యడ్డీ గట్టెక్కేదెలా..?

Yeddyurappa seeks conscience vote from MLAs during floor test - Sakshi

న్యూఢిల్లీ: సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన యడ్యూరప్ప ముందు బలనిరూపణ పెద్ద సవాలుగా నిలిచింది. ఒక స్వతంత్ర ఎమ్మెల్యేతో కలిపి బీజేపీ బలం 105 మాత్రమే. మెజారిటీ మేజిక్‌ ఫిగర్‌ మాత్రం 112. ఈ పరిస్థితుల్లో విశ్వాస పరీక్ష నెగ్గడమెలా? ఇందుకు సంబంధించి యడ్యూరప్ప ముందు రెండు మార్గాలున్నాయి. అవి..

1. విపక్ష సభ్యుల గైర్హాజరు
విశ్వాస పరీక్ష సమయంలో కాంగ్రెస్, జేడీఎస్‌లకు చెందిన కనీసం 13 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండా చేయాలి. లేదా అసెంబ్లీకి హాజరైనా ఓటింగ్‌లో పాల్గొనకుండా చూడాలి. దానివల్ల అసెంబ్లీకి హాజరై ఓటేసే ఎమ్మెల్యేల సంఖ్య 209కి పడిపోతుంది. అప్పుడు హాజరైన లేదా ఓటేసిన ఎమ్మెల్యేల్లో యూడ్యూరప్పకు మెజారిటీ(సగం కన్నా ఒకరు ఎక్కువ) లభిస్తే సరిపోతుంది. అంటే 105 మంది ఎమ్మెల్యేల మద్దతుంటే యడ్యూరప్ప గట్టెక్కుతారు. ఒక స్వతంత్ర ఎమ్మెల్యేతో కలిపి బీజేపీకి ఇప్పటికే 105 మంది శాసన సభ్యుల మద్దతుంది. గైర్హాజరైన లేదా ఓటేయని ఎమ్మెల్యేలను ఆయా పార్టీలు బహిష్కరిస్తే ఉప ఎన్నికలు జరుగుతాయి.

2. కాంగ్రెస్, జేడీఎస్‌ల్లో చీలిక
కాంగ్రెస్, జేడీఎస్‌ ఎమ్మెల్యేల్లో.. ఏ ఒక్క పార్టీ నుంచైనా కనీసం మూడింట రెండొంతుల మంది ఆయా పార్టీల నుంచి బయటకు వచ్చి బీజేపీలో చేరాలి. ఫిరాయింపుల నిరోధక చట్టం ద్వారా ఎమ్మెల్యేలు అనర్హతకు గురి కాకుండా ఉండాలంటే.. కాంగ్రెస్‌ నుంచి కనీసం 52 మంది లేదా జేడీఎస్‌ నుంచి 24 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించాలి. కాంగ్రెస్‌ నుంచి మూడింట రెండొంతుల మంది ఎమ్మెల్యేలు వస్తే బీజేపీ బలం 157 చేరుతుంది. లేదా జేడీఎస్‌ నుంచి మూడింట రెండొంతుల మంది వస్తే బీజేపీ బలం 129కి చేరుతుంది. అయితే, ఇంత పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలను ఫిరాయించేలా ఒప్పించడం  కష్టసాధ్యమే.  
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top