
సాక్షి, అమరావతి: వచ్చే ఎన్నికల్లో పాడేరు, అరకు నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీ గెలుపు ఖాయమని, జగనన్న అంటే తనకు ప్రాణమని పాడేరు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు. సోమవారం ఉదయం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబు సమక్షంలో ఆమె టీడీపీలో చేరారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ... తనకు రాజకీయ బిక్షపెట్టింది వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అని తెలిపారు. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న తనను పార్టీలోకి ఆహ్వానించి మంచి స్థానం కల్పించారని, ఇటీవల కొందరు నాయకులు పార్టీలో తనకు ప్రాధాన్యత తగ్గిస్తూ వచ్చారని పేర్కొన్నారు.
పార్టీని వీడుతున్నందుకు బాధగా ఉందన్నారు. సీఎం చంద్రబాబు ద్వారా గిరిజనులకు కావాల్సిన పనులు చేయించవచ్చుననే ఆలోచన ఉందని చెప్పారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో గిరిజనులకు ఎంతో మేలు జరిగిందని, ఆయనంటే గిరిజనులకు ప్రాణమని వివరించారు. మూడున్నరేళ్లలో వైఎస్సార్‌సీపీ మరింత బలంగా తయారైందని ఈశ్వరి ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఇప్పటికిప్పుడు తెలుగుదేశం ఆ నియోజకవర్గాల్లో గెలవాలంటే సాధ్యం కాదన్నారు.
జారుకున్న టీడీపీ నేతలు: గిడ్డిఈశ్వరి విలేకరులతో మాట్లాడుతున్నప్పుడు ఆమెతో పాటు వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులు చిన్నగా అక్కడి నుంచి జారుకున్నారు. వైఎస్సార్‌సీపీని పొగుడుతూ ఆమె మాట్లాడటాన్ని వారు జీర్ణించుకోలేకపోయారు.