మాతో పొత్తుకు టీఆర్‌ఎస్‌ ఒప్పుకోలేదు | TRS did not agree with us says Chandrababu | Sakshi
Sakshi News home page

మాతో పొత్తుకు టీఆర్‌ఎస్‌ ఒప్పుకోలేదు

Dec 18 2018 3:35 AM | Updated on Dec 18 2018 11:09 AM

TRS did not agree with us says Chandrababu - Sakshi

సాక్షి, అమరావతి:  కలిసి పని చేద్దామని అడిగినా టీఆర్‌ఎస్‌ ఒప్పకోలేదని, ఆ తరువాతే తెలంగాణలో మహాకూటమితో కలిసి వెళ్లామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. తమతో పొత్తును టీఆర్‌ఎస్‌ ఒప్పుకోకపోవడంతో వేరే పార్టీలతో కలిసి మహాకూటమి పెట్టామని అన్నారు. చంద్రబాబు సోమవారం సచివాలయంలోని ఆర్టీజీ సెంటర్‌లో పెథాయ్‌ తుపాను సహాయక చర్యలపై సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. తాము(టీడీపీ) తెలంగాణలో పని చేశామని, ఏపీలో తామూ వేలు పెడతామని టీఆర్‌ఎస్‌ అనడం ఏమిటని ప్రశ్నించారు. ఆ పార్టీ ఎక్కడి నుంచి వచ్చిందో గుర్తుంచుకోవాలన్నారు. వాళ్లు(కేసీఆర్‌) టీడీపీలో నుంచే వచ్చారని వ్యాఖ్యానించారు. తాము తెలంగాణకు వచ్చాం కాబట్టి వాళ్లు ఇప్పుడు ఏపీకి వస్తామనడం ఏమిటని అన్నారు.

టీడీపీ వెళ్లిందని తామూ ఏపీకి వెళతామనడం సరికాదన్నారు. తెలంగాణలో ఏదో జరిగిందని, ఇక్కడా(ఏపీలో) అదే జరిగిపోతోందని చాలా ఆశపడుతున్నారని, అదేమీ జరగదని, మీరే చూస్తారని పేర్కొన్నారు. ప్రత్యేక హోదాకు టీఆర్‌ఎస్‌ అభ్యంతరం చెప్పనంత వరకు తానేమీ మాట్లాడలేదని చెప్పారు. మూడు రాష్ట్రాల్లో బీజేపీ ఓటమి ఆ పార్టీకి దేశవ్యాప్తంగా వీస్తున్న వ్యతిరేక పవనాలకు సంకేతమని స్పష్టం చేశారు. పెద్ద నోట్లను రద్దు చేయాలని తాను మొదటి నుంచీ కోరుతున్నానని.. కానీ, ఒక పెద్ద నోటు తీసేసి మరో పెద్ద నోటు తీసుకొచ్చారని విమర్శించారు. కాగా, పెథాయ్‌ తుపాను విషయంలో ప్రభుత్వ యంత్రాంగం ముందస్తు సంసిద్ధత రానున్న కాలానికి ఒక నమూనా అని చంద్రబాబు చెప్పారు. 14 వేల హెక్టార్లలో పంట నష్టం జరిగిందని ప్రాథమికంగా అంచనా వేశామని వెల్లడించారు. 

ఈవీఎంలు ఇక్కడే ఎందుకు? 
త్వరలో రాష్ట్రంలో జరిగే ఎన్నికలను బ్యాలెట్‌తోనే నిర్వహించాలని కోరుతున్నామని, దీనిపై దేశవ్యాప్త పోరాటానికి సిద్ధమవుతున్నట్లు చంద్రబాబు చెప్పారు. తమ పరిధిలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలను బ్యాలెట్‌తోనే నిర్వహిస్తామన్నారు. ప్రపంచంలోని అన్ని దేశాలు బ్యాలెట్‌తోనే వెళుతున్నాయని, భారతదేశంలో మాత్రం ఈవీఎంలు ఎందుకని ప్రశ్నించారు. ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ను దుర్వినియోగం చేసే అవకాశాలున్నాయని, అందుకే బ్యాలెట్‌ ఓటింగ్‌ నిర్వహించాలని డిమాండ్‌ చేస్తున్నట్లు తెలిపారు. అమెరికాలో కూడా ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ విధానం లేదన్నారు. ఎన్నికల కేసు తేలాలంటే మూడు నాలుగేళ్లు  పడుతుందని, ఈవీఎంలో డేటా అన్ని రోజులు వుంటుందా? అని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement