స్మిత్‌ను ఆపేదెలా?

England Need To Find a Way To Get Steve Smith Out - Sakshi

బర్మింగ్‌హామ్‌: ప్రస్తుతం జరుగుతున్న యాషెస్‌ సిరీస్‌లో ఇంగ్లండ్‌కు ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ పీకల్లోతు కష్టాల్లో పడ్డ సమయంలో స్మిత్‌ 144 పరుగులు చేసి జట్టు పరిస్థితిని గాడిలో పెట్టాడు. కనీసం రెండొందల పరుగులు చేయడమే గగనం అనుకున్న తరుణంలో స్మిత్‌ భారీ సెంచరీ సాధించడంతో ఆసీస్‌ 284 పరుగులు చేయగల్గింది. ఇక తన తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ 374 పరుగులకు ఆలౌటైన అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఆసీస్‌కు ఆదిలోనే షాక్‌ తగిలింది. ఓపెనర్లు బెన్‌క్రాఫ్ట్‌(7), డేవిడ్‌ వార్నర్‌(8)లు తీవ్రంగా నిరాశపరిచారు. ఆ తరుణంలో ఉస్మాన్‌ ఖవాజాతో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు స్మిత్‌. ఇంగ్లండ్‌ బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారి సవాల్‌ విసురుతున్నాడు. ఈ క్రమంలోనే రెండు చక్కటి భాగస్వామ్యాలను నమోదు చేశాడు. దాంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్‌ మూడు వికెట్ల నష్టానికి 124 పరుగులతో ఉంది. స్మిత్‌ అజేయంగా 46 పరుగులు చేసి క్రీజ్‌లో ఉన్నాడు.

మరొకసారి స్మిత్‌ నుంచి భారీ ఇన్నింగ్స్‌ వస్తే మ్యాచ్‌పై పట్టుబిగించడం ఇంగ్లండ్‌కు కష్టమవుతోంది. దాంతో స్మిత్‌ను నాల్గో రోజు ఆటలో సాధ్యమైనంత త్వరగా పెవిలియన్‌కు పంపాలని కసరత్తులు చేస్తోంది.  స్మిత్‌ను ఎలా ఆపాలనే దానిపై ప్రణాళికలు రచిస్తోంది. ఈ విషయాన్ని ఇంగ్లండ్‌ పేసర్‌ క్రిస్‌ వోక్స్‌ స్సష్టం చేశాడు. ‘స్మిత్‌ను తొందరగా పెవిలియన్‌కు పంపడంపైనే గురిపెట్టాం. డ్రాయింగ్‌ బోర్డుపై స్మిత్‌ను ఔట్‌ చేయడానికి వ్యూహాలు సిద్ధం చేస్తున్నాం. ఒక వరల్డ్‌క్లాస్‌ బ్యాట్స్‌మన్‌ ఔట్‌ చేయడానికి ఏమి కావాలో అన్ని సిద్ధం చేసుకుని బరిలోకి దిగుతాం’ అని వోక్స్‌ తెలిపాడు.
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top