కౌంటింగ్‌ను వివాదాస్పదం చేయండి

TDP orders for cadre to do controversy at Counting - Sakshi

క్యాడర్‌కు టీడీపీ ఆదేశాలు

ఓడిపోయే చోట్ల రీ కౌంటింగ్‌ కోసం ఒత్తిడి చేయాలని నిర్దేశం

ఘర్షణలు సృష్టించి వైఎస్సార్‌సీపీపై నిందలు వేసేందుకు పథకం

సాక్షి, అమరావతి: ఓటమి భయంతో ఓట్ల లెక్కింపును వివాదాస్పదం చేసేందుకు టీడీపీ అడ్డదారులు అన్వేషిస్తోంది. కౌంటింగ్‌ సమయంలో అల్లర్లు సృష్టించేందుకు టీడీపీ సిద్ధమైనట్లు విశ్వసనీయ సమాచారం. టీడీపీ రాష్ట్ర నేతల నుంచి జిల్లాల్లో ముఖ్య నాయకులు, క్యాడర్‌కు ఈ మేరకు స్పష్టమైన సూచనలు అందాయి. టీడీపీ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు ఇప్పటికే ఈవీఎంలతోపాటు ఎన్నికల సంఘంపై అడ్డగోలు ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే కౌంటింగ్‌ సందర్భంగా అల్లర్లు రేకెత్తించి వైఎస్సార్‌ సీపీపై నిందలు వేయాలని ఇప్పటికే టీడీపీ రాష్ట్ర కార్యాలయం నుంచి క్యాడర్‌కు ఆదేశాలు వెలువడ్డాయి.

తమకు ప్రతికూల ఫలితాలు వచ్చే కౌంటింగ్‌ సెంటర్ల వద్ద ఘర్షణలకు దిగాలని సూచించారు. ఏదో ఒక నెపంతో కౌంటింగ్‌ కేంద్రాల్లో ఏజెంట్లు గందరగోళం సృష్టించాలని, ఎన్నికల అధికారులతో వాగ్వాదానికి దిగాలని ఆదేశించినట్లు తెలిసింది. అలాంటి వైఖరి ఉన్నవారినే టీడీపీ కౌంటింగ్‌ ఏజెంట్లుగా నియమించాలని అగ్ర నాయకత్వం ఆదేశించడం ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తోంది.  

ఘర్షణకు దిగటంపై శిక్షణ 
టీడీపీ ఓడిపోయిన ప్రతి చోటా రీకౌంటింగ్‌కు పట్టుబట్టి ఒత్తిడి తేవాలని ఆదేశించారు. అన్ని వీవీ ప్యాట్‌ స్లిప్పులను లెక్కించాల్సిందిగా  పట్టుబట్టాలని సూచిస్తున్నారు. కౌంటింగ్‌ సమయంలో ఎలా గొడవ చేయాలనే అంశంపై ఇప్పటికే టీడీపీ ఏజెంట్లకు శిక్షణ ఇచ్చి ఓ బుక్‌లెట్‌ను సైతం పంపిణీ చేశారు. ఫిర్యాదులపై రెండు నమూనా పత్రాలను తయారు చేసి ముఖ్య నాయకులకు పంపారు. వీటి ఆధారంగా కౌంటింగ్‌లో గొడవలకు దిగాలనేది టీడీపీ ముఖ్య నాయకుల పథకంగా కనిపిస్తోంది.

వంద శాతం వీవీ ప్యాట్‌ స్లిప్పులను లెక్కించాలనే డిమాండ్‌ను తెరపైకి తెచ్చి ఘర్షణకు దిగాలనేది వారి వ్యూహంగా చెబుతున్నారు. ఈవీఎంలపై నెంబర్లు కనపడటం లేదని, అధికారులు పారదర్శకంగా వ్యవహరించడం లేదంటూ ఫిర్యాదులు చేసి ఫలితాల్లో జాప్యం జరిగేలా చూడాలని సూచిస్తున్నారు. మరోవైపు సీఎం చంద్రబాబు బుధవారం ఉండవల్లిలోని తన నివాసంలో అందుబాటులో ఉన్న నాయకులతో కౌంటింగ్‌పై చర్చించారు. పార్టీ అభ్యర్థులు, ముఖ్య నాయకులు, ఏజెంట్లతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించి కౌంటింగ్‌ సందర్భంగా ఏం చేయాలనే దానిపై పలు సూచనలు చేశారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top