ఢీ అంటే ఢీ

Vallabhaneni Vamsi Comments On TDP - Sakshi

గన్నవరం ఎమ్మెల్యేపై మూకుమ్మడిగా మాటల దాడి చేస్తున్న టీడీపీ నేతలు 

అంతే ధాటిగా తిప్పికొడుతున్న వంశీ 

ఆ పార్టీ లోపాయికారి వ్యవహారాలను బహిర్గతం చేస్తున్న వైనం 

వంశీపై పోలీసులకు వైవీబీ వర్గీయుల ఫిర్యాదు 

మరోవైపు తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా పోస్టింగ్‌లు పెట్టారని పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే

సాక్షి, విజయవాడ: గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌ తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన దగ్గర నుంచి ఆ పార్టీ నేతలు ఆయనపై మాటల దాడి చేస్తున్నారు. అయితే ఎమ్మెల్యే వంశీ మోహన్‌ కూడా ఏ మాత్రం తగ్గకుండా ఎదురుదాడికి దిగుతున్నారు. నువ్వు ఒకటంటే.. నేను రెండంటాను అన్నట్లు తెలుగుదేశం నేతల లోపాయికారి బాగోతం మొత్తాన్ని బహిర్గతం చేస్తున్నారు.
 
పోలీసు స్టేషన్‌లకు చేరిన వివాదం.. 
గురువారం సాయంత్రం ఓ టీవీ చానల్‌లో జరిగిన డిబేట్‌లో ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్‌పై వంశీమోహన్‌ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వైవీబీ వర్గీయులు ఉయ్యూరు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాగా సోషల్‌ మీడియాలో టీడీపీ నేతలు తన ఫొటోలు మార్ఫింగ్‌ చేసి తమ క్యారెక్టర్‌ను, కుటుంబ పరువును దెబ్బ తీసే విధంగా పోస్టింగ్‌లు పెడుతున్నారంటూ వంశీ మోహన్‌ విజయవాడ పోలీసు కమిషనర్‌ ద్వారకా తిరుమలరావును కలిసి ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారం టీడీపీతో సహా రాజకీయ వర్గాల్లోనూ హాట్‌ టాపిక్‌గా మారింది.  

టీడీపీని ఏకిపారేస్తున్న వంశీ.. 
శుక్రవారం టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ విలేకరుల సమావేశం నిర్వహించి వంశీ వ్యవహార శైలిని దుయ్యపట్టారు. అలాగే టీడీపీ నాయకులు వర్ల రామయ్య, జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు, మాజీ మేయర్‌ పంచుమర్తి అనూరాధలు కూడా విలేకరుల సమావేశం నిర్వహించి వంశీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆయన కూడా ఎదురుదాడికి దిగారు. తనను కలిసిన విలేకరులతో తెలుగుదేశం పార్టీలో జరిగిన.. జరుగుతున్న బాగోతాలను పూసగుచ్చినట్లు వివరించారు. టీడీపీకి చెందిన ఒక నాయకుడు ఎన్నికల్లో గెలవలేరని, అయితే 25 లీటర్ల డీజిల్, బిర్యానీ ప్యాకెట్లు, ఐదు వేలు నగదు ఇస్తే ఎవరినైనా తిడతారంటూ ఘాటుగా విమర్శించారు. మరొక నాయకుడు కొనకళ్ల నారాయణ ఎన్నికల్లో పోటీ చేస్తే ఆయనకు వ్యతిరేకంగా పోటీ చేసి బాడిగ రామకృష్ణ వద్ద డబ్బులు తీసుకున్నారంటూ బాంబు పేల్చారు. మాజీ మంత్రి ఒకరు వేస్ట్‌ ఫెలో అని.. ఆయన వల్లే జిల్లాలో పార్టీ నాశనం అవుతోందంటూ కుండబద్దలు కొట్టి మరీ చెప్పారు. ఇక చంద్రబాబు, నారా లోకేష్‌లపై ముప్పేట దాడి చేశారు. సోషల్‌ మీడియాలో తన క్యారెక్టర్‌ను నాశనం చేసేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని, అందువల్లే అక్కడ జరిగిన వాస్తవాలన్ని బయట పెడుతున్నానని వంశీ ఆగ్రహంతో చెప్పారు.
 
పరువు పాయే.. 
వంశీ మోహన్‌ తెలుగుదేశం పార్టీ వీడిపోతుంటే ఆయనను వ్యక్తిగత విమర్శలతో ఇరికిద్దమనుకున్న టీడీపీ నేతలకు ఊహించని షాక్‌ తగిలింది. తెలుగుదేశం పారీ్టలోని అంతర్గత విషయాలను వంశీ ఒక్కొక్కటిగా బయటపెడుతుండటంతో ఏమి పాలుపోని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటి వరకు తాను చెప్పింది 10 శాతమేనని అవసరమైతే ఇంకా అనేక విషయాలు బయటపెడతానని చెప్పడంతో పార్టీ నేతల్లో ఆందోళన మొదలైంది. జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో ఇప్పటికే పరువు పోయిందని, వంశీ చేస్తున్న వ్యాఖ్యలతో పార్టీ పరువు బజారన పడుతోందన్న చర్చ పార్టీలో జరుగుతోంది.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top