
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి ప్రతినిధి, చెన్నై: కేంద్రంలో సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది భారతీయ జనతా పార్టీ. అంతేకాదు దేశమంతా బలంగా విస్తరిస్తూ.. ఉనికిని చాటుకుంటోంది. అయినా ఏం లాభం... రాష్ట్రానికి మాత్రం కమల‘నాథుడే’ కరువయ్యాడని వాపోతున్నారు తమిళ బీజేపీ శ్రేణులు. బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు కావాలి బాబోయ్ అంటూ అధిష్టానానికి సంకేతాలు పంపుతున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న తమిళిసై సౌందరరాజన్.. సెప్టెంబరు 1న తెలంగాణ గవర్నర్‌గా నియమితులైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ అధ్యక్ష పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి ఆమె రాజీనామా చేయాల్సి వచ్చింది. కేంద్రంలో బలమైన బీజేపీ ప్రభుత్వం, దేశమంతా బీజేపీ క్రేజు నెలకొని ఉండడంతో ఖాళీ అయిన రాష్ట్ర అధ్యక్ష పీఠం కోసం సీనియర్ నేతల మధ్య బలమైన పోటీ ఏర్పడింది. గతంలో రాష్ట్రశాఖ అధ్యక్షుడిగా, గత కేంద్ర కేబినెట్‌లో సహాయ మంత్రిగానూ పనిచేసిన పొన్ రాధాకృష్ణన్, సీనియర్ నేతలు హెచ్ రాజా, సీపీ రాధాకృష్ణన్, రాష్ట్ర మాజీ మంత్రి నయనార్ నాగేంద్రన్ ఈ పదవి కోసం పోటీపడుతున్నారు.
ఈ నేపథ్యంలో ఎవరికివారు ఢిల్లీలో పార్టీ అధిష్టానం వద్ద పావులు కదిపారు. ఈ క్రమంలో ఒకటి రెండురోజుల్లో రాష్ట్ర శాఖ అధ్యక్షుడి నియామకం జరిగిపోతుందని అందరూ అంచనావేశారు. అయితే నెలరోజులు దాటిపోయినా ఆ ఊసేలేకుండా పోయింది. రాష్ట్ర రథసారథి లేకపోవడంతో పార్టీ కార్యక్రమాల్లో దాదాపు ప్రతిష్టంభన నెలకొంది. ఏమి చేయవచ్చు, ఏది చేయకూడదో తెలియక కార్యకర్తలు కొట్టుమిట్టాడుతున్నారు. అంతేగాక పార్టీపరమైన విషయాలను ఎవరిని అడగాలనే అయోమయంలో పడిపోయారు.
ఈ క్రమంలో పార్టీలో ఇలాంటి సందిగ్ధత నెలకొని ఉన్న దశలో నాంగునేరీ, విక్కిరవాండి ఉప ఎన్నికలు వచ్చాయి. ఈనెల 21న పోలింగ్ జరగనుంది. గడిచిన లోక్‌సభ ఎన్నికల నుంచి అధికార అన్నాడీఎంకే మిత్రపక్షంగా కొనసాగుతున్న బీజేపీ ఏదో ఒక స్థానంలో పోటీచేసే అవకాశం ఉండేది. సీటు కేటాయింపుపై కొందరు సీనియర్ బీజేపీ నేతలు.. అన్నాడీఎంకే అగ్రనేతలను సంప్రదించారు. అయితే బీజేపీకి మొండిచేయే మిగిలింది. తమ పార్టీ, ప్రభుత్వం దయవల్లే రాష్ట్రంలో అన్నాడీఎంకే ప్రభుత్వం కొనసాగుతున్నా కనీస మర్యాద పాటించకుండా ఉప ఎన్నికల్లో పోటీకి బీజేపీని తిరస్కరించారని వారు వారు రుసరుసలాడుతున్నారు. నాంగునేరీలో పోటీచేయడం ద్వారా అన్నాడీఎంకేకు గట్టిబుద్ధి చెప్పాలని కొందరు బీజేపీ నేతలు ఒత్తిడిచేశారు. ఈ పరిస్థితిలో రాష్ట్రంలో ఎవరిని సంప్రదించాలి, ఢిల్లీలో ఎవరిని కలుసుకుని తమ అభిప్రాయాన్ని వెల్లడించాలో తెలియక రాష్ట్ర నేతలు సతమతమయ్యారు. అంతేగాక బీజేపీ అధిష్టానం మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తలమునకలై ఉండడంతో ఢిల్లీ స్థాయిలో చేసిన చివరి ప్రయత్నం కూడా విఫలమైంది.
ఇదిలా ఉండగా, ఉప ఎన్నికల్లో రెండుస్థానాల్లోనూ అన్నాడీఎంకే అభ్యర్థులే పోటీకి దిగారు. ఉప ఎన్నికల్లో ప్రచారం చేయాల్సిందిగా లోక్‌సభ ఎన్నికల నాటి మిత్రపక్షాలైన పీఎంకే, డీఎండీకే, సమక పార్టీలను అన్నాడీఎంకే నేతలు కోరారు. అయితే అదే కూటమిలో ఉన్న బీజేపీని ప్రచారానికి నామమాత్రంగా కూడా అన్నాడీఎంకే కోరలేదని తెలుస్తోంది. బీజేపీతో ప్రచారం చేయించుకుంటే దక్కాల్సిన ఓట్లు కూడా చేజారిపోతాయనే ఆలోచనతోనే అన్నాడీఎంకే ఇలా వ్యవహరించిందని అనుమానిస్తున్నారు. రాష్ట్ర అధ్యక్షుడి నియామకం జరిగితేగానీ ఈ గందరగోళ పరిస్థితులకు తెరపడదని వాపోతున్నారు. కాగా, దేశవ్యాప్తంగా బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ముమ్మురంగా సాగుతోంది. సంస్థాగత ఎన్నికలకు సైతం సమాయత్తం అవుతున్నారు. సంస్థాగత ఎన్నికలు ఈ ఏడాది డిసెంబర్ వరకు కొనసాగే అవకాశం ఉంది. సంస్థాగత ఎన్నికలు ముగిసేవరకు రాష్ట్ర అధ్యక్షుని నియామకం జరగకపోవచ్చనే ఆలోచనతో పార్టీ శ్రేణులు డీలాపడిపోయారు.