వారెవ్వా ఫెడరర్‌... | Federer claims 2nd Shanghai title | Sakshi
Sakshi News home page

వారెవ్వా ఫెడరర్‌...

Oct 16 2017 1:05 AM | Updated on Oct 16 2017 3:36 AM

Federer claims 2nd Shanghai title

షాంఘై (చైనా): ఈ ఏడాది తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తూ స్విట్జర్లాండ్‌ టెన్నిస్‌ దిగ్గజం రోజర్‌ ఫెడరర్‌ తన ఖాతాలో ఆరో టైటిల్‌ను జమ చేసుకున్నాడు. షాంఘై ఓపెన్‌ ఏటీపీ మాస్టర్స్‌ సిరీస్‌ టోర్నమెంట్‌లో 36 ఏళ్ల ఫెడరర్‌ చాంపియన్‌గా నిలిచాడు. తన చిరకాల ప్రత్యర్థి, ప్రపంచ నంబర్‌వన్, టాప్‌ సీడ్‌ రాఫెల్‌ నాదల్‌ (స్పెయిన్‌)తో ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో ఫెడరర్‌ 6–4, 6–3తో విజయం సాధించాడు.

72 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో ఫెడరర్‌ 10 ఏస్‌లను సంధించడంతోపాటు ఒక్క డబుల్‌ ఫాల్ట్‌ కూడా చేయలేదు. అంతేకాకుండా నాదల్‌కు ఒక్కసారి కూడా తన సర్వీస్‌లో బ్రేక్‌ పాయింట్‌ అవకాశం ఇవ్వలేదు. మరోవైపు నాదల్‌ సర్వీస్‌ను ఈ స్విస్‌ స్టార్‌ మూడుసార్లు బ్రేక్‌ చేశాడు. విజేతగా నిలిచిన ఫెడరర్‌కు 11,36,850 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ.7 కోట్ల 35 లక్షలు) 1000 ర్యాంకింగ్‌ పాయింట్లు, రన్నరప్‌ నాదల్‌కు 5,57,000 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ.3 కోట్ల 60 లక్షలు) 600 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి.  

♦  ఫెడరర్‌ కెరీర్‌లో ఇది 27వ మాస్టర్స్‌ సిరీస్‌ టైటిల్‌కాగా ఓవరాల్‌గా 94వ టైటిల్‌. ఈ విజయంతో అత్యధిక సింగిల్స్‌ టైటిల్స్‌ నెగ్గిన క్రీడాకారుల జాబితాలో ఇవాన్‌ లెండిల్‌ (94) సరసన ఫెడరర్‌ సంయుక్తంగా రెండో స్థానానికి చేరుకున్నాడు. అమెరికా స్టార్‌ జిమ్మీ కానర్స్‌ (109 టైటిల్స్‌) అగ్రస్థానంలో ఉన్నాడు.  
♦   నాదల్‌పై ఫెడరర్‌కిది వరుసగా ఐదో విజయం. ఇప్పటివరకు నాదల్‌తో 38 సార్లు తలపడ్డ ఈ స్విస్‌ స్టార్‌ 15 మ్యాచ్‌ల్లో గెలిచి, 23 మ్యాచ్‌ల్లో ఓడిపోయాడు.  
♦  ఈ సీజన్‌లో ఫెడరర్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్, ఇండియన్‌ వెల్స్, మయామి, హాలె ఓపెన్, వింబుల్డన్, షాంఘై ఓపెన్‌ టైటిల్స్‌ గెలిచాడు. ఈ గెలుపుతో హార్డ్‌ కోర్టులపై ఫెడరర్‌ విజయాల సంఖ్య 700కు చేరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement