వరుణుడి పుణ్యమాని బంగ్లాదేశ్‌తో టెస్టులో ఫలితం వచ్చే అవకాశాలు తగ్గిపోయాయి.
వరుణుడి పుణ్యమాని బంగ్లాదేశ్‌తో టెస్టులో ఫలితం వచ్చే అవకాశాలు తగ్గిపోయాయి. మూడు రోజులు ముగిసేసరికి కేవలం 103 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. మిగిలిన రెండు రోజులు పూర్తిగా ఆట జరిగినా 180 ఓవర్లు పడతాయి. ప్రస్తుతం వాతావరణం చూస్తే చివరి రెండు రోజులు కూడా ఆట పూర్తిగా సాధ్యం కాకపోవచ్చు. ఈ నేపథ్యంలో భారత్ ఈ మ్యాచ్ గెలవాలంటే అద్భుతం జరగాలి. అలా జరగాలంటే వెంటనే ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయాలి. ప్రస్తుతం మన ఖాతాలో 462 పరుగులు ఉన్నాయి.
డిక్లేర్ చేసి బంగ్లాదేశ్‌ను 263 పరుగుల లోపు ఆలౌట్ చేస్తే ఫాలోఆన్ ఆడించవచ్చు. నిజానికి ఈ మ్యాచ్‌కు బంగ్లాదేశ్ ఏకంగా 8 మంది బ్యాట్స్‌మెన్‌తో బరిలోకి దిగింది. ఇదే సమయంలో భారత్ ఐదుగురు స్పెషలిస్ట్ బౌలర్లతో ఆడుతోంది. అందులో ఇద్దరు స్పిన్నర్లు ఉన్నారు. మూడో రోజు ఆటలో బంగ్లా స్పిన్నర్లు బంతిని తిప్పిన విధానం చూస్తే... చివరి రెండు రోజులు స్పిన్నర్లు పండగ చేసుకోవచ్చు. కాబట్టి భారత్ ఓ ప్రయత్నం చేస్తే బాగుంటుంది.
-సాక్షి క్రీడావిభాగం