నేడైనా ఓటేయనిస్తారా?

TDP rigging in five villages - Sakshi

చంద్రగిరి పరిధిలోని ఏడు కేంద్రాల్లో నేడే రీ పోలింగ్‌

పాతికేళ్ల పోరాటానికి ఫలితం దక్కే రోజు ఇది

ఎస్సీలు, గిరిజనులను ఇప్పుడైనా ప్రజాస్వామ్య హక్కు వినియోగించుకోనిస్తారా?

రిగ్గింగ్, ఎన్నికల్లో అక్రమాలపై చెవిరెడ్డి పోరాటం 

మళ్లీ రిగ్గింగ్‌ చేసేందుకు టీడీపీ భారీ కుట్రలు

పోలింగ్‌ కేంద్రాల వారీగా రౌడీమూకలు సిద్ధం 

పల్లెల్లో ఘర్షణలు సృష్టించేందుకు పక్కా స్కెచ్‌

సమీప గ్రామాల్లో తిష్ట వేసిన అల్లరిమూకలు

చిత్తూరు, బెంగళూరు తదితర చోట్ల నుంచి దిగుమతి

ఓటర్లకు ప్రలోభాల వల.. కాదంటే ఓటింగ్‌కు దూరంగా ఉండాలంటూ బెదిరింపులు

రాత్రికి రాత్రే ఓటర్ల ఖాతాల్లోకి నేరుగా నగదు బదిలీ

సాక్షి, తిరుపతి: పాతికేళ్ల పోరాటం ఫలిస్తుందా? చిత్తూరు పెత్తందారులు నేడైనా ప్రజాస్వామ్య హక్కును వినియోగించుకోనిస్తారా? టీడీపీ నేతల రిగ్గింగ్, అక్రమాలపై ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించిన చెవిరెడ్డి భాస్కరరెడ్డి పోరాటం ఫలితాన్ని ఇస్తుందా? చంద్రగిరి నియోజకవర్గంలో దళితులు, సామాన్యులు ఓటుతో తమ తీర్పు చెప్పే కీలకమైన ఈ రోజు కోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రజలంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. 

బలవంతంగా ఓటర్ల తరలింపు..
చంద్రగిరిలో ఆదివారం రీ పోలింగ్‌ జరిగే ఏడు కేంద్రాల్లో ప్రజలంతా ఓటు హక్కు వినియోగించుకునేలా ఎన్నికల కమిషన్‌ భారీ ఏర్పాట్లు చేసినా టీడీపీ నేతలు చాపకింద నీరులా మళ్లీ రిగ్గింగ్‌ చేసేందుకు భారీ కుట్రలకు తెరతీశారు. పల్లెల్లో అల్లర్లు సృష్టించేందుకు గూండాలను రప్పించి బంధువుల పేరుతో టీడీపీ నేతల నివాసాల్లో దాచారు. మరికొందరు చుట్టుపక్కల ప్రాంతాల్లో తిష్ట వేశారు. రీ పోలింగ్‌ జరిగే ఒక్కో కేంద్రం వద్ద అల్లర్లు సృష్టించేందుకు 50 మంది చొప్పున రౌడీ మూకలను సిద్ధం చేశారు. మరోవైపు ఓట్లు వెయ్యకుండా కొందరు దళిత ఓటర్లను టీడీపీ నేతలు బలవంతంగా ఇతర ప్రాంతాలకు రాత్రికి రాత్రే వాహనాల్లో తరలిస్తున్నారు. నగదు ఎరవేస్తూ ఓటింగ్‌కు దూరంగా ఉండాలంటూ హెచ్చరిస్తున్నారు. పోలింగ్‌ జరిగే గ్రామాల ప్రజల బ్యాంకు ఖాతాల వివరాలు సేకరించి నేరుగా డబ్బులు జమచేస్తూ ప్రలోభాలకు గురి చేస్తున్నారు. 

ఐదు గ్రామాల్లో టీడీపీ రిగ్గింగ్‌
చిత్తూరు జిల్లా చంద్రగిరి పరిధిలో గత నెల 11న జరిగిన ఎన్నికల సందర్భంగా ఎన్‌ఆర్‌ కమ్మపల్లి, కమ్మపల్లి, వెంకట్రామాపురం, కొత్తకండ్రిగ, పులివర్తివారిపల్లిలో టీడీపీ నేతలు పెద్ద ఎత్తున రిగ్గింగ్‌కి పాల్పడ్డారు. దీనిపై వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఫిర్యాదు మేరకు పోలింగ్‌ కేంద్రాల్లోని సీసీ ఫుటేజీలను పరిశీలించిన ఈసీ అక్కడ రీ పోలింగ్‌కు ఆదేశించిన విషయం తెలిసిందే. మరోవైపు టీడీపీ నేతలు కాలేపల్లి, కుప్పం బాదూరు పోలింగ్‌ కేంద్రాల్లో కూడా రీ పోలింగ్‌ నిర్వహించాలని పట్టుబట్టారు. ఈమేరకు జిల్లా కలెక్టర్‌ ప్రద్యుమ్న కూడా ఎన్నికల కమిషన్‌కు లేఖ రాశారు. దీంతో ఆ రెండు గ్రామాల్లో కూడా రీ పోలింగ్‌కు ఆదేశిస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో చంద్రగిరి నియోజక వర్గ పరిధిలోని ఏడు పోలింగ్‌ కేంద్రాల్లో నేడు రీ పోలింగ్‌ నిర్వహించనున్నారు. 

పోలింగ్‌ను జీర్ణించుకోలేక...
ముఖ్యమంత్రి చంద్రబాబు తన సొంతూరు నారావారిపల్లి సమీపంలోని గ్రామాల్లో దశాబ్దాలుగా దళితులపై అరాచకాలు జరుగుతున్నా ఏనాడూ పట్టించుకున్న దాఖలాలు లేవు. పాతికేళ్లుగా ఓటు వేసేందుకు నోచుకోని దళితులకు ఎన్నికల కమిషన్‌ రీ పోలింగ్‌ ద్వారా ప్రజాస్వామ్య హక్కును వినియోగించుకునే అవకాశం కల్పించింది. అయితే ఈ పరిణామం టీడీపీకి మింగుడు పడటం లేదు. ఇన్నాళ్లూ ఏకపక్షంగా ఓట్లు వేసుకుంటూ వచ్చిన టీడీపీ నాయకులు రీ పోలింగ్‌ రోజు మరోసారి రిగ్గింగ్‌కు పాల్పడేందుకు  పథకం వేశారు. తమ ఉనికి, పెత్తందారీతనాన్ని నిలబెట్టుకునేందుకు పచ్చ నేతలు ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడేందుకు వ్యూహ రచన చేసినట్లు విశ్వసనీయ సమాచారం. నిఘా వర్గాల సమాచారం మేరకు ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసి అల్లర్లు సృష్టించేందుకు టీడీపీ గూండాలను రంగంలోకి దించినట్లు పేర్కొంటున్నారు. అందులో భాగంగా చిత్తూరు, బెంగళూరు ప్రాంతాల నుంచి రౌడీషీటర్లు, అల్లరి మూకలను రంగంలోకి దించారు. 

భారీ బందోబస్తు
పోలింగ్‌ జరిగే గ్రామాల్లో ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసేందుకు ఎన్నికల కమిషన్‌ భారీ ఏర్పాట్లు చేసింది. ప్రతి ముగ్గురు ఓటర్లకు ఒక పోలీసు చొప్పున 250 మందిని నియమించారు. ఏఎస్పీలు, డీఎస్పీలు, సీఐ, ఎస్‌ఐ, ఏఎస్‌ఐ, హెచ్‌సీ, పీసీ, స్పెషల్‌ పార్టీ పోలీసులు, ఏపీఎస్పీ బెటాలియన్లను రంగంలోకి దించారు. రీ పోలింగ్‌ కేంద్రాల్లో చిన్న గొడవలు జరిగినా వెంటనే అరెస్టు చేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. 

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
 

బంధువుల పేరుతో టీడీపీ నేతల ఇళ్లలో రౌడీషీటర్ల మకాం
వివిధ ప్రాంతాల నుంచి రప్పించిన రౌడీషీటర్లు, అల్లరి మూకలను రీ పోలింగ్‌ జరిగే సమీప గ్రామాల్లో టీడీపీ నేతలు దాచారు. చిత్తూరు నుంచి వచ్చిన కొందరు గూండాలు టీడీపీ నాయకుల నివాసాల్లో బంధువుల రూపంలో మకాం వేశారు. అవసరాన్ని బట్టి దేనికైనా సిద్ధంగా ఉండాలని వీరిని ఆదేశించినట్లు తెలిసింది. తిరుపతి పరిసర ప్రాంతాల్లోని లాడ్జీల్లో కూడా అల్లరి మూకలు మాటు వేశాయి. మరోవైపు దళిత, గిరిజన ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసి పోలింగ్‌ కేంద్రాలకు రాకుండా బెదిరిస్తున్నారు. ఓటర్లను గ్రామం నుంచి దూరంగా వెళ్లిపోవాలని ఆదేశిస్తున్నారు. కొందరి బంధువులను నయాన, భయాన లోబరచుకుని వారి ద్వారా ఓటర్లను అత్యవసరం పేరుతో ఊరి నుంచి బయటకు వాహనాల్లో తరలిస్తున్నారు. 

ఖాతాల్లోకి నగదు ట్రాన్స్‌ఫర్‌
పోలింగ్‌ గ్రామాల్లో టీడీపీ నేతలు ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారు. నేరుగా కాకుండా ఓటర్ల బ్యాంకు ఖాతా నంబర్లు తెలుసుకుని రాత్రంతా నగదు ట్రాన్స్‌ఫర్‌ చేశారు. ప్రధానంగా కాలేపల్లి, కుప్పం బాదూరు గ్రామాలను టార్గెట్‌గా చేసుకుని భారీ ఎత్తున నగదు ఓటర్ల ఖాతాల్లోకి చేరవేస్తున్నట్లు తెలిసింది. ఒక్కో ఓటుకు రూ.4 వేల నుంచి రూ.5 వేల చొప్పున ఖాతాల్లో జమ చేసినట్లు సమాచారం. తిరుపతిలోని ప్రధాన హోటళ్లను స్థావరాలుగా చేసుకుని ఈ వ్యవహారం నిర్వహిస్తున్నారు. చిత్తూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని 12 మంది కౌన్సిలర్లకు ఈ బాధ్యతలు అప్పగించారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top