
సూసైడ్ చేసుకోవడంలో విఫలమయ్యాను!
తాను కలలు కన్న ఒలింపిక్స్ స్వర్ణాన్ని ఒడిసిపట్టాడు.
తాను కలలు కన్న ఒలింపిక్స్ స్వర్ణాన్ని ఒడిసిపట్టాడు. ఇక ఇంకేముంది.. ఆ ఆటగాడి జీవితం గాడిలో పడిందని భావిస్తున్నారు కదూ! కానీ అమెరికా స్విమ్మర్ జీవితం అంత సులువుగా ముందుకు సాగలేదు. అనారోగ్య సమస్యలు, పైగా డ్రగ్స్ కు బానిస కావడంతో ఎన్నో విమర్శలు వెల్లువెత్తాయి. కెరీర్ వద్దనుకుని స్విమ్మింగ్ నుంచి తప్పుకున్నాడు. మళ్లీ ఈత కొలనులో దిగి సంచలనాలు సృష్టిస్తూ 16 ఏళ్ల తర్వాత బంగారాన్ని సాధించాడు. అతడు మరెవరో కాదు అమెరికా వెటరన్ స్విమ్మర్ ఆంటోనీ ఇర్విన్.
2004లో సిడ్నీ ఒలింపిక్స్‌లో 19 ఏళ్లకే బంగారు పతకాన్ని సొంతం చేసుకున్నాడు. రెండేళ్లకు స్విమ్మింగ్ కు గుడ్ బై చెప్పాడు. వింత వ్యాధి(టోరెట్ సిండ్రోమ్)తో నిత్యం అవస్థపడేవాడు. మత్తు పదార్థాలకు బానిసగా మారి ఎప్పుడూ వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచేవాడు. ఇష్టరీతిన బైక్ రైడింగ్ చేస్తూ పట్టుబడటం, అధికారులు హెచ్చరించి వదిలిపెడితే.. మళ్లీ తనకు నచ్చినట్లుగా జీవితాన్ని లీడ్ చేశాడు. కొన్ని రోజులు మ్యూజిక్ స్కూలులో చేరి మధ్యలోనే తిరిగొచ్చేశాడు. వాస్తవానికి తన ఆరోగ్యం సరిగా లేనందుకే సమస్య నుంచి బయటపడే దారిలేక డ్రగ్ అడిక్ట్ గా మారాడు.
జీవితంపై విరక్తి చెందిన ఇర్విన్.. ఆత్మహత్యాయత్నం చేసినా ప్రాణాలతో బయటపడ్డాడు. సూసైడ్ చేసుకోవడంలోనూ తాను విఫలమయ్యాయని ఇర్విన్ మీడియాకు వెల్లడించాడు. భగవంతుడు తనకు పునర్జన్మ ప్రసాదించాడని మళ్లీ స్విమర్ గా రాణిస్తానని చెప్పిన ఆంటోనీ ఎర్విన్.. 2012లో లండన్ ఒలింపిక్స్ లో 50 మీటర్ల ప్రీ స్టైల్ లో పాల్గొని 5వ స్థానంలో నిలిచాడు. మరోసారి ప్రయత్నం చేద్దామని భావించిన ఇర్విన్.. రియోలో పాల్గొని రెండు స్వర్ణాలు కైవసం చేసుకుని లేటు వయసులో స్వర్ణం కొల్లగొట్టిన అమెరికన్ స్విమ్మర్ గా రికార్డులకెక్కాడు. రియోలో 400 మీటర్ల రిలేలో, 50 మీటర్ల ప్రీస్టైల్ విభాగంలోనూ స్వర్ణం సాధించి తనలో ఇంకా సత్తా తగ్గలేదని నిరూపించుకున్నాడు. లేటు వయసులో ఈత కొలనులో దిగి కుర్రాళ్లకు సైతం చెమటలు పట్టిస్తున్నాడు ఇర్విన్.