అద్భుతాలు జరిగినా పనికొచ్చేది ఏమీ ఉండదు... ఇతర జట్ల ఫలితాల గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు...
సాక్షి, హైదరాబాద్: అద్భుతాలు జరిగినా పనికొచ్చేది ఏమీ ఉండదు... ఇతర జట్ల ఫలితాల గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు... ఎందుకంటే రంజీ ట్రోఫీలో ఈ ఏడాది క్వార్టర్ ఫైనల్ చేరేందుకు, వచ్చే సీజన్‌లో పై గ్రూప్‌నకు ఎగబాకేందుకు హైదరాబాద్ జట్టుకు ఇప్పటికే అవకాశం చేజారింది.
కేరళతో నేటినుంచి ఉప్పల్ స్టేడియంలో జరిగే ఆఖరి మ్యాచ్‌లో బోనస్ పాయింట్‌తో సహా నెగ్గినా... ముందుకు వెళ్లే అవకాశం లేదు. ఈ మ్యాచ్‌లో 7 పాయింట్లు సాధించి, మరో వైపు జమ్మూ కాశ్మీర్ ఓడిపోతే, పాయింట్లపరంగా ఆ జట్టుతో సమమైనా... కాశ్మీర్ నాలుగు మ్యాచ్‌లు గెలిచింది కాబట్టి దానికే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో సీజన్‌లో చివరి మ్యాచ్ అయినా గెలిచి సంతృప్తి చెందాలని హైదరాబాద్ భావిస్తోంది. మరోవైపు కేరళకు మాత్రం ఇది కీలక మ్యాచ్. ఈ మ్యాచ్‌లో భారీ విజయం సాధిస్తే ఆ జట్టుకు క్వార్టర్స్ అవకాశాలు మిగిలే ఉంటాయి.
‘డ్రా’లతోనే సరి...
ఈ సీజన్‌లో హైదరాబాద్ సొంతగడ్డపై ఆడిన మూడు మ్యాచుల్లో ఒక్కదాంట్లోనూ విజయం సాధించలేకపోయింది. ఇతర జట్లన్నీ తమ మైదానాల్లో విజయాలు సాధిస్తే మన టీమ్ మాత్రం ఆ అవకాశాన్ని అందుకోలేకపోయింది. ఈ ఏడాది గెలిచిన ఒక్క మ్యాచ్ హిమాచల్‌ప్రదేశ్‌పై ధర్మశాలలో నెగ్గింది. బ్యాటింగ్ బాగానే ఉన్నా... బలహీనమైన బౌలింగ్‌తో ప్రత్యర్థిని ఆలౌట్ చేయడంలో జట్టు తీవ్రంగా ఇబ్బంది పడుతోంది. సీజన్‌లో హనుమ విహారి (694 పరుగులు), రవితేజ (669) పోటీ పడి పరుగులు సాధించారు. ఆరంభంలో ఇబ్బంది పడ్డా కెప్టెన్ అక్షత్ రెడ్డి (523) కూడా ఫామ్‌లోకి వచ్చాడు.
సందీప్, ఖాద్రీ, సుమన్ కూడా రాణించడంతో జట్టు భారీ స్కోర్లు నమోదు చేయగలిగింది. ఈ మ్యాచ్‌లో కూడా వారు తమ జోరు కొనసాగించాల్సి ఉంది. బౌలింగ్‌లో మాత్రం రవికిరణ్ (24 వికెట్లు)కు మరో బౌలర్‌నుంచి సహకారం అందకుండా పోయింది. ఫలితంగా ప్రత్యర్థి బ్యాటింగ్‌ను అడ్డుకోవడంలో హైదరాబాద్ విఫలమైంది. ఈ మ్యాచ్‌లో ఉప్పల్ వికెట్‌పై ఇద్దరు స్పిన్నర్లతో జట్టు బరిలోకి దిగే అవకాశం ఉంది. లెఫ్టార్మ్ స్పిన్నర్ మెహదీ హసన్‌తో పాటు ఆఫ్ స్పిన్నర్ అనికేత్‌ను కూడా తుది జట్టులో ఎంపిక చేయవచ్చు.
అవకాశముందా?
మరోవైపు కేరళ కూడా విజయం కోసం పోరాడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే ఇతర జట్ల ఫలితాలు, గణాంకాల మీద ఆధార పడి ఆ జట్టు ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. జట్టు ప్రధాన బ్యాట్స్‌మన్ సంజు సామ్సన్ గత మ్యాచ్‌కు దూరం కావడం ఆ జట్టుపై ప్రభావం చూపించింది. గోవా చేతిలో కేరళ ఆ మ్యాచ్ ఓడింది. ఈ మ్యాచ్‌కూ సామ్సన్ దూరమవడం జట్టును ఇబ్బంది పెట్టేదే. ఈ సీజన్‌లో సంజు మినహా మిగతా కేరళ బ్యాట్స్‌మెన్ ఎవ్వరూ పెద్దగా రాణించలేకపోయారు. సురేంద్రన్, సచిన్ బేబీ, జగదీశ్, మనోహరన్ ఒక మోస్తరుగా రాణించారు. వీరిపైనే జట్టు బ్యాటింగ్ ఆధారపడి ఉంది. సీజన్‌లో కేరళ బౌలర్లు మాత్రం ఆకట్టుకున్నారు. మనోహరన్ (25 వికెట్లు), షాహిద్ (25) చలవతోనే కేరళ రెండు విజయాలు దక్కించుకోగలిగింది.
సురేశ్ శాస్త్రి సెంచరీ
ఈ మ్యాచ్ కు అంపైర్‌గా వ్యవహరించనున్న 58 ఏళ్ల సురేశ్ లాల్‌చంద్ శాస్త్రి (రాజస్థాన్) కొత్త రికార్డు సృష్టించనున్నారు. 100 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లకు అంపైరింగ్ చేసిన తొలి భారత అంపైర్ కానున్నారు. 1990-91 సీజన్‌లో హైదరాబాద్, కేరళ జట్ల మధ్య జింఖానాలో జరిగిన మ్యాచ్ శాస్త్రికి అంపైర్‌గా తొలి మ్యాచ్ కావడం విశేషం! శాస్త్రి ఇప్పటి వరకు 2 టెస్టులు, 19 వన్డేలు, 1 టి20 మ్యాచ్‌లో అంపైర్‌గా వ్యవహరించారు. ఆటగాడిగా కూడా 53 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన శాస్త్రి 968 పరుగులు చేయడంతో పాటు 155 వికెట్లు పడగొట్టారు.