రాయల్స్‌పై చెన్నై ఘనవిజయం

Chennai Super Kings beat Rajasthan Royals - Sakshi

పుణె: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో భాగంగా రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ 64 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన చెన్నై 205 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. దీన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాజస్తాన్‌ రాయల్స్‌ 18.3 ఓవర్లలో 140 పరుగులకే పరిమితమై ఘోర పరాజయం చెందింది. రాజస్తాన్‌ రాయల్స్‌ ఆటగాళ్లలో బెన్‌ స్టోక్స్‌(45) రాణించగా, జాస్‌ బట్లర్‌(22) మోస‍్తరుగా ఫర్వాలేదనిపించాడు. చెన్నై బౌలర్లలో దీపక్‌ చాహర్‌, డ్వేన్‌ బ్రేవో, కరణ్‌ శర్మ, శార్దూల్‌ ఠాకూర్‌లు తలో రెండు వికెట్లు సాధించగా, వాట్సన్‌, తాహీర్‌లు తలో వికెట్‌ తీశారు.

టాస్‌ గెలిచిన రాజస్తాన్‌ రాయల్స్‌ తొలుత చెన్నైను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. దాంతో చెన్నై ఇన్నింగ్స్‌ను అంబటి రాయుడు, షేన్‌ వాట్సన్‌లు ఆరంభించారు. జట్టు 50 పరుగుల వద్ద రాయుడు(12) ఔట్‌ కాగా, షేన్‌ వాట్సన్‌ మాత్రం రెచ్చిపోయాడు. సురేశ్‌ రైనా(46)తో కలిసి రెండో వికెట్‌కు 81 పరుగుల్ని జత చేశాడు. ఈ క్రమంలోనే వాట్సన్‌ హాఫ్‌ సెంచరీ నమోదు చేసుకున్నాడు. వీరిద్దరూ చెన్నై స్కోరు బోర్డును పరుగులు పెట్టించడంతో చెన్నై 10 ఓవర్లలోనే వికెట్‌ నష్టానికి 107 పరుగులు చేసింది. అయితే రైనా తర్వాత వాట్సన్‌ తన దూకుడును మరింత పెంచాడు.

ఆది నుంచి ఆకాశమే హద్దుగా చెలరేగిన వాట్సన్‌ రాయల్స్‌ బౌలర్లను ఓ ఆటాడుకున్నాడు. ఓపెనర్‌గా దిగిన వాట్సన్‌కు ఆరంభంలోనే రెండు లైఫ్‌లు లభించడంతో దాన్ని సద్వినియోగం చేసుకుని రాయల్స్‌కు చుక్కలు చూపించాడు. ఈ క్రమంలోనే తొలుత హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న వాట్సన్‌ దాన్ని సెంచరీగా మలుచుకున్నాడు. 51 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 106 పరుగులు చేసిన వాట్సన్‌ ఐదో వికెట్‌గా ఔటయ్యాడు. వాట్సన్‌కు జతగా సురేశ్‌ రైనా(46;29  బంతుల్లో 9ఫోర్లు), డ్వేన్‌ బ్రేవో(24 నాటౌట్‌;16 బంతుల్లో 4 ఫోర్లు) రాణించడంతో చెన్నై నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top