
హైదరాబాద్‌కు ఆధిక్యం
ఆంధ్ర, హైదరాబాద్ జట్ల మధ్య జరుగుతున్న రంజీ ట్రోఫీ గ్రూప్ ‘సి’ మ్యాచ్ డ్రా దిశగా సాగుతోంది. మ్యాచ్ మూడో రోజు మంగళవారం ఆట ముగిసే సమయానికి హైదరాబాద్ తమ రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 96 పరుగులు చేసింది.
సాక్షి, హైదరాబాద్: ఆంధ్ర, హైదరాబాద్ జట్ల మధ్య జరుగుతున్న రంజీ ట్రోఫీ గ్రూప్ ‘సి’ మ్యాచ్ డ్రా దిశగా సాగుతోంది. మ్యాచ్ మూడో రోజు మంగళవారం ఆట ముగిసే సమయానికి హైదరాబాద్ తమ రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 96 పరుగులు చేసింది. సుమన్ (57 బంతుల్లో 17 బ్యాటింగ్; 3 ఫోర్లు), విహారి (43 బంతుల్లో 13 బ్యాటింగ్; 2 ఫోర్లు) క్రీజ్‌లో ఉన్నారు.
తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలిపి హైదరాబాద్ ప్రస్తుతం 132 పరుగుల ముందంజలో ఉంది. అంతకు ముందు ఆంధ్ర తమ తొలి ఇన్నింగ్స్‌లో 84.3 ఓవర్లలో 185 పరుగులకే ఆలౌట్ అయింది. డీబీ ప్రశాంత్ (154 బంతుల్లో 47; 6 ఫోర్లు), శివకుమార్ (105 బంతుల్లో 39; 7 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. ఆశిష్ రెడ్డి (3/49), ప్రజ్ఞాన్ ఓజా (3/59) రాణించారు. ఫలితంగా హైదరాబాద్‌కు 36 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కింది. రెండో రోజు 85/1 స్కోరుతో మెరుగైన స్థితిలో కనిపించిన ఆంధ్ర మరో 54.3 ఓవర్లలో మిగతా 9 వికెట్లు కోల్పోయి 100 పరుగులు మాత్రమే చేయగలిగింది. బుధవారం ఆటకు ఆఖరి రోజు.
కట్టడి చేసిన ఆశిష్, ఓజా
తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం సాధించే లక్ష్యంతో మూడో రోజు ఆట ప్రారంభించిన ఆంధ్ర జట్టు బ్యాట్స్‌మెన్ వైఫల్యంతో కుప్పకూలింది. 85/1 ఓవర్‌నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన ఆంధ్ర కేవలం 20 పరుగుల వ్యవధిలో 5 ప్రధాన వికెట్లు కోల్పోయింది. ఆశిష్ రెడ్డి, ఓజా వరుస వికెట్లతో ప్రత్యర్థిని దెబ్బ తీశారు.