రంజీ ట్రోఫీలో ముందుకు వెళ్లేందుకు ఇప్పటికే అవకాశాలు దాదాపు మూసుకుపోయినా...హైదరాబాద్ జట్టు మరో ప్రయత్నానికి సిద్ధమైంది.
సాక్షి, హైదరాబాద్: రంజీ ట్రోఫీలో ముందుకు వెళ్లేందుకు ఇప్పటికే అవకాశాలు దాదాపు మూసుకుపోయినా...హైదరాబాద్ జట్టు మరో ప్రయత్నానికి సిద్ధమైంది. జమ్మూలో ఆదివారంనుంచి జరిగే గ్రూప్ ‘సి’ రంజీ మ్యాచ్‌లో హైదరాబాద్, జమ్మూ కాశ్మీర్‌తో తలపడుతుంది. పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో (మొత్తం 9 జట్లు) ఉన్న హైదరాబాద్ ఈ మ్యాచ్‌లో నెగ్గినా క్వార్టర్ ఫైనల్ అవకాశాలు కష్టమే.
అయితే సాంకేతికంగా ఏదైనా అద్భుతం జరగడంపై జట్టు ఆశలు పెట్టుకుంది. ఈ మ్యాచ్‌లో ఘన విజయం సాధించి బోనస్ పాయింట్‌తో గెలిస్తే...ఇతర జట్ల సమీకరణాలపై ఆధార పడాల్సి ఉంటుంది. ఈ నెల 30 నుంచి హైదరాబాద్, సొంతగడ్డపై కేరళతో ఆఖరి మ్యాచ్ ఆడనున్న నేపథ్యంలో కాశ్మీర్‌పై గెలిస్తే వేర్వేరు సమీకరణాలు ముందుకు వస్తాయి. అయితే ప్రస్తుతం గ్రూప్ టాపర్‌గా ఉన్న కాశ్మీర్‌ను ఏ మాత్రం అడ్డుకోగలదో చూడాలి.
బ్యాటింగ్ ఓకే...
ఈ సీజన్‌లో హైదరాబాద్ ప్రధాన బ్యాట్స్‌మెన్ అంతా చక్కగానే రాణించారు. అయితే ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పే ఇన్నింగ్స్‌లు నమోదు కాలేదు. ఇతర జట్లతో పోలిస్తే దూకుడు లోపించడంతోనే జట్టు వెనుకబడింది. ఎనిమిది ఇన్నింగ్స్‌లలో కలిపి 585 పరుగులతో విహారి జట్టు టాప్ స్కోరర్‌గా ఉన్నాడు. గత మ్యాచ్‌లో డబుల్ సెంచరీతో చెలరేగిన అతని నుంచి మరో మంచి ప్రదర్శనను ఆశించవచ్చు. రవితేజ (490), అక్షత్ రెడ్డి (474) కూడా మంచి ఫామ్‌లో ఉన్నారు.
ఇతర బ్యాట్స్‌మెన్‌లలో సుమన్, సందీప్, ఖాద్రీ రాణిస్తే హైదరాబాద్ భారీ స్కోరు చేసేందుకు అవకాశం ఉంటుంది. అయితే బౌలింగ్ బలహీనంగా ఉండటమే జట్టును ఆందోళన పరుస్తోంది. ఒక్క రవికిరణ్ (19 వికెట్లు) మినహా ఇతర బౌలర్లందరూ విఫలమయ్యారు. షిండే 11 వికెట్లు తీసినా పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. ప్రతీ మ్యాచ్‌లో పేస్ బౌలర్లను మారుస్తూ ప్రయత్నించినా ఏ ఒక్కరూ విజయవంతం కాలేకపోయారు. బ్యాటింగ్‌లో జట్టు స్కోరు చేయడమే కాకుండా బౌలర్లు కూడా రాణిస్తేనే ఈ మ్యాచ్‌లో జట్టుకు విజయావకాశాలు ఉంటాయి.
కాశ్మీర్ హవా...
మరో వైపు జమ్మూ కాశ్మీర్ అనూహ్యంగా దూసుకొచ్చింది. ఆడిన ఆరు మ్యాచుల్లో నాలుగు విజయాలతో ఆ జట్టు అగ్ర స్థానంలో నిలిచింది. స్టార్ ఆటగాళ్లు లేకపోయినా సమష్టి కృషితో ఆ జట్టు నిలకడ ప్రదర్శించింది. ముఖ్యంగా ఆల్‌రౌండర్‌గా పర్వేజ్ రసూల్ సత్తా చాటాడు. ఒక సెంచరీ సహా 408 పరుగులు చేసిన రసూల్, 10 వికెట్లు కూడా పడగొట్టాడు. ఆదిల్ రిషి (460), ఇయాన్‌దేవ్ సింగ్ (337) జట్టులో ఇతర కీలక బ్యాట్స్‌మెన్‌లు. సీజన్‌లో ఆ జట్టు ప్రధాన బౌలర్ల ప్రదర్శన కాశ్మీర్‌ను ముందు నిలిపింది. ముదస్సిర్ (29), బేగ్ (27), దయాల్ (21) ఆకట్టుకున్నారు. సొంతగడ్డపై ఈ మ్యాచ్ ఆడుతుండటం కూడా ఆ జట్టు అదనపు బలం. ఇలాంటి స్థితిలో ఈ మ్యాచ్ ఆసక్తికరంగా జరిగే అవకాశం ఉంది.