ప్రత్యేక హోదాకు పలు పార్టీల మద్దతు

Support from multiple parties to special status - Sakshi

ఏపీకి ప్రత్యేక హోదాపై రాజ్యసభలో నాలుగు గంటలపాటు చర్చ

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రం ఇచ్చిన హామీకి కట్టుబడి ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని పలు పార్టీలు కోరాయి. ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ చట్టంలోని హామీల అమలుపై మంగళవారం రాజ్యసభలో నాలుగు గంటల పాటు జరిగిన స్వల్పకాలిక చర్చలో దాదాపు 25 మంది సభ్యులు మాట్లాడారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నుంచి వి.విజయసాయిరెడ్డి, టీడీపీ నుంచి వై.ఎస్‌.చౌదరి, సీఎం రమేష్, కాంగ్రెస్‌ నుంచి మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్, గులాం నబీ ఆజాద్, కేవీపీ రాంచంద్రరావు, జైరాం రమేశ్, ఆనంద్‌శర్మ, సమాజ్‌వాదీ పార్టీ నుంచి రాంగోపాల్‌యాదవ్, తృణమూల్‌ కాంగ్రెస్‌ నుంచి డెరెక్‌ ఒబ్రెయిన్, ఏఐఏడీఎంకే నుంచి నవనీత్‌ కృష్ణన్, బీజేడీ నుంచి ప్రసన్నాచార్య, జేడీయూ నుంచి రామచంద్ర ప్రసాద్‌ సింగ్, టీఆర్‌ఎస్‌ నుంచి కె.కేశవరావు, సీపీఎం నుంచి టి.కె.రంగరాజన్‌ తదితరులు మాట్లాడారు.

ఎస్పీ నేత రాంగోపాల్‌ యాదవ్‌ మాట్లాడుతూ రాష్ట్రాల విభజనతో సమస్యలు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వడంతో పొరుగు రాష్ట్రాలు ఇబ్బంది పడ్డాయని వివరించారు. టీఎంసీ నుంచి డెరెక్‌ ఒబ్రెయిన్‌ మాట్లాడుతూ ఎన్డీయే నుంచి పార్టీలు ఎందుకు దూరమవుతున్నాయో గమనించాలని, సమాఖ్య స్ఫూర్తిని కోరుకునే పార్టీలన్నీ బీజేపీని వ్యతిరేకిస్తున్నాయని పేర్కొన్నారు. ఏపీతో పాటు ఒడిశాకు ప్రత్యేక హోదా ఇవ్వాలని బీజేడీ సభ్యుడు ప్రసన్నాచార్య పేర్కొన్నారు.

ప్రత్యేక హోదాను వ్యతిరేకిస్తున్నట్టు శిరోమణి అకాళీదళ్‌ సభ్యుడు నరేష్‌ గుజ్రాల్‌ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ఆవేదనను పంచుకుంటున్నట్టు సీపీఐ సభ్యుడు డి.రాజా పేర్కొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆప్‌ సభ్యుడు సంజయ్‌ సింగ్‌ పేర్కొన్నారు. ఏపీకి రైల్వే జోన్‌ ఇస్తే తమకు అభ్యంతరం లేదని, అయితే తమ పరిధిలోని రైల్వేను ఆ జోన్‌లో కలపరాదని ఒడిశాకు చెందిన బీజేడీ సభ్యుడు అనుభవ్‌ మొహంతీ పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top