కార్పొరేట్ బ్యాడ్మింటన్ లీగ్ ప్రారంభం | Sakshi
Sakshi News home page

కార్పొరేట్ బ్యాడ్మింటన్ లీగ్ ప్రారంభం

Published Sat, Sep 7 2013 12:18 AM

Corporate Badminton League start

సెంట్రల్ యూనివర్శిటీ, న్యూస్‌లైన్: దేశంలో మొదటిసారిగా కార్పొరేట్ బ్యాడ్మింటన్ లీగ్ (సీబీఎల్)కు హైదరాబాద్ ఆతిథ్యమిస్తోంది. గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో శుక్రవారం ఈ టోర్నీ ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరిగే ఈ టోర్నమెంట్‌లో 68 కార్పొరేట్ సంస్థలకు చెందిన దాదాపు 400 మంది ఆటగాళ్లు పాల్గొంటున్నారు.
 
 ఈ క్రీడలను భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా గోపీచంద్ మాట్లాడుతూ... ప్రపంచ వ్యాప్తంగా బ్యాడ్మింటన్ క్రీడకు ఆదరణ పెరగడం మంచి పరిణామమని అన్నారు. ఈ క్రీడలకు ఏర్పడిన క్రేజ్ కుర్రాళ్లకు స్ఫూర్తినిస్తుందన్నారు. సీబీఎల్‌కు దేశవ్యాప్తంగా కార్పొరేట్  సంస్థలు హాజరవ్వడం అభినందనీయమని ఆయన చెప్పారు. సీబీఎల్ ట్రోఫీ ఆవిష్కరణ కార్యక్రమంలో టెక్ మహేంద్ర ఉపాధ్యక్షులు రాజేంద్ర తునుగుంట్ల, లొకేషన్ కౌన్సిల్ హెడ్ బీకే మిశ్రా, హెచ్‌సీఏ కార్యదర్శి ఎంవీ శ్రీధర్‌లతో పాటు స్టార్ క్రీడాకారులు సైనా నెహ్వాల్, పీవీ సింధు, కశ్యప్ పాల్గొన్నారు. దేశంలోని ప్రముఖ కార్పొరేట్ కంపెనీలైన టీసీఎస్, క్వాల్కామ్, వెల్స్‌ఫార్గో, బ్యాంక్ ఆఫ్ అమెరికా, విప్రో, ఐబీఎం, హెచ్‌ఎస్‌బీసీ, డెలాయిట్, మైక్రోసాఫ్ట్, అసెంచర్, జీఈ తదితర జట్లు ఇందులో పాల్గొంటున్నాయి.
 

Advertisement
Advertisement