ధోనినే ‘బెస్ట్‌ ఫినిషర్‌’

Dhoni is best finisher  - Sakshi

కోహ్లి వన్డే బ్రాడ్‌మన్‌ కాగలడు

ఇయాన్‌ చాపెల్‌ ప్రశంస

న్యూఢిల్లీ: వన్డే క్రికెట్‌లో మ్యాచ్‌ను విజయవంతంగా ముగించడంలో ధోని తర్వాతే ఎవరైనా అని ఆస్ట్రే లియా మాజీ కెప్టెన్‌ ఇయాన్‌ చాపెల్‌ అభిప్రాయ పడ్డారు. ఈ తరంలో అతడిని మించినవారు ఎవరూ లేరని, ఇప్పటికీ అతనే ‘బెస్ట్‌ ఫినిషర్‌’ అని చాపెల్‌ ప్రశంసించారు. ‘చివరి వరకు నిలిచి జట్టును గెలిపించడంలో ధోని అంత సమర్థంగా ఎవరూ ఒత్తిడిని జయించలేరు. ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది, ఇక కష్టం అనిపించినప్పుడల్లా కొన్ని అద్భుతమైన షాట్లు ఆడి అతను లెక్క సరి చేస్తాడు. ఉత్కంఠభరిత క్షణాల్లో తన వ్యూహానికి అనుగుణంగా ప్రశాంతంగా ఆడటం చూస్తే అతని బుర్ర ఎంత పక్కాగా పని చేస్తుందో అర్థం చేసుకోవచ్చు’ అని చాపెల్‌ విశ్లేషించారు. గతంలో మైకేల్‌ బెవాన్‌కు ఈ విషయంలో మంచి రికార్డు ఉన్నా...మారిన పరిస్థితులను పరిగణలోకి తీసుకున్నా కూడా బెవాన్‌కంటే ధోనినే అత్యుత్తమమని ఆసీస్‌ దిగ్గజం అభిప్రాయం వ్యక్తం చేశారు.  

కోహ్లి ఇలాగే ఆడితే... 
వన్డే క్రికెట్‌లో నలుగురు అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌గా రిచర్డ్స్, సచిన్, డివిలియర్స్, కోహ్లిలను చాపెల్‌ అభివర్ణించారు. వీరిలో కోహ్లి ఒక్కడే ఇప్పుడు ఆడుతున్నాడని...అతను ఇప్పటి జోరును కొనసాగిస్తే సచిన్‌కంటే 100 తక్కువ ఇన్నింగ్స్‌లలోనే అతని అన్ని రికార్డులు అధిగమిస్తాడని, మరో 20 సెంచరీలు ఎక్కువ చేస్తాడని కూడా ఇయాన్‌ అన్నారు. ఇదే జరిగితే విరాట్‌ను ‘వన్డే బ్రాడ్‌మన్‌’గా పిలవడంలో ఎలాంటి సందేహం ఉండనవసరం లేదని ఆయన వ్యాఖ్యానించారు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top