‘బాబుకు పట్టిన గతే కేసీఆర్‌కు పడుతుంది’

TSRTC Strike BJP Leader K Laxman Slams Over CM KCR Comments - Sakshi

హుజూర్‌నగర్‌లో గెలుపు అనంతరం కేసీఆర్‌ రెచ్చిపోతున్నారు

నంద్యాలలో గెలిచిన తర్వాత చంద్రబాబు అలానే ఎగిరెగిరిపడ్డారు

సీఎం కేసీఆర్‌పై బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌ విమర్శలు

సాక్షి, హైదరాబాద్‌ : ఆర్టీసీ కార్మికుల సమ్మెపై సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ మండిపడ్డారు. హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్‌ రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని విమర్శించారు. పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ఆర్టీసీ జేఏసీ నాయకులు సమ్మెపై నాతో చర్చించారు. 20 రోజులుగా శాంతియుతంగా సమ్మె చేస్తుంటే.. హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక ఫలితం తర్వాత కేసీఆర్ రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కూతురు ఓడిపోతే ప్రెస్ నోట్ లేదు, ముగ్గురు ఎమ్మెల్సీలు ఓడిపోయినప్పుడు కూడా మీడియా సమావేశం పెట్టలేదు. కానీ, ఉపఎన్నికలో గెలిచిన అనంతరం గంటసేపు మీడియా సమావేశం నిర్వహించారు. ఇలాంటి ఉప ఎన్నికల ఫలితాల్ని ఎన్నో ప్రభుత్వాలు చూశాయి. 

హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ గెలుపు ఓ గెలుపేనా. కులానికి, మతానికో నాయకున్ని పెట్టి.. అధికార దుర్వినియోగంతో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఆర్టీసీ సమ్మెకు హుజూర్నగర్ ఉప ఎన్నిక ఫలితానికి సంబంధమేంటి. నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ భారీ మెజార్టీతో గెలిచినా.. ఇప్పుడు చంద్రబాబు పరిస్థితి ఏమైంది. రేపు ​మీకూ అదే గతి పడుతుంది. రాజకీయాలు ఉంటే చూసుకుందాం. కానీ, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా కార్మికుల మీదనా మీ ప్రతాపం. కేసీఆర్‌ ఆర్టీసీ ఆస్తులపై కన్నేశారు. అందుకనే ఉద్యమం మీద భాజపా కన్నేసింది. ముఖ్యమంత్రి మాటలకు ఆర్టీసీ కార్మికులు ఆత్మస్థైర్యం కోల్పోవద్దు. ఆత్మహత్యలు చేసుకోవద్దు. భవిష్యత్ లో ఆర్టీసీ కార్మికులు చేపట్టే ప్రతి కార్యక్రమానికి భాజపా అండగా ఉంటుంది’అని అన్నారు.

ఎత్తుగడల్లో భాగమే కేసులు : ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి
‘ముఖ్యమంత్రి ఎన్ని బెదిరింపులకు గురి చేసినా ఏ ఒక్క కార్మికుడు విధుల్లో చేరలేదు. కార్మికుల ఆత్మహత్యలన్ని ప్రభుత్వ హత్యలే. ఈనెల 30న సరూర్ నగర్ స్టేడియంలో నిర్వహించే సకల జనుల సమర భేరికి  కార్మికులు పెద్ద సంఖ్యలో తరలిరావాలి. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆత్మహత్యలకు కేసీఆర్ బాధ్యుడని కేసులు పెట్టారు. నాపై కేసులు ఎత్తుగడల్లో భాగమే. కేసులకు  భయపడను. ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తాం’అన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top