పేదలందరికీ జీవిత బీమా | Sakshi
Sakshi News home page

పేదలందరికీ జీవిత బీమా

Published Sun, Nov 18 2018 2:01 AM

TRS Manifesto Completed  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  నాలుగేళ్ల పాలన గురించి వివరిస్తూనే మళ్లీ అధికారంలోకి వస్తే అమలు చేసే పథకాలను ప్రచారం చేసి ప్రజామోదం పొందేలా టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ వ్యూహం రచించారు. ఇప్పటికే పాక్షిక మేనిఫెస్టోను ప్రకటించిన కేసీఆర్‌ రెండు, మూడు రోజుల్లోనే పూర్తిస్థాయి మేనిఫెస్టోను వెల్లడించనున్నారు. రైతుబీమా తరహాలోనే పేదలందరికీ బీమా పథకాన్ని అమలు చేసే పథకాన్ని మేనిఫెస్టోలో చేర్చినట్లు తెలిసింది. ఎన్నికల్లో ప్రభావం చూపేలా ఈ పథకాన్ని రూపకల్పన చేసినట్లు తెలిసింది. ఎస్సీ, ఎస్టీల అభ్యన్నతి కోసం ప్రత్యేకంగా అభివృద్ధి కార్యక్రమాన్ని సైతం మేనిఫెస్టోలో విపులంగా పొందుపరుస్తున్నారు.

కేసీఆర్‌ అక్టోబర్‌ 16న పాక్షిక మేనిఫెస్టోను ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీల ఉప ప్రణాళికను అమలు చేస్తూనే ఈ వర్గాల అభ్యున్నతి కోసం ప్రత్యేక అభివృద్ధి పథకాలు అమలు చేయనున్నట్లు తెలిపారు. ఎస్సీలకు రూ.10 వేల కోట్ల నుంచి రూ.15 వేల కోట్లతో, ఎస్టీలకు రూ.6 వేల కోట్ల నుంచి రూ.10 వేల కోట్లతో పథకాలను అమలు చేస్తామని చెప్పారు. పూర్తిస్థాయి మేనిఫెస్టో ప్రకటించేటప్పుడు పథకాల గురించి వివరిస్తామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక పథకాలు ఎలా ఉండాలనే అంశంపై ఏర్పాటు చేసిన ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలోని కమిటీని ఏర్పాటు చేశారు.

ఆ కమిటీ నివేదిక ఆధారంగా పథకాన్ని రూపొందించారు. ‘ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి ప్రత్యేకంగా దృష్టి సారించాలి. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచాలి. తెలంగాణ జీవితబీమా పేరిట ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు జీవిత బీమా పథకం వర్తింపజేయాలి. గిరిజన గ్రామ పంచాయతీల సమగ్ర అభివృద్ధి కోసం ప్రత్యే కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలి. నిరుద్యోగుల ఉపాధి కోసం బ్యాంకులతో నిమిత్తం లేకుండా ఆర్ధిక సాయం అందించేలా పథకం ఉండాలి’అని కమిటీ ప్రతిపాదనలు చేసింది.  

సీహెచ్‌ ఆనంద్‌గౌడ్‌కు బీఫారం
నాంపల్లి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మార్పు ప్రక్రియ పూర్తి అయింది. సెప్టెంబర్‌ 6న ఎం.ఆనంద్‌కుమార్‌గౌడ్‌ను అభ్యర్థిగా టీఆర్‌ఎస్‌ ప్రకటించింది. తాజాగా అందరికీ బీఫారాలు అందజేసినప్పుడు ఈయనకు ఇవ్వలేదు. మరుసటి రోజు రావాలని చెప్పి పంపించారు. ఆ తర్వాత అభ్యర్థి నే మార్చారు. సీహెచ్‌ ఆనంద్‌కుమార్‌కు మంత్రి కేటీఆర్‌ బీఫారం ఇచ్చారు.  

రెండు సీట్లు పెండింగ్‌
కోదాడ, ముషీరాబాద్‌ స్థానాల అభ్యర్థుల ఖరారు ఎంతకీ పూర్తి కావడంలేదు. ముషీరాబాద్‌ బరిలో ముఠా గోపాల్‌ను నిలపాలని టీఆర్‌ఎస్‌ అధిష్టానం భావిస్తోంది. అక్కడి నుంచి మంత్రి నాయిని నర్సింహారెడ్డి అల్లుడు, కార్పొరేటర్‌ శ్రీనివాస్‌రెడ్డి టికెట్‌ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు. నాయిని గతంలో ఇదే సెగ్మెంట్‌ నుంచి టీఆర్‌ఎస్‌ తరఫున ప్రాతినిథ్యం వహించారు. ఈ నేపథ్యంలో శ్రీనివాస్‌రెడ్డికి అవకాశం ఇవ్వాలని నాయిని కోరుతున్నారు. ఈ విషయంపై సీఎం కేసీఆర్‌ శనివారం నాయినితో ప్రగతిభవన్‌లో చర్చించారు. ఈసారి గోపాల్‌కు అవకాశం ఇస్తామని చెప్పడంతో నాయిని ఒకింత అసంతృప్తిగా అక్కడి నుంచి వెళ్లిపోయారు.

నాయినిని నొప్పించకూడదనే ఉద్దేశంతో ఆదివారం మళ్లీ రావాలని కేసీఆర్‌ సూచించారు. కోదాడ సీటు విషయంలోనూ అధిష్టానం నిర్ణయం తీసుకోలేదు. నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి కె.శశిధర్‌రెడ్డి టికెట్‌పై ధీమాతో ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్‌రావు కూడా కోదాడ టికెట్‌ ఆశిస్తున్నారు. తాజాగా టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన బొల్లం మల్లయ్యయాదవ్‌తో సీఎం కేసీఆర్‌ టికెట్‌ విషయంపై శనివారం చర్చించారు. కోదాడ స్థానాన్ని కచ్చితంగా గెలిచేలా పనిచేయాలని మల్లయ్య యాదవ్‌కు సూచించారు. వీరు ముగ్గురిలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ఎవరిని ప్రకటిస్తారనేది ఆసక్తికరంగా మారింది.


పాక్షిక మేనిఫెస్టోపై సానుకూలత
లక్ష రూపాయల వరకు రుణమాఫీ, నిరుద్యోగ భృతి, రైతుబంధు కింద ఎకరాకు రూ.10 వేలు, ఆసరా పింఛను మొత్తాలరెట్టింపు వంటి హామీలను టీఆర్‌ఎస్‌ నెల క్రితమే వెల్లడించింది. అభ్యర్థుల ప్రచారంలో వీటికి ప్రజల నుంచి సానుకూలత లభించిందని టీఆర్‌ఎస్‌ అధిష్టానం గుర్తించింది. పూర్తిస్థాయి మేనిఫెస్టోను సైతం అభ్యర్థులు ఇదే తరహాలో ప్రజల్లోకి తీసుకువెళ్లేలా ప్రచార వ్యూహం రూపొందిస్తున్నారు.

Advertisement
Advertisement