వందకోట్ల ఫైన్‌.. ఇంతకన్నా సిగ్గుచేటు ఏముంటుంది?

YS Vijayamma Fires on Chandrababu Naidu in Putalapattu - Sakshi

చంద్రబాబు పాలనపై ధ్వజమెత్తిన వైఎస్‌ విజయమ్మ

పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యంలో ఎన్నికల ప్రచారం

సాక్షి, చిత్తూరు: రాష్ట్రంలో ఇసుక, మట్టి మొదలు.. అన్నింటిలోనూ టీడీపీ నేతలు దోడిపీకి పాల్పడుతున్నారని, ఇసుక అక్రమ తవ్వకాల విషయంలో జాతీయ హరిత ట్రిబ్యునల్‌ చంద్రబాబు సర్కారుపై 100 కోట్ల రూపాయల జరిమానా విధించిందని, ఇంతకన్నా సిగ్గుచేటు ఏముంటుందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ మండిపడ్డారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యంలో శుక్రవారం జరిగిన ఎన్నికల ప్రచారంలో విజయమ్మ ప్రసంగించారు. ఈ సందర్భంగా పూతలపట్టు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఎంఎస్‌ బాబు, చిత్తూరు ఎంపీ అభ్యర్థి నల్లకొండగారి రెడ్డప్పలను ప్రజలకు పరిచయం చేసి.. ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేసి.. వారిని ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే.. 108 అంబులెన్స్‌ కూతలు మళ్లీ వినిపిస్తాయని, ఆరోగ్య శ్రీ పథకం ద్వారా ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రత్యేక హోదా కోసం మొదటినుంచి పోరాటం చేస్తోంది వైఎస్సార్‌సీపేనని గుర్తు చేశారు. 25 ఎంపీ స్థానాలు గెలిపించండి..ప్రత్యేక హోదా సాధించుకుందామని పిలుపునిచ్చారు. 


 
చంద్రబాబునాయుడు అధికారంలోకి రాగానే చిత్తూరు జిల్లాలోని సహకార చక్కెర ఫ్యాక్టరీలను మూయించారని, లాభాల్లో ఉన్న విజయ డైరీని సైతం మూసివేసి.. తనకు చెందిన హెరిటేజ్‌ డైరీని లాభాల్లోకి తీసుకెళ్లారని అన్నారు. చంద్రబాబు తన పాలనలో రైతులను ఏమాత్రం పట్టించుకోలేదని, మామిడి పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో ఆ రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పసుపు-కుంకుమ పేరుతో ఎన్నికల  సమయంలో చంద్రబాబు మహిళలను మోసం చేస్తున్నారు. 

2 రూపాయలకు 20 లీటర్ల మినరల్‌ వాటర్‌ ఇస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు.. ఆ హామీని నెరవేర్చారా? అని విజయమ్మ ప్రశ్నించారు. రాష్ట్రంలో నీళ్లు కంటే మద్యం విచ్చలవిడిగా దొరుకుతోందని,  వైసీపీ అధికారంలోకి రాగానే మద్యపాన నిషేధాన్ని నాలుగు దశల్లో అమలు చేస్తామన్నారు. హంద్రీనీవా ప్రాజెక్టుకు సంబంధించిన పనులు జిల్లాలో 80శాతం దివంగత మహానేత వైఎస్సార్‌ హయాంలోనే పూర్తయ్యాయని, అయినా, మిగతా పనులను చంద్రబాబు పూర్తి చేయలేకపోయారని విమర్శించారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top