టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనే శక్తి ఒక్క బీజేపీకే..

TS bjp leaders fires on trs govt and kcr - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ప్రత్యేక తెలంగాణ ఓయూ విద్యార్థుల త్యాగ ఫలితంగానే వచ్చిందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె లక్ష్మణ్‌ అన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం రోజుకో విద్యార్థి తమ ప్రాణాలు త్యాగం చేశారని పేర్కొన్నారు. ఉద్యమ సమయంలో చెప్పిన విధంగా లక్ష ఉద్యోగాలను భర్తీ చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. రాజకీయ పరంగా నిరుద్యోగ సమస్య పునరావృతం అవుతోందే తప్ప ఉగ్యోగ ఖాళీలు మాత్రం భర్తీ కావడం లేదన్నారు.

ఉద్యమ సమయంలో కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ యువత రెచ్చగొట్టి పబ్బం​ గడుపుకున్నారని మండిపడ్డారు. ఫీజు బకాయిలు చెల్లించలేక యువత చదువులు మధ్యలోనే మానేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వందలాది డిగ్రీ, ఇంజనీరింగ్‌ కాలేజీలు మూతపడటానికి  ప్రభుత్వమే కారణమని విమర్శించారు. గత నాలుగేళ్లలో కేవలం 16వేల ఉద్యోగాలను భర్తీ చేశారని తెలిపారు. నిర్దిష్టమైన ఉద్యోగుల క్యాలెండర్‌ ప్రకటించాలని లేకపోతే అసెంబ్లీ సమావేశాలు స్తంభింప చేస్తామని హెచ్చరించారు.

ప్రజలంతా టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఉన్నారు: మురళీధరావు
తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు అధికార టీఆర్‌ఎస్‌కు వ్యతిరేఖంగా ఉన్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరావు అన్నారు. నిరుద్యోగులంతా టీఆర్‌ఎస్‌కు వ్యతిరేక ఉద్యమంలో పనిచేయబోతున్నారని ఆయన పేర్కొన్నారు.  తెలంగాణలోని ప్రతి జిల్లా, మండలం, గ్రామంలో విద్యార్థులు అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉన్నరన్నారు. కేంద్రం ప్రతి సామాన్యుడికి ఉపయోగపడే విధంగా ముద్రయోజన ద్వారా స్వయం ఉపాధి కల్పించిందని తెలిపారు. రాబోయే రోజుల్లో టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనే శక్తి ఒక్క బీజేపీకే ఉందని వెల్లడించారు. త్వరలోనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని బీజేపీ యువ మోర్చా నగారా మోగించిందని ప్రకటించారు. దేశంలో బీజేపీని ఎదిరించిన వ్యక్తిలేడని మురళీధర్‌రావు అన్నారు. దేశవ్యాప్తంగా అధికారంలోకి రావడమే తమ లక్ష్యమని, త్వరలో ఎన్నికలు జరగనున్న మేఘాలయ, త్రిపురలో బీజేపీ అధికారంలోకి వస్తుందని జోష్యం చెప్పారు. సనత్‌నగర్‌లోనే కాదు తెలంగాణలోను అధికారంలోకి వస్తామని తెలిపారు.

యువత నిరుత్సాహంలో ఉంది: ఎమ్మెల్సీ రామచంద్రరావు
తెలంగాణ యువత ఉద్యోగాలు లేక నిరుత్సాహంతో ఉందని ఎమ్మెల్సీ రామచంద్రరావు పేర్కొన్నారు. రాష్ట్రంలో లక్ష ఇరవై వేల ఉద్యోగాలు ఖాళీలున్నాయని కానీ నాలుగేళ్లలో భర్తీ చేయలేదని మండిపడ్డారు. ఐటీ కంపెనీలు వస్తున్నాయంటే కేవలం కేంద్రం కృషి వల్లేనని, ఇందులో రాష్ట్ర గొప్పతనం ఏమాత్రం లేదని విమర్శించారు. రానున్న రోజుల్లో బీజేపీ  యువతకు అండగా ఉంటుందని రామచంద్రరావు తెలిపారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top