
స్టాన్ లేక్ సిటీ(యూఎస్‌ఏ): ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్ ఈవెంట్‌లో భారత ఆర్చర్ దీపిక కుమారి స్వర్ణంతో మెరిసింది. వరల్డ్ కప్ స్టేజ్-3 మహిళ విభాగంలో దీపిక 7-3 తేడాతో జర్మనీ క్రీడాకారిణి మిచెల్లి క్రాప్పన్‌పై విజయం సాధించి పసిడి పతకం సొంతం చేసుకుంది. ఈ విజయంతో అక్టోబరులో టర్కీలో జరిగే ప్రపంచకప్ ఫైనల్ పోటీలకు అర్హత సాధించింది.
ఈ సందర్భంగా దీపిక మాట్లాడుతూ... ‘ఎట్టకేలకు.. నేను అనుకున్నది సాధించా. బంగారు పతకం సొంతం చేసుకున్నా. నవంబరులో టర్కీలో జరిగే ప్రపంచకప్ ఫైనల్‌కు అర్హత సాధిస్తానా లేదా అనే దాని గురించి ఆలోచిస్తూ ఆడలేదు. నా ఆటను నేను ఆస్వాదిస్తూ, ఎంజాయ్ చేస్తూ ఆడా. గెలుపు-ఓటమి గురించి పట్టించుకోను’అని దీపిక తెలిపింది. గతంలో వరల్డ్ కప్ ఫైనల్ ఈవెంట్‌లలో దీపిక నాలుగుసార్లు(2011, 2012, 2013, 2015) రజత పతకాలను గెలుచుకున్న సంగతి తెలిసిందే.