషయం మరవకు’ అని తండ్రి చెప్పిన మాటలు దూబేకు ప్రేరణగా నిలిచాయి. దాంతో మళ్లీ క్రికెట్‌ ఆడాలని నిర్ణయించుకున్నాడు. దాంతో 19 ఏళ్ల వయసులో తండ్రి ఇచ్చిన స్ఫూర్తితో క్రికెట్‌ ఆడటానికి సిద్ధమయ్యాడు. 2016లో జనవరిలో పొట్టిఫార్మాట్‌లోకి అడుగుపెట్టిన దూబే.. మరుసటి ఏడాది ఫిబ్రవరిలో లిస్ట్‌-ఏ క్రికెట్‌లోకి రంగప్రవేశం చేశాడు.

అదే ఏడాది డిసెంబర్‌లో ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు.తనకు వచ్చిన అవకాశాల్ని అందుకుంటూ తానేంటో నిరూపించుకున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో ఆర్సీబీ తరఫున ఆడాడు. ఇక దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో భాగంగా బోర్డు ఎలెవన్‌ తరఫున ఆడిన దూబే 68 పరుగులతో మెరిశాడు. మరొకవైపు వెస్టిండీస్‌-ఏతో జరిగిన నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో దూబే 60 యావరేజ్‌ను నమోదు చేశాడు. ఇప్పుడు హార్దిక్‌ లేనిలోటు దూబే తీరుస్తాడనే చీఫ్‌ సెలక్టర్‌ ఎంఎస్‌కే ప్రసాద్‌ సెలక్టర్ల నమ్మకాన్ని ఎడమ చేతి వాటం బ్యాట్స్‌మన్‌ అయిన దూబే ఎంతవరకూ నిలబెడతాడో చూడాలి.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top