బురఖా బ్యాన్‌పై వెనక్కి తగ్గిన సంజయ్‌ | Sakshi
Sakshi News home page

బురఖా బ్యాన్‌పై వెనక్కి తగ్గిన సంజయ్‌

Published Sun, May 5 2019 7:14 PM

Shiv Sena Did Not Demand Burqa Ban: Sanjay Raut - Sakshi

సాక్షి, ముంబై: బురఖా నిషేధంపై ఇటీవల సామ్నా సంపాదకీయంలో చేసిన వ్యాఖ్యలు శివసేన ఎంపీ, పార్టీ అధికార ప్రతినిధి సంజయ్‌ రావుత్‌ ఆదివారం ఉప సంహరించుకున్నారు. దీంతో గత వారం రోజులుగా జరుగుతున్న ఈ వివాదానికి తెరపడినట్లు అయింది. గత నెలలో శ్రీలంకలో ఈస్టర్‌ వేడుకల సందర్బంగా వివిధ చర్చిల్లో వరుస పేలుళ్లు వందలాది మంది  ప్రాణాలు కోల్పోయారు. ఆ తరువాత పేలుళ్లకు ఓ ఉగ్రవాద సంస్ధ బా«ధ్యత వహిస్తూ ప్రకటన చేసింది. దీంతో దేశ ప్రజల భద్రత దృష్ట్య శ్రీలంకా ప్రభుత్వం ముస్లిం మహిళలు బుర‍్ఖా ధరంచడంపై నిషేధం విధించింది.

చదవండి: (బురఖా బ్యాన్‌కు కేంద్ర మంత్రి నో..)

ఇదే తరహాలో భారతదేశంలో కూడా బుర్ఖాలను నిషేధించాలని శివసేన పార్టీ పత్రిక సామ్నా సంపాదకీయాలో సంజయ్‌ రావుత్‌ ఇటీవల వ్యాఖ్యలు రాసిన సంగతి తెలిసిందే. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా ముస్లిం సంఘాలు, మహిళల నుంచి నిరసనలు వెల్లువెత్తాయి. ఆ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ ర్యాలీలు నిర్వహించి కలెక్టర్లకు వినతి పత్రాలు సమర్పించారు. సర్వత్రా వ్యతిరేకత రావడంతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కసాగింది. దీంతో పరిస్ధితులు అదుపుతప్పక ముందే సంజయ్‌ రావుత్‌ ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించారు. ఇది కేవలం తన వ్యక్తిగత అభిప్రాయమని, వాస్తవ సంఘటనలపై విశ్లేషణలో ఒక భాగంగానే సంపాదకీయంలో పొందుపరిచామని స్పష్టం చేశారు. బుర్ఖా నిషేధించాలని శివసేన పార్టీగాని, ఆ పార్టీ చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రేగాని డిమాండ్‌ చేయలేదని సంజయ్‌ వెల్లడించారు. 
 

Advertisement
Advertisement