ఉరిమే ఉత్సాహం

TDP MLA Amanchi Krishna Mohan Join In YSRCP - Sakshi

జిల్లాలో మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు మానుగుంట మహీధర్‌రెడ్డితో ఆరంభమైన వైఎస్సార్‌ సీపీలో చేరికల పర్వం ఆ తర్వాత మరింత ఊపందుకుంది. పీడీసీసీబీ మాజీ చైర్మన్‌ ఈదర మోహన్, గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు, పారిశ్రామిక వేత్త మద్దిశెట్టి వేణుగోపాల్‌ ఇలా ఒకరి తర్వాత మరొకరు వైఎస్సార్‌ సీసీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. తాజాగా  చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఆయన తనయుడు హితేష్‌ చెంచురామ్‌ల చేరికలతో ఇప్పటికే ప్రకాశం జిల్లాలో బలంగా ఉన్న వైఎస్సార్‌ సీపీ తిరుగులేని శక్తిగా ఆవిర్భవించింది. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది.  

సాక్షి ప్రతినిధి, ఒంగోలు : ఇతర పార్టీల నుంచి ముఖ్య నేతల చేరికలతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మరింత బలోపేతం అవుతోంది. తాజాగా బుధవారం చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ వైఎస్సార్‌ సీపీలో చేరారు. ఈనెల 13న హైదరాబాద్‌ లోటస్‌ పాండ్‌లో వైఎస్సార్‌ సీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసిన ఆమంచి పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. బుధవారం అమరావతిలో వైఎస్‌ జగన్‌ ఆమంచికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఆమంచితో పాటు ఆయన సోదరుడు స్వాములు, నియోజకవర్గానికి చెందిన అనుచర గణం పెద్ద ఎత్తున పార్టీలో చేరారు. అదేవిధంగా ఇటీవల వైఎస్‌ జగన్‌ను కలిసి పార్టీలో చేరబోతున్నట్టు ప్రకటించిన సీనియర్‌ నేత, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఆయన తనయుడు దగ్గుబాటి హితేష్‌ చెంచురామ్‌లు కూడా బుధవారం అమరావతిలో జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌ సీపీలో చేరారు. వారితో పాటు పర్చూరు నియోజకవర్గానికి చెందిన దగ్గుబాటి అనుచర గణం మొత్తం పార్టీలో చేరింది. అటు ఆమంచి, ఇటు దగ్గుబాటిలు బుధవారం ఉదయమే నియోజకవర్గం నుంచి వేలాది మంది కార్యకర్తలతో వైఎస్‌ జగన్‌ గృహ ప్రవేశం, పార్టీ కార్యాలయ 

ప్రారంభానికి తరలివెళ్లారు. అక్కడే జగన్‌ చేతుల మీదుగా కండువాలు కప్పుకుని పార్టీలో చేరారు. వీరి చేరికతో అటు చీరాల, ఇటు పర్చూరు నియోజకవర్గాల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మరింత బలోపేతమైంది. వీరందరి రాక జిల్లాలో వైఎస్సార్‌సీపీని తిరుగులేని శక్తిగా ఆవిర్భవించేలా చేస్తుందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

జిల్లాలో క్లీన్‌ స్వీప్‌ అంటున్న కేడర్‌..
ఇప్పటికే కందుకూరుకు చెందిన మానుగుంట మహీధర్‌రెడ్డి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరగా ఆతర్వాత గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు టీడీపీని వీడి వైఎస్సార్‌లో చేరారు. వీరితో పాటు జిల్లా వ్యాప్తంగా 12 నియోజకవర్గాల పరిధిలో అధికార టీడీపీతో పాటు ఇతర పార్టీలకు చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు, ముఖ్య నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. తాజాగా దగ్గుబాటితో పాటు ఎమ్మెల్యే ఆమంచి సైతం వైఎస్‌ఆర్‌సీపీలో చేరడంతో కార్యకర్తల్లో రెట్టించిన ఉత్సాహం నెలకొంది. జిల్లాలోని 12 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ విజయం సాధించడం ఖాయమని పార్టీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. వీరితో పాటు జిల్లాకు చెందిన మరి కొందరు ముఖ్యనేతలు త్వరలోనే అధికార పార్టీని వీడి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే జిల్లాలో వైఎస్సార్‌ సీపీకి తిరుగుండదని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

డీలా పడిన టీడీపీ..
వైఎస్సార్‌ సీపీ జోష్‌తో అధికార టీడీపీ జిల్లాలో డీలా పడింది. వరుసపెట్టి ముఖ్య నేతలందరూ ఆ పార్టీని వీడుతుండడంతో ఏం చేయాలో పాలుపోక ఆ పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. మిగిలి ఉన్న ఒకరిద్దరు ముఖ్యనేతలు ఆపార్టీని వీడితే వారు కోలుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికే ఒంగోలు పార్లమెంటు నుంచి టీడీపీ అభ్యర్థి«గా పోటీ చేసేందుకు అభ్యర్థి దొరకని పరిస్థితి నెలకొంది. ఎవరో ఒకరిని అభ్యర్థిగా నిలిపితే ఎన్నికలకయ్యే ఖర్చు తామే భరిస్తామని ముఖ్యమంత్రి ఆఫర్‌ ప్రకటించినట్లు ఆ పార్టీ వర్గాలే పేర్కొంటున్నాయి. పోటీ చేసేందుకు అభ్యర్థే దొరకని పరిస్థితుల్లో ఎన్నికల్లో ప్రతిపక్ష వైఎస్సార్‌ సీపీని ఎలా ఢీ కొట్టగలమని ఆ పార్టీకి చెందిన కొందరు నేతలే వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం. మొత్తంగా అధికార పార్టీతో పాటు ఇతర పార్టీల నుంచి పెద్ద ఎత్తున వలసలు పెరగడంతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో ఉత్సాహం ఉరకలేస్తోంది. 

మాజీ మంత్రి మహీధర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబులకు పార్టీ కండువా కప్పుతున్న జగన్‌(ఫైల్‌)

పీడీసీసీబీ మాజీ చైర్మన్‌ ఈదర మోహన్, మద్దిశెట్టి వేణుగోపాల్‌లను ౖÐð ఎస్సార్‌ సీపీలోకి ఆహ్వానిస్తున్న ఆపార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (ఫైల్‌)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top