‘రాజీనామాలపై మాట్లాడే అర్హత టీడీపీకి లేదు’

YV Subba Reddy Slams Cm Chandrababu Naidu - Sakshi

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి

సాక్షి, విజయవాడ :  ప్రత్యేక హోదా కోసం తాము చేసిన రాజీనామాలపై మాట్లాడే అర్హత టీడీపీకి లేదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని టీడీపీ దోచుకుంటుందని, స్వార్ధ రాజకీయాల కోసం రాష్ట్రానికి అన్యాయం చేస్తోందన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి యనమల రామకృష్ణుడు తమ రాజీనామాలపై మాట్లాడం సరికాదన్నారు. చంద్రబాబువి ఎప్పుడు వెన్నుపోటు రాజకీయాలేనని విమర్శించారు. చిత్త శుద్దితో ప్రత్యేక హోదాపై పోరాటాలు చేసింది తమ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలేనన్నారు. 

తమ పార్టీ అవిశ్వాసం కోసం తీర్మానం పెడితే చర్చ పెట్టలేదని, టీడీపీ ఇస్తే మాత్రం చర్చకు తీసుకువచ్చారని ఈ సందర్భంగా వైవీ గుర్తు చేశారు. వారి మధ్య కుమ్మకు రాజకీయాలు నడుస్తున్నాయనడానికి ఇదే నిదర్శనమన్నారు. 23 మంది ఫిరాయింపు దార్లపై చర్యలు తీసుకుంటే ఎన్నిలు వచ్చేవి కాదా? అని ప్రశ్నించారు. బుట్టా రేణుకపై చర్య తీసుకోవాలని ఫిర్యాదు చేశామని, ఆమెపై చర్య తీసుకున్నా ఎన్నికలు వచ్చేవన్నారు. కోట్లాది రూపాయలు దోచుకున్న ఘనత చంద్రబాబుదేనన్నారు. పగలు కాంగ్రెస్‌తో రాత్రిళ్లు బిజేపీతో చంద్రబాబు ఒప్పందాలు చేసుకుంటున్నారని విమర్శించారు. 

చంద్రబాబు ఎప్పుడు తమకు మిత్రుడేనని పార్లమెంట్‌ సాక్షిగా రాజ్‌నాథ్‌ సింగే చెప్పారని గుర్తు చేశారు. ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో ధర్నా చేస్తే మమ్మల్ని అరెస్ట్‌ చేయించారని తెలిపారు. ఎన్నికల కమీషన్ గైడ్ లైన్స్ ప్రకారం 14 నెలల ముందు రాజీనామా చేశామని స్పష్టం చేశారు. ఏప్రిల్ 6, 2018న ప్రత్యేక హోదా, విభజన హామీల కోసం రాజీనామాలు చేశామన్నారు. టీడీపీ, బీజేపీ భాగస్వాములుగా ఉండి హోదా విభజన హామీల విషయంలో మోసం చేశారని, ఇది ప్రజలకు చెప్పెందుకే రాజీనామాలు చేశామన్నారు.

హోదా కోసం గుంటూరులో 8 రోజులు  వైఎస్ జగన్ ఆమరణదీక్ష చేస్తే.. భగ్నం చేయించింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు.  మా ఎంపీలందరూ  రాజీనామా చేసి ఆమరమదీక్ష చేశారని, ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారన్నారు. ప్రజలే టీడీపీ ప్రభుత్వానికి బుద్ది చెబుతారని పేర్కొన్నారు. వంగవీటి రాధా తమ పార్టీలోనే ఉన్నారని స్పష్టం చేశారు. తాము బీజేపీతో కలిసి ఉంటే తమపై, వైఎస్‌ భారతిపై ఎందుకు కేసులు పెడతారని ప్రశ్నించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top