మళ్లీ నేనే సీఎం అవుతానేమో? : సిద్దరామయ్య

Siddaramaiah Says I Will Once Again Become CM - Sakshi

సాక్షి, బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ద రామయ్య తన భవిష్యత్‌ రాజకీయాలపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజల ఆశీర్వాదం ఉంటే మరోసారి సీఎం అవుతానంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇవే తన చివరి ఎన్నికలని, అనంతరం రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికల్లో ఊహించని ఓటమి అనంతరం ఆయన మనసు మార్చుకొని యూటర్న్‌ తీసుకున్నట్టు తెలుస్తోంది. మరోసారి సీఎం కుర్చీలో కూర్చోవాలని ఆశపడుతున్నారు. 

తాజాగా ఓ సమావేశంలో ‘ప్రజల ఆశీస్సులు ఉంటే రెండో పర్యాయం రాష్ట్రానికి సీఎం అవుతాను. ప్రతిపక్షాలన్నీ కలిసి నన్ను గెలవకుండా అడ్డుకున్నాయి. నాకు నమ్మకం ఉంది. ప్రజలు మరోసారి సీఎం పీఠంపై నన్ను కూర్చోబెడతారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం బాధ కలిగించింది. అయితే అవే నా చివరి ఎన్నికలు కావు. రాజకీయాల్లో గెలుపోటములు సాధారణం.’  అంటూ సిద్ద రామయ్య పేర్కొనడం విశేషం. 

కుమారస్వామి పాలనపై అసంతృప్తి
ఈ ఏడాది సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను తిరిగి అధికారంలోకి తీసుకురాలేకపోయిన ఆయనకు బద్దశత్రువులతో కలసి పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యమంత్రిగా హెచ్‌డీ కుమారస్వామి కంటే యడ్యూరప్ప అయితేనే సిద్ధరామయ్య ఇష్టపడేవారని గతంలో సన్నిహితులు పేర్కొన్న విషయం తెలిసిందే. కాంగ్రెస్‌ అధిష్టానం మాత్రం జేడీఎస్‌తో కూటమిని కొనసాగించాలని ఆయన్ను ఒత్తిడి చేస్తోంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో వాస్తవాలను తెలుసుకుని మసులుకోవాలని సిద్ధరామయ్యకు హితబోధ చేస్తోంది.

కర్ణాటక రాష్ట్రంలో దేవెగౌడ కుటుంబం పాలన చేయడం సిద్ధరామయ్యకు సహించడం లేదు. కుమారస్వామి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టడం కూడా నచ్చక అధిష్టానంతో కొంత అసంతృప్తితో ఉన్నారు. కాంగ్రెస్‌, జేడీఎస్‌ వెనుక పాలనలో నడవడం మరీ రుచించడం లేదు. కాంగ్రెస్‌- జేడీఎస్‌ కూటమిలోని ప్రభుత్వం ఐదేళ్లపాటు కొనసాగుతుందా అన్ని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top