క్షుద్రపూజలు చేయించానా?  | Vallabhaneni Vamsi Fires On Chandrababu | Sakshi
Sakshi News home page

పదవులమ్ముకున్నానా? క్షుద్రపూజలు చేయించానా? 

Nov 17 2019 4:23 AM | Updated on Nov 17 2019 11:12 AM

Vallabhaneni Vamsi Fires On Chandrababu - Sakshi

విజయవాడలో మీడియాతో మాట్లాడుతున్న వల్లభనేని వంశీ

సాక్షి, విజయవాడ: హైందవ సాంప్రదాయాన్ని అగౌరవపరుస్తున్నానని టీడీపీ నేతలు అంటున్నారని, అయితే తాను వెయ్యికాళ్ల మండపం కూల్చలేదని, దుర్గగుడిలో క్షుద్రపూజలు చేయించలేదని, టీటీడీ చైర్మన్, బోర్డు సభ్యుల పదవులు అమ్ముకోలేదని, విశాఖ స్వరూపానంద స్వామిజీ వద్దకు ఎవరు వెళుతున్నారో తెలుసుకునేందుకు సీసీ కెమెరాలు పెట్టలేదని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌ మండిపడ్డారు. తనపై టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యల పట్ల ఆయన తీవ్రంగా ప్రతిస్పందించారు. శనివారం విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ.. టీడీపీ నేతలపై నిప్పులు చెరిగారు. టీడీపీ నుంచి నలుగురు ఎంపీలు బీజేపీలోకి వెళితే వారి రాజీనామా ఎందుకు కోరలేదు? ఇప్పుడు నా రాజీనామా ఎందుకు డిమాండ్‌ చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రజాక్షేత్రంలో గెలిచి ఎమ్మెల్యేనైన తనను ఓడిపోయిన లోకేశ్‌ రాజీనామా కోరడమేంటని ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా ఓడిపోయాక ఎమ్మెల్సీ పదవికి ఎందుకు రాజీనామా చేయలేదని నిలదీశారు. దమ్ముంటే టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్లిన నలుగురు ఎంపీలను వారి పదవుల నుంచి తొలగించమని కోరుతూ ప్రధాని నరేంద్రమోదీ ఇంటి ముందు ధర్నా చేద్దాం రమ్మని చంద్రబాబును కోరారు. లోకేశ్, తన రాజీనామా కోరే నేతలందరూ తమ వెంట వస్తే.. ఎంపీల రాజీనామా కోసం ధర్నా చేద్దామని సూచించారు. ఇందుకు తన సొంతఖర్చులతో ప్రత్యేక విమానం ఏర్పాటు చేస్తానని చెప్పారు.

చంద్రబాబు కాంగ్రెస్‌ను ఎందుకు వీడారు?
రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తాను పార్టీని వీడటం తప్పని టీడీపీ నేతలు చెబుతున్నారని, మరి ఇందిరాగాంధీ.. చంద్రబాబును ఎమ్మెల్యే చేసి మంత్రిని చేశారని, అటువంటి పార్టీని చంద్రబాబు ఎందుకు వీడారని వంశీ నిలదీశారు. ‘‘ఇందిరమ్మ ఆదేశిస్తే తన మామపై పోటీచేస్తానని ప్రకటించినా, రంగులు వేసుకునేవారికి రాజకీయాలు ఎందుకని ప్రశ్నించినా చంద్రబాబును పార్టీలోకి తీసుకుని ఎన్టీఆర్‌ మంత్రిని చేశారు. అటువంటి మామ ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కుని ఆయన్ను పార్టీలోంచి ఎందుకు వెళ్లగొట్టారు? పార్టీ నాయకత్వం నచ్చకపోతే జగన్‌మోహన్‌రెడ్డిలాగా సొంతంగా పార్టీ పెట్టుకోవాలే కాని.. ఉన్నపార్టీని లాక్కోవడం సరైనదేనా? న్యాయసూత్రాలు నాకు మాత్రమే వర్తిస్తాయా?’’ అని మండిపడ్డారు.

నాపైన ఓటుకు కోట్లు కేసు లేదు..
వైవీబీ రాజేంద్రప్రసాద్‌కు డబ్బులిచ్చిన మాట వాస్తవమేనని, అయితే తరువాత కొంతకాలానికి సుజనాచౌదరి ఆ డబ్బు ఇచ్చేశారని వల్లభనేని చెప్పారు. తాను వ్యక్తిగతంగా సహాయం చేస్తే అది మరిచిపోయి తనను తిట్టడం వల్లనే ఆగ్రహం వచ్చి రాజేంద్రప్రసాద్‌ను తిట్టానన్నారు. కేసులకు భయపడి తాను పార్టీ మారలేదంటూ.. తనపై ఓటుకు కోట్లు కేసు లేదని వ్యాఖ్యానించారు. తాను రాజకీయాల్లోకి రాకముందే కేసులున్నాయని, రామవరప్పాడులో పేదల ఇళ్లు తీసినప్పడు టీడీపీ ప్రభుత్వమే తనపై కేసులు పెట్టిందని, అప్పుడే భయపడలేదని.. ఇప్పుడు భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. లోకేశ్‌ను పప్పు అని తాను అనలేదని, రామ్‌గోపాల్‌వర్మ పప్పు అంటూ పాట తీశారన్నారు. ఇంటర్‌నెట్‌లో ఏపీ పప్పు అంటే ఎవరి ఫొటోలు వస్తాయో చూడాలన్నారు. రామ్‌గోపాల్‌ వర్మను ఏమీ చేయలేక తనను నిందిస్తున్నారని తప్పుపట్టారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement