బీసీలందరినీ ఏకం చేద్దాం

Ys jagan comments about bc declaration - Sakshi

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌

చంద్రబాబు బీసీలను దారుణంగా మోసం చేశారు

మేనిఫెస్టోలో ఎన్నో హామీలు ఇచ్చి ఒక్కటీ అమలు చేయలేదు

బీసీలకు న్యాయం జరిగిందీ అంటే దివంగత సీఎం వైఎస్‌ హయాంలోనే

వైఎస్‌ చేసిన మంచినీ, బాబు మోసాలను గ్రామ గ్రామాన వివరించాలి

సవ్యసాచులై దూసుకెళ్లాలని పార్టీ బీసీ ముఖ్య నేతల సమావేశంలో ప్రతిపక్షనేత పిలుపు

చంద్రబాబు దృష్టిలో బీసీలకు మేలు చేయడమంటే వారికి ఇస్త్రీ పెట్టెలు, కత్తెర్లు ఇవ్వడమే. ఆయన అన్ని కులాల వారిని మోసం చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రతి బీసీ విద్యార్థి ఫీజురీయింబర్స్‌మెంట్‌తో సంతోషంగా ఉన్నత చదువులు చదువుకున్నాడు. బీసీలకు వైఎస్‌ చేసినంత మేలు ఎవ్వరూ చేయలేదు. ఆ విషయాన్ని మనం బీసీలకు వివరించాలి.      
– వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: ‘మేనిఫెస్టోలో ఇచ్చిన ఒక్క హామీనీ అమలు చేయకుండా, అన్ని కులాల వారిని దారుణంగా వంచించిన చంద్రబాబు.. బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకుని మోసం చేశారు. ఈ మోసానికి వ్యతిరేకంగా బీసీలందరూ ఏకమై తమ సత్తా చాటాలి’ అని ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపినిచ్చారు. బీసీలకు న్యాయం జరిగిందంటే దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాం లోనేనని, ఆ రోజుల్లో బీసీ విద్యార్థులందరూ వారికిష్టం వచ్చిన కోర్సులో చేరి సంతృప్తిగా చదువుకున్నారని చెప్పారు. ఫీజురీయింబర్స్‌ మెంట్‌ పథకం కింద ప్రభుత్వమే వారి ఫీజును భరించిందని తెలిపారు. బీసీ నేతలు ఈ విషయాలను ప్రతి జిల్లా, ప్రతి మండలం, ప్రతి గ్రామంలోని బీసీ వర్గాలకు వివరించి వారిని చైతన్య పరచాలని చెప్పారు. సోమవారం తొలిసారిగా విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన ఆ పార్టీ బీసీ ముఖ్య నేతల సమావేశంలో 13 జిల్లాల నుంచి వచ్చిన వారితో వైఎస్‌ జగన్‌ మూడు గంటల పాటు ముఖాముఖి మాట్లాడి అభిప్రాయాలు తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆరు, ఏడు నెలల పాటు నేతలు క్షేత్ర స్థాయిలో పర్యటించి వైఎస్‌ హయాంలో జరిగిన మేలును, చంద్రబాబు చేసిన మోసాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ఆయా జిల్లాల నుంచి వచ్చే అభిప్రాయాలు, బీసీల అభ్యున్నతికి ఏం చేస్తే బాగుంటుందో ఆ అంశాలన్నింటినీ క్రోడీకరిం చాలని, ఆ తర్వాత పార్టీ తరఫున ‘బీసీ గర్జన’ నిర్వహిస్తామని వెల్లడించారు. అందులో ‘బీసీ డిక్లరేషన్‌’ ప్రకటిస్తామని, అందులో ఏదైతే చెబుతామో అవే అంశాలు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరుస్తామని వివరించారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటన్నింటినీ ఖచ్చితంగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. చంద్రబాబు మాదిరిగా మాటల్లో చెప్పేదొకటి, చేసేది మరొకటిగా ఉండబోదన్నారు. మళ్లీ ఐదేళ్ల తర్వాత ఎన్నికల నాటికి ఇప్పుడు ప్రకటించే మేనిఫెస్టోను చూపి.. వాటిని అమలు చేశామని బీసీలకు చెబుతామని చెప్పారు. బీసీల పట్ల చంద్రబాబు ప్రదర్శిస్తున్న వివక్షను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బడుగు బలహీన వర్గాల వారికి తెలియజెప్పి వారందరినీ ఒక తాటిపైకి తీసుకు రావాలని కోరారు. జగన్‌ తన ప్రసంగంలో ఇంకా ఏమన్నారంటే..

బీసీ వర్గాల్లో మనోధైర్యం నింపుదాం
‘‘బీసీ వర్గాల ప్రజలతో మమేకమై వారి నుంచే వివరాలను తీసుకోవడంతో పాటు చంద్రబాబు చేసిన అన్యాయాలను వివరించాలి. మనం అధికారంలోకి వస్తే ఏవిధంగా బీసీల జీవితాలు బాగు పడతాయో చెప్పాలి. వారి నుంచి కూడా సలహాలు తీసుకోవాలి. నా పాదయాత్ర పూర్తయ్యే సమయానికి అందరం కలసి బీసీ గర్జన నిర్వహిద్దాం. ఆ గర్జనలో రాష్ట్రంలోని ప్రతి జిల్లా నుంచి ప్రతి కులానికి ప్రాతినిధ్యం కల్పిద్దాం. చంద్రబాబు మాదిరిగా బీసీ డిక్లరేషన్‌ చేసి మోసం చేసినట్లుగా మనం చేయం.

అందుకు భిన్నంగా మనం ప్రకటించే డిక్లరేషన్‌ను అమలు చేద్దాం. ఈ క్రమంలోనే మీ (బీసీ నేతలు) అందరినీ పిలిచి ఇప్పుడు సూచనలు, సలహాలు అడుగుతున్నాను. పార్టీకి చెందిన బీసీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర ముఖ్య నేతలందరూ కలిసి కమిటీగా ఏర్పాటై.. ప్రతి జిల్లా, ప్రతి నియోజకవర్గం, ప్రతి మండలం, ప్రతి గ్రామాన్ని పర్యటించేందుకు వీలుగా ఒక కార్యాచరణను రూపొందిస్తారు. ఇలా గ్రామాలకు వెళ్లినప్పుడు బీసీ వర్గాల్లో మనోధైర్యం నింపాలి. చంద్రబాబు చేస్తున్న అన్యాయాలను వివరిస్తూ.. ఏరకంగా ఆయన బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా చేసుకుని వాడుకున్నాడో.. రిజర్వేషన్, గర్జన అంటూ ఎలా మోసం చేశాడో వివరించాలి. 

10 వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్‌ అన్నారు
తాను అధికారంలోకి వస్తే ప్రతి ఏటా రూ.10 వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్‌ను అమలు చేస్తానని చంద్రబాబు చెప్పారు. ఇప్పటికి నాలుగు బడ్జెట్లు పూర్తయినా మాట నిలబెట్టుకున్నది లేదు. నాలుగేళ్లలో రూ.40 వేల కోట్లు సబ్‌ప్లాన్‌కు ఇవ్వాల్సి ఉండగా 2014 – 15లో రూ.2,054 కోట్లు మాత్రమే కేటాయించారు. 2015 – 16లో రూ.3,195 కోట్లు కేటాయించి ఇందులో కేవలం రూ 2,595 కోట్లు మాత్రమే విడుదల చేశారు. 2016 – 17లో రూ.5,103 కోట్లు కేటాయించి రూ.4,335 కోట్లు మాత్రమే ఇచ్చారు.

ఈ రకంగా చంద్రబాబు మేనిఫెస్టోలో చెప్పిందేమిటో, చేస్తున్నదేమిటో బీసీలకు వివరించాలి. మోసం చేశాడనే విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్లాలి. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు వైఎస్‌ సీఎం కాక మునుపు బీసీలు ఎంత దుర్భర పరిస్థితుల్లో ఉండేవారో అందరికీ తెలుసు. ఒక బీసీ విద్యార్థి ప్రస్తుతం ఇంజనీరింగ్‌ చదవాలంటే లక్ష రూపాయలపైనే అవుతుంది. ఈ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం కింద ఇస్తున్నది కేవలం రూ.35 వేలు మాత్రమే. అది కూడా ఏడాది తర్వాత ఇస్తున్నారు. మిగిలిన రూ.65 వేలు ఇల్లమ్మి కట్టుకోమని నిర్దాక్షిణ్యంగా మాట్లాడు తున్నారు. వైఎస్‌ అమలు చేసిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం వల్లే పేదలు పెద్ద చదువులు చదువుకున్నారు. ఆయన మృతి చెందిన తర్వాత పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వకపోవడంతో చదువులు ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. 

నేడు ధర్మవరానికి జగన్‌
అనంతపురం: చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఉద్యమాన్ని ఉధృతం చేస్తోంది. దాదాపు 37 రోజులుగా అనంతపురం జిల్లా ధర్మవరంలో చేనేత కార్మికులు చేస్తున్న దీక్షలకు సంఘీభావం తెలిపేందుకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారమిక్కడికి రానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు బెంగళూరులో బయల్దేరి.. రోడ్డుమార్గంలో ఆయన ధర్మవరం చేరుకుంటారు. మార్గంమధ్యలో రాప్తాడు నియోజకవర్గంలోని కనగానపల్లి మండల పరిధిలో ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను జగన్‌ పరిశీలిస్తారు. ఈ వివరాలను రాజంపేట ఎంపీ, పార్టీ జిల్లా ఇన్‌చార్జి మిథున్‌రెడ్డి సోమవారం అనంతపురంలో మీడియాకు వెల్లడించారు. చేనేత కార్మికులను తెలుగుదేశం పార్టీ ఓటు బ్యాంకుగా వాడుకుంటోందని ధ్వజమెత్తారు. మీడియా సమావేశంలో  ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి, రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కంప్యూటర్లో చంద్రబాబు మేనిఫెస్టో మాయం
జగనన్న వస్తేనే రాజన్న రాజ్యం మళ్లీ వస్తుందని అందరికీ చెప్పండి. వైఎస్‌ పథకాలను గుర్తు చేస్తూ ముందుకెళ్లండి. వైఎస్‌ హయాంలో దేశం మొత్తం మీద 48 లక్షల ఇళ్లు కడితే రాష్ట్రంలో 13 జిల్లాల్లోనే 24 లక్షల ఇళ్లు కట్టారని గుర్తు చేయండి. ఉమ్మడి రాష్ట్రంలో 48 లక్షల ఇళ్లు కట్టి చరిత్ర సృష్టించారు. ఈ వాళ ఇçళ్ల పరిస్థితి ఏమిటో ఒకసారి వివరించండి. ఆ నాడు పేదలు ఆరోగ్య శ్రీ భరోసాతో వైద్యం కోసం ఆందోళన లేకుండా ఆసుపత్రికి ఎలా వెళ్లారో గుర్తు చేయండి. అప్పట్లో 108, 104 పథకాలు ఎలా కొనసాగాయో.. నేడు వాటి పరిస్థితి ఏమిటో చెప్పాలి. రాజన్న రాజ్యం మళ్లీ వస్తేనే అవన్నీ అందుతాయని గుర్తు చేయండి. చంద్రబాబు మేనిఫెస్టోలో ఏమేమో చేస్తానని చెప్పి కులాలను ఏవిధంగా వాడుకున్నారో గుర్తు చేయండి.

ప్రస్తుతం చంద్రబాబు మేనిఫెస్టో కంప్యూటర్లో (ఆ పార్టీ వెబ్‌సైట్‌లో) కన్పించడం లేదు. తన మోసాలు, అబద్ధాలు బయటకు వస్తాయి కాబట్టే మేనిఫెస్టోను కంప్యూటర్లో పెట్టే ధైర్యం కూడా చంద్రబాబుకు లేదు. హామీ అమలు సాధ్యమవుతుందో కాదో కూడా చూడకుండా ఎలా బీసీలను వంచించారో కూడా చెప్పండి. ఉదాహరణకు రజక, కురుబ, కురుమ తదితర కులాలను ఎస్సీ.. బోయ/వాల్మీకిలను ఎస్టీలుగా గుర్తించేందుకు చర్యలు తీసుకుంటానని చెప్పి, ఆ తర్వాత కేవలం రెకమెండ్‌ చేసి కేంద్రానికి పంపుతానంటున్నాడు. రజకులు 15 రాష్ట్రాలో ఎస్సీల జాబితాలో ఉన్నారు. మన రాష్ట్రంలో మాత్రం ఎస్సీలుగా రెకమెండ్‌ చేస్తానన్నారు. ఇలా గాండ్ల, ఉప్పర, సగర చివరకు అన్ని కులాలనూ వదల్లేదు.  

మార్పు కోసం ఊరూరూ తిరగండి
ప్రతి చేనేత కుటుంబానికి రుణాలు మాఫీ అని, ప్రతి కుటుంబానికి రూ.1.50 లక్షలతో ఇల్లు నిర్మిస్తానని చంద్రబాబు చెప్పారు. ఇప్పుడు రుణాలు మాఫీ కాక ఆత్మహత్యలు జరుగుతున్నాయి. చంద్రబాబు మేనిఫెస్టోను ప్రతి ఊరికి తీసుకెళ్లి ఆయన చేసిన మోసాలను, అబద్ధాలు, అన్యాయాలను వివరించండి. ఒక రాజకీయ నాయకుడు మైకు పట్టుకొని మోసపూరితంగా మాట్లాడితే అతని కాలర్‌ పట్టుకొనే పరిస్థితి వచ్చినప్పుడే రాజకీయ వ్యవస్థ బాగుంటుందని చెప్పండి. ఈ మార్పునకు శ్రీకారం చుట్టాలని మీరంతా ప్రతి ఊరికి వెళ్లండి. ఆ తర్వాత మనం నిర్వహించే బీసీ గర్జనలో ప్రకటించే డిక్లరేషన్‌ తర్వాత రూపొందించే మన మేనిఫెస్టో బాబు లాగా ఉతుత్తి మేనిఫెస్టో కానేకాదు అని చెప్పండి.

పాదయాత్ర జరుగుతున్నప్పు డు గ్రామాలకు వెళ్లి బడుగు, బలహీన వర్గాల్లో ఆత్మ స్థైర్యాన్ని నింపండి. మనం ఉన్నామని వారికి భరోసా ఇవ్వండి. వైఎస్‌ చేసిన మంచిని గుర్తు చేస్తూ చైతన్యవం తులను చేయండి. ఐదేళ్ల తర్వాత మన పరిపాలన చూసి ప్రతి అంశాన్నీ చేయగలిగామని చెప్పే దిశగా మీరంద రూ భాగస్వాములు కావాలని కోరుతున్నాను. అందరూ సవ్యసాచులై ముందుకెళ్లాలని కోరుతున్నా’’ అని వైఎస్‌ జగన్‌ అన్నారు. ఈ సమావేశం వేదికపై పార్టీ బీసీ విభా గం అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి, ముఖ్యనేతలు బొత్స సత్యనారాయణ, మోపిదేవి వెంకటరమణ, కె.పార్థసా రథి, పిల్లి సుభాష్‌ చంద్రబోస్, తమ్మినేని సీతారాం, ఎమ్మెల్యేలు పి.అనిల్‌ కుమార్‌ యాదవ్, బూడి ముత్యా లనాయుడు, గుమ్మనూరు జయరాం ఆసీనులయ్యారు. ఎంపీలు విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, కృష్ణా జిల్లా ఇన్‌చార్జ్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top