ఫోన్లు చేసి మరీ పింఛన్లు ఆపేస్తున్నారు: వైఎస్‌ జగన్‌

YS Jagan Mohan Reddy Fires On TDP Government In Peddapuram - Sakshi

హోంమం‍త్రి చినరాజప్ప తీరుపై రాష్ట్ర ప్రతిపక్ష నేత మండిపాటు

ప్రజాసంకల్పయాత్రలో భాగంగా పెద్దాపురంలో బహిరంగ సభ

సాక్షి, పెద్దాపురం: రాష్ర్టంలో శాంతి భద్రతలు కాపాడాల్సిన హోంమంత్రి నియోజకవర్గంలో ఆరు హత్యలు చోటుచేసుకోవడం టీడీపీ ప్రభుత్వ పాలనకు అద్దం పడుతోందని వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు, రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. మిగతా పార్టీలకు అనుకూలంగా ఉన్నారన్న కారణంతో పేదలకు రావాల్సిన పింఛన్లు  సైతం  ఫోన్లు చేసి అడ్డుకుంటారని హోం మంత్రి చినరాజప్పపై వైఎస్‌ జగన్‌ పరోక్షంగా ఆరోపణలు చేశారు. 220వ రోజు ప్రజా సంకల్పయాత్రలో భాగంగా  తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం పట్టణంలో బుధవారం వైఎస్‌ జగన్‌ బహిరంగ సభ నిర్వహించారు. పెద్దాపురంలోని వేములవారి సెంటర్‌లో జరిగిన ఈ బహిరంగ సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. 

ఈ సభలో వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ..దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో పోలవరం నిర్మాణ ప్రక్రియ శరవేగంగా సాగిందనీ, చంద్రబాబు అధికారంలోకి వచ్చి నాలుగేళ్లయినా పునాది గోడలు కూడా పూర్తికాలేదని ఎద్దేవా చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలకు పోలవరం కాంట్రాక్టులు కట్టబెట్టి కోట్ల రూపాయల అవినీతికి పాల్పడుతున్నారని సీఎం చంద్రబాబుపై మండిపడ్డారు. కాంట్రాక్టర్లతో లెక్కలు తేల్చుకోవడానికే ప్రతీ సోమవారం చంద్రబాబు పోలవరం పర్యటన చేస్తారని దుయ్యబట్టారు.

వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వస్తే సున్నా వడ్డీ రుణాలను పునరుధ్దరిస్తామని అన్నారు. ఎన్నికల నాటికి డ్వాక్రా మహిళల అప్పు మొత్తాన్ని నాలుగు విడతల్లో నేరుగా చెల్లిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ప్రతి పేదవాడికి ఇల్లు కటిస్తామనీ, ఆ ఇళ్లను అక్కాచెల్లెమ్మల పేరిట రిజిస్ట్రేషన్‌ చేయించి ఇస్తామని అన్నారు. ప్రతి మహిళా లక్షాధికారి కావాలనే వైఎస్సార్‌ కలను నిజం చేస్తామని ఉద్ఘాటించారు.

చెరువులను తవ్వి సొమ్ము చేసుకుంటున్నారు..
‘నాలుగేళ్ల చంద్రబాబు పాలన అవినీతిమయం, మోసాలతో ముగిసింది. మట్టి, ఇసుకతో సహా అన్నింటిలోను దోపిడీ చేశారు. నీరు-చెట్టు పథకం ద్వారా మట్టిని కూడా దోచేశారు. చెరువుల్లో పూడికతీత పేరుతో తాటి చెట్టులోతు తవ్వకాలు జరిపారు. యథేచ్చగా మట్టిని అమ్ముకుని సొమ్ము చేసుకున్నారని విమర్శించారు. పేదలను కూడా వదలకుండా దోచుకున్న వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు. దివంగత నేత వైఎస్సార్‌ పేదల కోసం సేకరించిన స్థలాల్లో ఇప్పుడు బాబు అవినీతి ప్లాట్లు నిర్మిస్తామంటున్నారు. అడుగుకు రూ. వెయ్యి అయ్యే ప్లాటును బాబు 2వేల రూపాయలకు అమ్ముతాడట. మూడు లక్షలు అయ్యే ప్లాటును బాబు 6లక్షలకు అమ్ముతాడట. మూడు లక్షలు ప్రభుత్వం మాఫీ చేయగా.. మరో 3 లక్షలు పేద ప్రజలు 25 ఏళ్ల వరకూ చెల్లించాలట. మీకు ప్లాటు ఇస్తే ​కాదనకుండా బంగారంలా తీసుకోండి. అధికారంలోకి రాగానే ఆ డబ్బులను మాఫీ చేస్తాం. ఎన్నికల సమయంలో రూ. 87వేల 612 కోట్ల వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామని బాబు హామీ ఇచ్చారు. కానీ టీడీపీ ప్రభుత్వం చెల్లించిన డబ్బుతో వడ్డీలు కూడా మాఫీ కాలేదు’ అని వైఎస్‌ జగన్‌ ఆరోపించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top