అశ్విన్‌ అదరగొడితే.. ముత్తుసామి ముప్పు తిప్పలు

Ashwin Seven Wickets give India 71 Run lead - Sakshi

విశాఖ: టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 431 పరుగుల వద్ద ఆలౌటైంది. 385/8 ఓవర్‌నైట్‌ స్కోరుతో శనివారం నాల్గో రోజు ఆటను కొనసాగించిన దక్షిణాఫ్రికా.. మరో 46 పరుగులు జోడించిన తర్వాత మిగతా రెండు వికెట్లను కోల్పోయింది. ఓవర్‌నైట్‌ ఆటగాడు కేశవ్‌ మహరాజ్‌(9;31 బంతుల్లో 1ఫోర్‌) తన వంతు పోరాటం చేసి తొమ్మిదో వికెట్‌గా ఔటయ్యాడు. అశ్విన్‌ బౌలింగ్‌లో మయాంక్‌ అగర్వాల్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. కాగా, మరో ఓవర్‌నైట్‌ ఆటగాడు ముత్తుస్వామి మాత్రం భారత బౌలర్లను తీవ్రంగా ప్రతిఘటించాడు. 106 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లతో 33 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. భారత్‌ మూలాలున్న ముత్తుసామి మాత్రం టీమిండియాను ముప్పు తిప్పలు పెట్టాడు.

ఎనిమిదో స్థానంలో వచ్చిచ ముత్తుసామి సమయోచితంగా ఆడుతూ కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. కాగా, చివరి వికెట్‌గా కగిసో రబడా(15) ఔట్‌ కావడంతో సఫారీల ఇన్నింగ్స్‌ ముగిసింది. భారత బౌలర్లలో అశ్విన్ అదరగొట్టాడు.  తన విలువ ఏమిటో చూపుతో వికెట్ల వేటను కొనసాగించాడు. ఏడు వికెట్లతో సత్తాచాటి ఇది తన బౌలింగ్‌ మ్యాజిక్‌ అని మరోసారి నిరూపించాడు.  ఇది అశ్విన్‌కు మరో అత్యుత్తమ ప్రదర్శనగా నిలిచింది. గతంలో నాలుగు సందర్బాల్లో ఒక ఇన్నింగ్స్‌లు అశ్విన్‌ ఏడు వికెట్లను నాలుగుసార్లు సాధించాడు.  తాజా ప్రదర్శనతో ఐదోసారి ఒక ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లను సాధించిన ఘనతను నమోదు చేశాడు. ఇక రవీంద్ర జడేజా రెండు వికెట్లు సాధించగా, ఇషాంత్‌కు వికెట్‌ దక్కింది.

శుక్రవారం సఫారీలు 98 ఓవర్లు ఆడినా కేవలం 5 వికెట్లు మాత్రమే చేజార్చుకొని మెరుగైన ప్రదర్శన కనబర్చడం విశేషం.  ఓపెనర్‌ డీన్‌ ఎల్గర్‌ (287 బంతుల్లో 160; 18 ఫోర్లు, 4 సిక్సర్లు), వికెట్‌ కీపర్‌ క్వింటన్‌ డి కాక్‌ (163 బంతుల్లో 111; 16 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీలు సాధించగా... కెప్టెన్‌ డు ప్లెసిస్‌ (103 బంతుల్లో 55; 8 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించాడు. ఎల్గర్‌ ఐదో వికెట్‌కు ప్లెసిస్‌తో 115 పరుగులు, ఆరో వికెట్‌కు డి కాక్‌తో 164 పరుగులు జోడించాడు. ఒకే రోజు దక్షిణాఫ్రికా 346 పరుగులు నమోదు చేసింది. ఓవరాల్‌గా భారత్‌ కంటే దక్షిణాఫ్రికా 71 పరుగుల వెనుకబడింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top