ప్రచారాలకు దూరం... వ్యూహమే ప్రధానం

Telangana MPTC And ZPTC Elections Campaign Closed - Sakshi

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: మంత్రుల హడావుడి లేదు... ఎమ్మెల్యేల ప్రచారం లేదు... అగ్రనేతల పర్యటనలు అసలే లేవు... మండలాలు, గ్రామాల్లో టీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేస్తున్న జెడ్‌పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు కూడా సాదాసీదాగా ప్రచారం సాగిస్తున్నారు. శాసనసభ, పంచా యతీ, లోక్‌సభ ఎన్నికల నాటి హడావుడి ఉమ్మడి జిల్లాలో ఎక్కడా కనిపించడం లేదు. అభ్యర్థులు, ఆయా గ్రామాల టీఆర్‌ఎస్‌ నాయకులు, యువత ఉదయం, సాయంత్రం వేళల్లో ఓటర్ల ఇళ్లకు వెళ్లి తమను గెలిపించాలని కోరడం తప్ప భారీ బహిరంగసభలు, వందలాది మందితో ర్యాలీలు వంటి కార్యక్రమాలు ఎక్కడా కనిపించడం లేదు. మూడు విడతలుగా సాగుతున్న ప్రాదేశిక ఎన్నికల ప్రక్రియలో మొదటి దశ పోలింగ్‌ ఈ నెల 6న జరగనుంది.

ఈ ఎన్నికకు సంబంధించిన ప్రచారం గడువు  శనివారం సాయంత్రం 5 గంటలతో ముగుస్తోంది. ఇక రెండో విడత ఎన్నికలకు సంబంధించి ఉపసంహరణల పర్వం గురువారంతో పూర్తికాగా, మూడో విడత ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కూడా పూర్తయింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని మంత్రులు, ఎమ్మెల్యేలు హెడ్‌క్వార్టర్లలోనే ఉంటూ జెడ్‌పీ పీఠాలను కైవసం చేసుకునే వ్యూహాలు రచిస్తున్నారు. జెడ్‌పీలతోపాటు ఎంపీపీ స్థానాలను కూడా టీఆర్‌ఎస్‌ పార్టీ కైవసం చేసుకునేలా గ్రామాల్లో పార్టీ యంత్రాంగాన్ని సమాయత్తం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు పార్టీ యంత్రాంగానికి, అభ్యర్థులకు సూచనలు, సలహాలు చేరవేస్తూ ప్రచారానికి వెళ్లకుండానే పా  వులు కదుపుతున్నారు.

జగిత్యాల జిల్లాలో రెండు జెడ్‌పీటీసీలు కైవసం
రాష్ట్ర వ్యాప్తంగా మూడు జెడ్‌పీటీసీలు ఏకగ్రీవం అయితే అందులో రెండు జగిత్యాల జిల్లాలో కాగా, ఒకటి పక్కనే ఉన్న నిజామాబాద్‌ జిల్లాలోనిది. రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మపురి నియోజకవర్గంలోని వెల్గటూరు జెడ్‌పీటీసీ వారం క్రితమే ఏకగ్రీవం అయిపోయింది. కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న కోరుట్ల నియోజకవర్గంలోని కోరుట్ల జెడ్‌పీటీసీ స్థానం గురువారం ఏకగ్రీవం అయింది. ఇక్కడి నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దారిశెట్టి లావణ్యకు మద్దతుగా ఇతర పార్టీల అభ్యర్థులను ఉపసంహరింపజేయడంలో ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు వ్యూహాత్మకంగా వ్యవహరించి విజయం సాధించారు. లావణ్య జగిత్యాల జెడ్‌పీ చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా దాదాపు ఖరారైనట్లు సమాచారం. కరీంనగర్, హుజూరాబాద్, ధర్మపురి, సిరిసిల్ల నియోజకవర్గాల్లో కొన్ని ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మూడో విడత నామినేషన్ల ఉపసంహరణలోపు మరికొన్ని జెడ్‌పీటీసీలు, ఎంపీటీసీలను ఏకగ్రీవం చేసే ఆలోచనతో ప్రజా ప్రతినిధులు వ్యూహాలు రచిస్తున్నారు.

అభ్యర్థులపైనే ఎంపీటీసీల భారం
టీఆర్‌ఎస్‌ నుంచి జెడ్‌పీటీసీ, ఎంపీపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న నాయకులు తమ పరిధిలోని ఎంపీటీసీలను కూడా గెలిపించుకొనేలా ఎమ్మెల్యేలు, మంత్రులు వారికే బాధ్యతలు అప్పగించారు. జెడ్‌పీ చైర్మన్‌ అభ్యర్థుల ప్రకటన విషయంలో టీఆర్‌ఎస్‌ ఆచితూచి వ్యవహరిస్తోంది. ఇప్పటి వరకు అధికారికంగా పెద్దపల్లి జెడ్‌పీ చైర్మన్‌ అభ్యర్థిగా పుట్ట మధును మాత్రమే ప్రకటించగా, జగిత్యాలలో లావణ్య పేరు ప్రచారంలోకి వచ్చింది. కరీంనగర్, సిరిసిల్లల్లో ఎవరు జెడ్‌పీ అభ్యర్థో ఇంకా తేలలేదు. దీంతో ఈ రెండు జిల్లాల్లో జెడ్‌పీటీసీలు ఎవరికి వారే ఎన్నికల ప్రచారంలో సాగుతున్నారు. ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాల్లోని ముఖ్య నాయకులకు బాధ్యతలను విభజించారు.

ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులకు సైతం జిల్లా, రాష్ట్ర నాయకుల నుంచి ఆశించిన మద్దతు లభించకపోవడంతో టీఆర్‌ఎస్‌ నేతలు ఇప్పటి వరకు జరిగిన మూడు ఎన్నికల అనుభవాలతో ముందుకు సాగుతున్నారు. ఆయా ఎన్నికల్లో గ్రామాల్లో ఎవరెవరు ఏ పార్టీకి మద్దతుగా నిలిచారో స్పష్టమైన నేపథ్యంలో తమ ఓటు బ్యాంకును కాపాడుకుంటూనే, కాంగ్రెస్, బీజేపీ ఓట్లను కొల్లగొట్టేలా ఎమ్మెల్యేలు అభ్యర్థులకు దిశా నిర్ధేశం చేశారు. రెబల్స్‌గా నిలిచిన వారిని, టీఆర్‌ఎస్‌ టికెట్టు రాక కాంగ్రెస్‌ నుంచి పోటీ చేస్తున్న వారిని దెబ్బ కొట్టేందుకు ఎమ్మెల్యేలు ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. పెద్దపల్లి నియోజకవర్గంలో కాల్వ శ్రీరాంపూర్, పెద్దపల్లి జెడ్‌పీటీసీలను ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top