వైఎస్సార్‌సీపీలోకి హిందూపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే

TDP Hindupur EX MLA Abdul Ghani Joins YSRCP - Sakshi

సాక్షి, శ్రీకాకుళం: అనంతపురం జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. హిందూపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్‌ నాయకుడు అబ్దుల్‌ గని శనివారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో అబ్దుల్‌ గని పార్టీలో చేరారు. గత నాలుగున్నరేళ్ల పాలనలో మైనారిటీలకు చంద్రబాబునాయుడు చేసేందేమీ లేదని ఈసందర్భంగా అబ్దుల్‌ గని పేర్కొన్నారు.

టీడీపీలో 30 ఏళ్లుగా తాను సేవలు అందించినా.. ప్రాధాన్యత కల్పించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మైనారిటీలకు నాలుగు శాతం రిజర్వేషన్‌ కల్పించిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డిదేనని గుర్తు చేశారు.  వైఎస్సార్‌ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం ద్వారా ఎంతోమంది విద్యార్థులు లబ్ధిపొందారని పేర్కొన్నారు. ప్రస్తుతం సీఎం చంద్రబాబు బావమరిది, ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రాతినిధ్యం హిందుపురం నియోజకవర్గం నుంచి టీడీపీ సీనియర్‌ నేత వైఎస్సార్‌సీపీలో చేరడం.. ఆ పార్టీ శ్రేణులకు గట్టి షాక్‌ ఇచ్చింది.

టీడీపీ సీనియర్ నేత అయిన అబ్దుల్ గని 2009 నుంచి 2014 వరకు హిందూపురం ఎమ్మెల్యేగా పనిచేశారు. 2014 ఎన్నికల్లో సినీ నటుడు బాలకృష్ణ కోసం ఆయన హిందూపురం సీటును వదులుకున్నారు. అబ్దుల్‌ గని చేసిన ఈ త్యాగానికి ప్రతిఫలంగా ఎమ్మెల్సీ పదవి ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ, నాలుగున్నరేళ్లు అవుతున్నా ఆ హామీని నెరవేర్చలేదు. మరోవైపు ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా ఆయనను పట్టించుకోకుండా అవమానాలకు గురిచేశారు. ఈ నేపథ్యంలో ప్రజానేత వైఎస్‌ జగన్‌కు పెరుగుతున్న ప్రజాభిమానానికి తాను సైతం మద్దతు పలుకుతూ.. అబ్దుల్‌ గని  తాజాగా వైఎస్సార్‌సీపీలో చేరారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top