వరుణ్‌ గాంధీకి సొంత పార్టీ నుంచే చురకలు

On Rohingya Issue, It's Varun Gandhi vs Union Minister Hansraj Ahir

సాక్షి, న్యూఢిల్లీ : రోహింగ్యా శరణార్థులకు మద్దతుగా వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ వరుణ్‌ గాంధీకి సొంత పార్టీ నుంచే ఎదురుదెబ్బ తగిలింది. ఆయన అభిప్రాయాన్ని ఖండిస్తూ.. నరేంద్రమోదీ కేబినెట్‌కు చెందిన సీనియర్‌ మంత్రి హన్సరాజ్‌ అహిర్‌ సీరియస్‌గా స్పందించారు. రోహింగ్యా శరణార్థులను బహిష్కరించే విషయంలో బీజేపీ వైఖరిని తప్పుపడుతూ వరుణ్‌ గాంధీ 'నవ్‌భారత్‌ టైమ్స్‌'లో ఓ వ్యాసాన్ని రాశారు. మయన్మార్‌ నుంచి వచ్చిన రోహింగ్యాలను శరణార్థులుగా పరిగణించాలని ఆయన ఈ వ్యాసంలో కోరారు. వరుణ్‌ గాంధీ వ్యాఖ్యలు దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్నాయని హన్సరాజ్‌ స్పందించారు. రోహింగ్యాల విషయంలో కేంద్రప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎవరు వెళ్లడానికి వీలులేదంటూ వరుణ్‌ గాంధీని హెచ్చరించారు.  

రోహింగ్యా శరణార్థుల్లో కొంతమందిని పాకిస్తాన్‌ ఉగ్రవాద గ్రూప్‌లు ఎరవేస్తున్నాయని  కొన్ని రోజుల క్రితమే కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. వీరు అక్రమ వలసదారులని, శరణార్థులు కారని పేర్కొంది. ఈ ముస్లింల వల్ల జాతీయ భద్రతకు పెనుముప్పు ముంచి ఉందని కేంద్ర హోం శాఖ ఆందోళన వ్యక్తంచేసింది. అంతేకాక వీరు భారత్‌లో మతహింసను ప్రేరేపించే అవకాశముందని చెప్పింది. అయితే రోహింగ్యాలకు శరణార్థుల గుర్తింపు కల్పించాలంటూ, ప్రభుత్వ వైఖరికి భిన్నంగా వరుణ్‌ గాంధీ కేంద్రాన్ని కోరుతున్నారు. ఆయన రాసిన వ్యాసంలో రోహింగ్యా శరణార్థులు, విదేశీ పాలసీ, దేశీయ రాజకీయాలకు బాధితులని పేర్కొన్నారు. ప్రభుత్వ వైఖరికి పూర్తిగా భిన్నంగా తన అభిప్రాయాలు వెల్లడించారు. అంతర్జాతీయ ఒప్పందాల్లో భారత్‌ కూడా సంతకం చేసిందని, శరణార్థులకు సాయం చేసే మంచి సంప్రదాయాన్ని మనం కలిగి ఉన్నామంటూ వివరించారు. ఆర్టికల్‌ 17 ప్రకారం మానవతావాదంతో దేశం ఎవరినీ బహిష్కరించడానికి వీలులేందంటూ పేర్కొన్నారు.

కానీ దేశప్రయోజాలను దృష్టిలో పెట్టుకున్న వారెవరూ ఇలాంటి వ్యాఖ్యలు చేయరంటూ అహిర్‌ మండిపడ్డారు. రోహింగ్యాల విషయంలో కేంద్రప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎవరూ కూడా వెళ్లడానికి వీలులేదంటూ హెచ్చరించారు. అహిర్‌ స్పందనను గౌరవిస్తూ, మరో బీజేపీ నేత షైనా కూడా ప్రభుత్వం తన జాబ్‌ తాను చేస్తుందనంటూ.. ఈ సమస్యను మోదీ ప్రభుత్వం చాలా సమర్థవంతంగా పరిష్కరిస్తుందని, ఎవరైనా మానవతావాదాన్ని ఎత్తిచూపాలంటే, తొలుత సమస్యను అర్థం చేసుకోవాలని వరుణ్‌ గాంధీకి సూచించారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top