దక్షిణంలో హిందీ ప్రకంపనలు

Tamil Nadu Protest Against New Education System In Hindi - Sakshi

సరికొత్త జాతీయ విద్యావిధానంలో నిర్బంధ హిందీ

హిందీ మాట్లాడని రాష్ట్రాల్లో 

ఆరో తరగతి నుంచి అమలు

 నిర్బంధ హిందీపై నిరసనలు

హిందీ మాట్లాడని రాష్ట్రాల్లో హిందీ పాఠ్యాంశాలను విధిగా చేర్చాలని కస్తూరీ రంగన్‌ కమిటీ చేసిన సిఫార్సు రాష్ట్రంలో ప్రకంపనలకు దారితీసింది. హిందీ భాషను బలవంతంగా రుద్దితే సహించేది లేదని అధికార అన్నాడీఎంకే మినహా అన్నిపార్టీలూ తమ నిరసనను వ్యక్తం చేశాయి. రాష్ట్రంలో నిర్బంధ హిందీ అమలు చేస్తే అడ్డుకుంటామని హెచ్చరించాయి.

సాక్షి ప్రతినిధి, చెన్నై: ప్రస్తుతం అమలులో ఉన్న విద్యావిధానాన్ని 1986లో ప్రవేశపెట్టగా, 1992లో కొన్ని సవరణలు చేశారు. సరికొత్త విద్యావిధానాన్ని తీసుకొస్తామని 2014 నాటి ఎన్నికల్లో బీజేపీ హామీ ఇచ్చింది. ఈ హామీ మేరకు ఇస్రో మాజీ చైర్మన్‌ కస్తూరీ రంగన్‌ నేతృత్వంలో తొమ్మిది మందితో కూడిన నిపుణుల కమిటీని కేంద్రం నియమించింది. ఈ కమిటీ తన నివేదికను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి రమేష్‌ పోకిరియాల్‌ నిషాకు శుక్రవారం సమర్పించింది. కొత్త జాతీయ విద్యాపథకం లక్ష్యాలను అందులో పొందుపరిచింది. జాతీయ విద్యావిధానాన్ని రూపొందించడం, ప్రయివేటు పాఠశాలల్లో ఫీజుల పెంపును కట్టడి చేయడం వంటి అంశాలతోపాటూ హిందీ మాట్లాడని రాష్ట్రాల్లో హిందీని నేర్పించాలని సిఫార్సు చేసింది.

కమిటీ సమర్పించిన 484 పేజీలతో కూడిన ఈ నివేదికలో మూడు భాషల విధానాన్ని విధిగా అమలు చేయాలని సూచించింది. హిందీ మాట్లాడే రాష్ట్రాలు, హిందీ మాట్లాడని రాష్ట్రాలుగా రెండుగా విభజించించింది. హిందీ మాట్లాడని రాష్ట్రాల్లో ఇంగ్లిషు, ఆయా రాష్ట్రాల మాతృభాషతోపాటూ హిందీని సైతం విధిగా అభ్యసించాలని తన సిఫార్సులో పేర్కొంది. ఆరోతరగతి నుంచి నిర్బంధ హిందీ విద్యావిధానాన్ని ప్రవేశపెట్టాలని సూచించింది. సరికొత్త జాతీయ విద్యావిధానంపై ప్రజలు తమ అభిప్రాయాలను ఈనెల 30లోగా వెబ్‌సైట్‌ ద్వారా తెలియజేయవచ్చని తెలిపింది. అయితే ఏ భాషపైనా నిర్బంధం విధించాలని ఆ కమిటీ సిఫార్సు చేయలేదని కేంద్రం చెబుతోంది.

రాష్ట్రంలో ద్విభాషా విధానమే మంత్రి సెంగొట్టయ్యన్‌
కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టబోతున్న త్రిభాషా విద్యావిధానాన్ని రాష్ట్రంలో అనుమతించే ప్రసక్తే లేదు, ద్విభాషా విధానమే కొనసాగుతుందని పాఠశాల విద్యాశాఖా మంత్రి సెంగొట్టయ్యన్‌ స్పష్టం చేశారు. చెన్నైలో శనివారం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అనాధిగా ద్విభాషా విధానమే అమల్లో ఉంది, ఎంజీ రామచంద్రన్, జయలలిత ఆశయాలకు అనుగుణంగా తమిళం, ఇంగ్లిషు భాషలు మాత్రమే పరిగణనలో ఉన్నాయి. ఇకపై కూడా అదే విధానం కొనసాగుతుందని ఆయన అన్నారు.

దినకరన్‌ నిరసన
హిందీ మాట్లాడని రాష్ట్రాల్లో హిందీని ఒక పాఠంగా చేర్చడంపై అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌ నిరసన ప్రకటించారు. ఈ విధానం హిందీ మాట్లాడని వారిని ద్వితీయశ్రేణి పౌరులుగా పరిగణించే ప్రమాదం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్రం వెంటనే హిందీ నిర్ణయాన్ని వెనక్కుతీసుకోవాలని కోరారు.

కనిమొళి ఖండన
హిందీ భాషను బలవంతంగా రుద్దితే డీఎంకే అడ్డుకుంటుందని ఆ పార్టీ అగ్రనేత, లోక్‌సభ సభ్యురాలు కనిమొళి హెచ్చరించారు. శనివారం ఉదయం చెన్నై విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడుతూ, కొత్త విద్యావిధానం కింద ఇంగ్లిషు తరువాత హిందీ పాఠ్యాంశాన్ని విధిగా అభ్యసించాలనే కేంద్రప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. పార్లమెంటు సమావేశాల్లో హిందీకి వ్యతిరేకంగా డీఎంకే గళం వినిపిస్తానని చెప్పారు.

కమల్‌హాసన్‌ ఖండన
తమిళభాషతో ప్రజలు ఎంతో సంతృప్తిగా ఉండగా హిందీని బలవంతంగా రుద్దడం సరికాదని మక్కల్‌ నీది మయ్యం అధ్యక్షుడు కమల్‌హాసన్‌ ఖండించారు. తిరుచ్చిరాపల్లి విమానాశ్రయంలో శనివారం మీడియాతో మాట్లాడుతూ తమిళం కాదని హిందీపై నిర్బంధించడం తనకు బాధ కలిగిస్తోందని అన్నారు. ప్రజలపై ఏ భాషను బలవంతంగా రుద్దడం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు. నిర్బంధ హిందీని అమలుచేస్తే ఆందోళన తప్పదని ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగో కేంద్రాన్ని హెచ్చరించారు.

 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top