వైరల్‌ : క్యాచ్‌ పట్టలే కానీ.!

Brendon McCullum Breathtaking Fielding Effort in BBL - Sakshi

సిడ్నీ : లాంగాన్‌లో బ్యాట్స్‌మన్‌ ఆడిన భారీ షాట్‌ను ఫీల్డర్‌ అందుకోలేకపోయాడు.. కానీ అద్భుత ఫీల్డింగ్‌తో సిక్సర్‌ను అడ్డుకోని ఔరా అనిపించాడు. భారీ షాట్‌ ఆడిన బ్యాట్స్‌మన్‌ ఇంగ్లండ్‌ క్రికెటర్‌ జేమ్స్‌ విన్స్‌ కాగా.. మైమరిపించే ఫీల్డింగ్‌తో అదరగొట్టింది న్యూజిలాండ్‌ మాజీ కెప్టెన్‌ బ్రెండన్‌ మెకల్లమ్‌. అభిమానులు కనువిందు చేసిన ఈ దృశ్యం బిగ్‌బాష్‌ లీగ్‌లో బ్రిస్బెన్‌ హీట్‌-సిడ్నీ సిక్సర్స్‌ల మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్‌ చోటుచేసుకుంది. సిడ్నీ సిక్సర్‌ ఇన్నింగ్స్‌ 17వ ఓవర్‌లో జేమ్స్‌ విన్స్‌ లాంగాన్‌లో ఆడిన భారీ షాట్‌ ఆడాడు. దాదాపు సిక్స్‌ అని అందరూ భావించారు. కానీ రెప్పపాటులో అదే దిశలో బౌండరీ లైన్‌ వద్ద నిల్చున్న బ్రెండర్‌ మెకల్లమ్‌ బంతిని అద్భుతంగా అందుకున్నాడు.

అయితే బ్యాలెన్స్‌ కోల్పోతున్నట్లు భావించిన మెకల్లమ్‌ బంతిని గాల్లోకి విసిరేసి మరోసారి క్యాచ్‌ అందుకోవడానికి ప్రయత్నించాడు. ఈ సారి కూడా బౌండరీ రోప్‌పై పడుతానని భావించి బంతిని మైదానంలోకి నెట్టేశాడు. క్షణిక కాలంలో ఈ కివీస్‌ ప్లేయర్‌ చేసిన ఫీట్‌ను చూసి మైదానంలో అభిమానులు, ఆటగాళ్లు ఆశ్చర్యచకితులయ్యారు. బౌండరీ విషయంలో సందిగ్ధం నెలకొనడంతో ఫీల్డ్‌ అంపైర్‌ థర్డ్‌ అంపైర్‌ సమీక్ష కోరగా మెకల్లమ్‌కు ఫేవర్‌గా వచ్చింది. ఇప్పటికే బ్యాట్‌తో ఎన్నో గుర్తుండిపోయే ఇన్నింగ్స్‌లు ఆడిన మెకల్లమ్‌..  37 ఏళ్ల వయసులో కూడా అద్భుత ఫీల్డింగ్‌తో అదరగొట్టడంపై అభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో క్రికెట్‌ ఆస్ట్రేలియా తన అధికారిక ట్విటర్‌లో ‘క్యాచ్‌ పట్టలే కానీ.. మెకల్లమ్‌ ఎలా బౌండరీ ఆపాడో చూడండి!’ అని షేర్‌ చేసింది. దీంతో ఈ వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. ఇక ఈ మ్యాచ్‌లో సిడ్నీ సిక్సర్‌ నిర్ణీత 20 ఓవర్లకు 7 వికెట్లు నష్టపోయి 177 పరుగులు చేయగా.. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన బ్రిస్బెన్‌ హీట్‌ 98 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top