నేడే విపక్ష మహా ప్రదర్శన

Trinamool Chief Mamata Banerjee To Hold Mega Rally - Sakshi

కోల్‌కతాలో మమతా బెనర్జీ నేతృత్వంలో మెగా ర్యాలీ

హాజరుకానున్న 20 ఎన్డీఏయేతర పార్టీలు, లక్షల్లో తృణమూల్‌ కార్యకర్తలు

పాల్గొననున్న అఖిలేశ్, దేవెగౌడ, కుమారస్వామి, స్టాలిన్, కేజ్రీవాల్‌ తదితరులు

బీజేడీ, వామపక్షాలు దూరం

కోల్‌కతా: రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ముందు ఎన్డీఏయేతర పక్షాలను సంఘటితపరచడమే లక్ష్యంగా తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆధ్వర్యంలో జరిగే విపక్షాల మెగా ర్యాలీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. కోల్‌కతాలోని బ్రిగేడ్‌ పరేడ్‌ మైదానంలో ‘ఐక్య విపక్ష ర్యాలీ’ పేరిట శనివారం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి బీజేపీయేతర ప్రాంతీయ, జాతీయ పార్టీలకు ఆహ్వానాలు అందాయి. కొన్ని పార్టీల అధినేతలే స్వయంగా ఈ ర్యాలీకి హాజరవుతోంటే, మరికొన్ని పార్టీలు తమ ప్రతినిధులను పంపుతున్నాయి.

యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌(ఎస్పీ), స్టాలిన్‌(డీఎంకే), కుమార స్వామి, దేవెగౌడ(జేడీఎస్‌), కేజ్రీవాల్‌(ఆప్‌) ఫరూక్‌ అబ్దుల్లా, ఒమర్‌ అబ్దుల్లా(ఎన్సీ), శరద్‌పవార్‌(ఎన్సీపీ), చంద్రబాబు(టీడీపీ), తేజస్వి యాదవ్‌(ఆర్జేడీ), మాజీ కేంద్ర మంత్రులు యశ్వంత్‌ సిన్హా, అరుణ్‌శౌరి, బీజేపీ అసంతృప్త నేత శత్రుఘ్న సిన్హా, పటీదార్‌ ఉద్యమ నేత హార్దిక్‌ పటేల్, దళితనేత జిగ్నేశ్‌ మేవానిసహా 20 పార్టీల నేతలు హాజరవుతున్నారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్, యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియా, బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి గైర్హాజరవుతున్నారు.

కాంగ్రెస్‌ తరఫున సీనియర్‌ నాయకులు ఖర్గే, బీఎస్పీ తరఫున సతీశ్‌ మిశ్రా ఈ ర్యాలీలో పాల్గొంటున్నారు. బీజేపీ, కాంగ్రెస్‌కు సమదూరం పాటిస్తున్న టీఆర్‌ఎస్, బిజూ జనతా దళ్‌(బీజేడీ) నుంచి ఎవరూ హాజరుకావడం లేదు. వామపక్ష పార్టీలు ర్యాలీలో పాల్గొనవద్దని నిర్ణయించుకున్నాయి. కాగా, కోల్‌కతా ర్యాలీని బీజేపీ ఎగతాళి చేసింది. విపక్ష కూటమి తొలుత ప్రధాని అభ్యర్థిని నిర్ణయించుకోవాలని, ఆ తరువాతే ప్రధాని నరేంద్ర మోదీని గద్దె దించడం గురించి ఆలోచించాలని హితవు పలికింది.  

లక్షలాదిగా వస్తున్న టీఎంసీ కార్యకర్తలు
కోల్‌కతా విపక్ష ర్యాలీకి తృణమూల్‌ కార్యకర్తలు లక్షల్లో తరలివస్తున్నారు. బహిరంగ సభలకు సంబంధించి పాత రికార్డులను బద్దలుకొట్టేందుకు ఆ పార్టీ ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోవడం లేదు. శుక్రవారం నాటికే రాష్ట్రం నలుమూలల నుంచి రైలు, రోడ్డు, జల మార్గాల ద్వారా సుమారు 5 లక్షల మంది కోల్‌కతాకు చేరుకున్నట్లు తృణమూల్‌ వర్గాలు తెలిపాయి. తమ ప్రాంతాల నుంచి వస్తున్న కార్యకర్తలకు భోజనం, వసతి ఇతర సౌకర్యాలను పార్టీ నాయకులే ఏర్పాటుచేస్తున్నారు. ర్యాలీకి అట్టహాసంగా ఏర్పాట్లు చేశారు. సభాస్థలిలో మొత్తం ఐదు పెద్ద వేదికలను సిద్ధం చేశారు. 3000 మంది వలంటీర్లను నియమించారు. సభా ప్రాంగణంలో రెండ్రోజుల ముందే ఎల్‌ఈడీ లైట్లు, బారికేడ్లు, తోరణాలు పెద్ద సంఖ్యలో అమర్చారు.

మమతా బెనర్జీ బలం చాటేందుకేనా?
లోక్‌సభ ఎన్నికల తరువాత ఢిల్లీ రాజకీయాల్లో మమతా బెనర్జీని తిరుగులేని నాయకురాలిగా చూపేందుకు ఈ ర్యాలీని ఒక వేదికగా ఉపయోగించుకోవాలని తృణమూల్‌ కాంగ్రెస్‌ యోచిస్తోంది. ‘దేశంలోని ప్రముఖ విపక్ష నాయకుల్లో మమతా బెనర్జీ కూడా ఒకరనేది కాదనలేని సత్యం. బీజేపీ వ్యతిరేక పోరులో ఇతర పార్టీలను ఆమె కలుపుకుపోగలరు. కేంద్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఆమెకు ఉంది. ఇక తుది నిర్ణయం తీసుకోవాల్సింది ప్రజలే’ అని తృణమూల్‌ సీనియర్‌ నాయకుడొకరు వ్యాఖ్యానించారు.

కేంద్రంలో తదుపరి ప్రభుత్వం ఆమె నేతృత్వంలోనే ఏర్పడాలని ర్యాలీ ప్రచార సమయంలో ఆ పార్టీ నాయకులు ఆకాంక్షించారు. కోల్‌కతాలో విపక్షాల భారీ ర్యాలీకి కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మద్దతు ప్రకటిస్తూ మమతా బెనర్జీకి లేఖ రాశారు. ‘విపక్షాల ఐక్యతా ప్రదర్శన ర్యాలీ విషయంలో మమతా దీదీకి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నా. దీని ద్వారా మనం ఐక్యభారతానికి సంబంధించి గట్టి సందేశం ఇస్తామని ఆశిస్తున్నాను’ అని రాహుల్‌ పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top