
సాక్షి ప్రతినిధి, చెన్నై: రాజకీయాల్లో శాశ్వత శతృత్వం, శాశ్వత మితృత్వం ఉండదని తమిళనాడు రాజకీయాలు మరోసారి చాటిచెప్పాయి. ఎడమొహం.. పెడమొహంగా ఉండిన డీఎంకే, కాంగ్రెస్ నేతలు శనివారం రాజీబాట పట్టారు. కూటమి పదిలమని ప్రకటించారు. తమిళనాడు డీఎంకే, కాంగ్రెస్ కూటమి ఎంతోకాలంగా కొనసాగుతోంది. లోక్‌సభ, రాజ్యసభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఒకరి విజయానికి మరొకరు పాటుపడుతూ దోస్త్‌మేరా దోస్త్ అంటూ సాగుతున్నారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న దశలో కాంగ్రెస్ నుంచి కలహం మొదలైంది. ఇటీవల చెన్నై విమానాశ్రయంలో బీజేపీ నేత నయనార్ నాగేంద్రన్‌తో స్టాలిన్ ముచ్చట్లాడడాన్ని తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కేఎస్ అళగిరి సీరియస్‌గా తీసుకున్నారు. డీఎంకేపై పరోక్షంగా విమర్శలు చేశారు. అంతేగాక స్థానిక సంస్థల ఎన్నికల్లో డీఎంకే తమ పార్టీకి తగిన ప్రాధాన్యత కల్పించలేదని బహిరంగంగా ఆరోపించారు. ఆగ్రహించిన స్టాలిన్ ఇటీవల సోనియాగాంధీ నేతృత్వంలో ఢిల్లీలో జరిగిన పౌరసత్వ చట్ట సవరణ వ్యతిరేకర దీక్షకు హాజరుకాలేదు.
డీఎంకే–కాంగ్రెస్ కూటమి బీటలువారింది, డీఎంకే..బీజేపీకి చేరువకానుందనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో కేఎస్ అళగిరి ఇటీవల ఢిల్లీకి వెళ్లి సోనియాగాంధీని కలుసుకున్నారు. కూటమి గురించి ప్రస్తావించినపుడు ఆయనను సోనియా మందలించినట్లు సమాచారం. ఇలాంటి రాజకీయ వాడివేడి వాతావరణంలో పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి అకస్మాత్తుగా శనివారం చెన్నైకి వచ్చి డీఎంకే కేంద్ర కార్యాలయంలో స్టాలిన్‌ను కలుసుకున్నారు. సుమారు 30 నిమిషాలపాటు వారిద్దరి మధ్య సంభాషణ జరిగింది. తమ భేటీలో రాజకీయాలు ఏమీలేవు, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చానని నారాయణ స్వామి మీడియాతో అన్నాడు.
డీఎంకే కూటమి బీటలు వారలేదని మీడియా ప్రతినిధులు అడిగిన ఒక ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పారు. టీఎన్‌సీసీ అధ్యక్షులు కేఎస్ అళగిరి, కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత రామస్వామి, సీనియర్ నేతలు తంగబాలు, గోపన్నా సైతం డీఎంకే కార్యాలయానికి వచ్చి స్టాలిన్‌తో భేటీ అయ్యారు. డీఎంకే–కాంగ్రెస్ కూటమి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లోనూ కొనసాగుతుందని, తమది విక్టరీ కూటమని ఏనాడో నిరూపణ అయిందని ఈ సందర్భంగా కేఎస్ అళగిరి మీడియాకు తెలిపారు. డీఎంకే, కాంగ్రెస్ కూటమి గురించి ఎలాంటి అభిప్రాయాలను బహిరంగా వెల్లడిచేయరాదని రెండు పార్టీల కార్యకర్తలను స్టాలిన్ కోరారు.