ఆసీస్‌ను చిత్తుచేసి.. ఫైనల్‌కు

England Enter Into World Cup 2019 Final - Sakshi

8 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ విజయం

నాలుగో సారి ప్రపంచకప్‌ ఫైనల్‌కు చేరిన ఇంగ్లండ్‌

ఇంగ్లండ్‌ చేతిలో ఆసీస్‌కు భంగపాటు

ఆదివారం లార్డ్స్‌లో కివీస్‌తో ఇంగ్లండ్‌ ఫైనల్‌ ఢీ

బర్మింగ్‌హామ్‌:  డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియాను చిత్తుచేసి ఆతిథ్య ఇంగ్లండ్‌ సగర్వంగా ప్రపంచకప్‌ ఫైనల్లోకి అడుగుపెట్టింది. రెండో సెమీఫైనల్లో భాగంగా ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ జయభేరి మోగించింది. దీంతో ఆదివారం ప్రపంచ ప్రఖ్యాత లార్డ్స్‌ మైదానంలో జరగబోయే ఫైనల్‌ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో ఇంగ్లండ్‌ తలపడనుంది. ఇక ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా జరిగిన రెండో సెమీఫైనల్‌ పోరు ఏకపక్షంగా సాగింది. ఆసీస్‌ నిర్దేశించిన 224 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్‌ 35 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి పూర్తిచేసింది. ఛేదనలో ఇంగ్లండ్‌ స్టార్‌ ఓపెనర్‌ జేసన్‌ రాయ్‌(85; 65 బంతుల్లో 9ఫోర్లు, 5 సిక్సర్లు) వీరవిహారం చేశాడు. రాయ్‌కు తోడు రూట్‌(40 నాటౌట్‌) మోర్గాన్‌(40 నాటౌట్‌), బెయిర్‌ స్టో(34)లు రాణించడంతో ఇంగ్లండ్‌ ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని ఛేదించింది. ఆసీస్‌ను పతనాన్ని శాసించిన క్రిస్‌ వోక్స్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది.


లక్ష్యఛేదనలో ఇంగ్లండ్‌ ఏమాత్రం తడబాటుకు గురికాలేదు. ఓపెనర్లు రాయ్‌, బెయిర్‌ స్టోలు చక్కటి శుభారంభాన్ని అందించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 124 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన అనంతరం బెయిర్‌ స్టోను స్టార్క్‌ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఓ వైపు అర్ద సెంచరీ సాధించి శతకం వైపు దూసుకెళ్తున్న జేసన్‌ రాయ్‌ అంపైర్‌ తప్పిదానికి బలయ్యాడు. దీంతో తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. అనంతరం వచ్చిన రూట్‌, మోర్గాన్‌లు మరో వికెట్‌ పడకుండా విజయాన్ని పూర్తి చేశారు.

అంతకుముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆసీస్‌ ఇంగ్లండ్‌ బౌలర్ల ధాటికి  49 ఓవర్లలో 223 పరుగులకే కుప్పకూలింది. క్రిస్‌ వోక్స్‌(3/20), అదిల్‌ రషీద్‌(3/54), ఆర్చర్‌(2/32)లు చెలరేగడంతో ఆసీస్‌ విలవిల్లాడింది. అయితే స్టీవ్‌ స్మిత్‌(85; 119 బంతుల్లో 6ఫోర్లు) బాధ్యతాయుతంగా ఆడాడు. స్మిత్‌తో పాటు అలెక్స్‌ కారీ(46) గాయాన్ని లెక్క చేయకుండా జట్టు కోసం బ్యాటింగ్‌ చేశాడు. చివర్లో మ్యాక్స్‌వెల్‌(23), స్టార్క్‌(29)లు ఓ మోస్తారుగా రాణించడంతో ఇంగ్లండ్‌ ముందు ఆసీస్‌ గౌరవప్రదమైన లక్ష్యాన్ని ముందుంచగలిగింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top