ఆర్థిక మంత్రిపై రమ్య ట్వీట్‌; నెటిజన్ల ఫైర్‌!

Divya Spandana Congratulates Nirmala Sitharaman But Not Go Well In Twitter - Sakshi

న్యూఢిల్లీ : కేంద్రంలో వరుసగా రెండోసారి అధికారం చేపట్టిన మోదీ కేబినెట్‌లో కీలకమైన ఆర్థిక శాఖను చేపట్టిన నిర్మలా సీతారామన్‌.. దేశంలో తొలి మహిళా ఆర్థిక మంత్రిగా చరిత్ర సృష్టించారు. ఈ క్రమంలో ఆమెకు అన్ని వర్గాల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ‘కీలకమైన ఆర్థిక శాఖను చేపట్టిన నిర్మలాసీతారామన్‌కు శుభాకాంక్షలు. ఆర్థిక మంత్రిగా పూర్తిస్థాయి బాధ్యతలు నిర్వర్తించనున్న ఆమె అన్ని హద్దులను చెరిపేశారు’  అని జమ్మూ కశ్మీర్‌ మాజీ సీఎం, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తి ప్రశంసలు కురిపించారు. ఇక కాంగ్రెస్‌ మాజీ ఎంపీ, సోషల్‌ మీడియా వింగ్‌ నాయకురాలు రమ్య(దివ్యా స్పందన) కూడా నిర్మలా సీతారామన్‌కు అభినందనలు తెలిపారు. ఈ మేరకు...‘ 1970లో ఇందిరా గాంధీజీ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించి మహిళలను గర్వపడేలా చేశారు. ఇప్పుడు మీరు కూడా ఆ శాఖను చేపట్టినందుకు అభినందనలు. కానీ జీడీపీ అంత గొప్పగా ఏమీ లేదు. అయినప్పటికీ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు మీ వంతుగా తప్పక కృషి​ చేస్తారని తెలుసు. మీకు ఎల్లప్పుడూ మా సహకారం ఉంటుంది. శుభాకాంక్షలు’ అని రమ్య ట్వీట్‌ చేశారు.

ఈ నేపథ్యంలో రమ్య ట్వీట్‌పై స్పందించిన నెటిజన్లు.. దేశ  తొలి ఆర్థిక మంత్రి అని నిర్మలా సీతారామన్‌ను పిలవడం కాంగ్రెస్‌ వాళ్లకు ఇష్టం ఉండదేమో అని విమర్శలు గుప్పిస్తున్నారు. ‘ మేడమ్‌.. ఇందిరాగాంధీ ప్రధాన మంత్రిగా ఉండి, ఆర్థిక శాఖను తన వద్ద పెట్టుకున్నారు. కానీ నిర్మలాజీపై నమ్మకంతో ప్రధాని ఆమెకు కీలక బాధ్యతలు అప్పగించారు. కాబట్టి తొలి ఆర్థిక మహిళా మంత్రిగా ఆమెను పరిగణించాలి. ఇక జీడీపీ అంటారా. మీ దృష్టిలో జీడీపీ అంటే గాంధీ డైనస్టీ పాలిటిక్స్‌ అనుకుంటా. ఎందుకంటే మీకు ఆ పదానికి వివరణ, అర్థం తెలియదు కదా. అభినందించే క్రమంలో ఇలా రాజకీయాలు చేయడం, ప్రజలను పక్కదారి పట్టించడం సరైంది కాదు’ అంటూ ట్రోల్‌ చేస్తున్నారు.

కాగా దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ తాత్కాలికంగా ఆర్థిక శాఖను నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే పూర్తిస్థాయిలో ఆర్థిక శాఖ మంత్రిగా నియమితులైన మహిళ నిర్మలా సీతారామనే. అంతేకాక గతంలో ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ దగ్గర సహాయ మంత్రిగా పని చేసిన అనుభవం కూడా ఆమెకు ఉంది. అదే విధంగా గత ప్రభుత్వంలో రక్షణ మంత్రిగా పని చేసిన నిర్మలా రామన్‌ సమర్థురాలిగా నిరూపించుకున్నారు కూడా. ఇక దేశం వృద్ధిరేటు తిరోగమనంలో ఉండటం,ఉపాధి కల్పన ఆశించిన మేర జరగకపోవడం,ద్రవ్యోల్బణం శృతి మించుతున్న ఈ సంక్లిష్ట పరిస్థితుల్లో  ఆర్థిక శాఖను నిర్వహించడం నిర్మలా సీతా రామన్‌కు సవాలేనని పరిశీలకులు అంటున్నారు.

Read latest Social Media News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top