రంజీ ట్రోఫీ 2013-14 సీజన్‌లో భాగంగా కేరళతో జరిగే ఆఖరి మ్యాచ్ కోసం హైదరాబాద్ జట్టును సెలక్షన్ కమిటీ శనివారం ప్రకటించింది.
సాక్షి, హైదరాబాద్: రంజీ ట్రోఫీ 2013-14 సీజన్‌లో భాగంగా కేరళతో జరిగే ఆఖరి మ్యాచ్ కోసం హైదరాబాద్ జట్టును సెలక్షన్ కమిటీ శనివారం ప్రకటించింది. జమ్మూ కాశ్మీర్‌తో తలపడిన జట్టులో రెండు మార్పులు జరిగాయి. సందీప్ రాజన్, అభినవ్ కుమార్‌లను టీమ్‌నుంచి తప్పించగా... ఆఫ్ స్పిన్నర్ అనికేత్ రేడ్కర్‌ను తొలి సారి రంజీ జట్టులోకి ఎంపిక చేశారు. ఆరేళ్ల క్రితం ఏకైక రంజీ మ్యాచ్ ఆడిన లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్ డానీ డెరిక్ ప్రిన్స్ పునరాగమనం చేశాడు. ఈ నెల 30నుంచి ఉప్పల్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది.
ముంబైనుంచి హైదరాబాద్‌కు...
27 ఏళ్ల అనికేత్ రేడ్కర్ ముంబైకి చెందిన క్రికెటర్. ఎంసీఏ ప్రెసిడెంట్స్ ఎలెవన్, డీవై పాటిల్ అకాడమీ, సీసీఐ తరఫున క్లబ్ స్థాయి క్రికెట్ ఆడాడు. గత నాలుగేళ్లుగా అతను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) లీగ్ మ్యాచ్‌లు ఆడుతున్నాడు. ఆర్.దయానంద్ జట్టు తరఫున ఈ సారి చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబర్చాడు. రెండు మ్యాచుల్లో ఐదేసి వికెట్లు తీసుకున్నాడు.
ఎన్స్‌కాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మెరుగైన బౌలింగ్ గణాంకాలు (6/51) నమోదు చేశాడు. తుది జట్టులో చోటు దక్కుతుందో లేదో తెలీదు కానీ...సీజన్ ఆఖరి మ్యాచ్‌లో హైదరాబాద్ ఆటగాళ్లను కాదని ఒక ముంబై క్రికెటర్‌కు అవకాశం ఇవ్వడం ఆశ్చర్యం కలిగించే విషయం. మరో వైపు జట్టులో ప్రధాన బ్యాట్స్‌మెన్ అంతా ఫామ్‌లో ఉన్న దశలో ఆరేళ్ల తర్వాత 27 ఏళ్ల ప్రిన్స్‌కు పిలుపు ఇచ్చి సెలక్టర్లు మరో ఆశ్చర్యకర నిర్ణయం తీసుకున్నారు.